27, జులై 2022, బుధవారం

మంచిని గ్రహించండి!*

 XI. 9.1-5.270722-8.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


          *మంచిని గ్రహించండి!*

                  ➖➖➖✍️


*మంచిని గ్రహించండి! చెడుని వదలండి!!*

      …మీ చామర్తి మల్లికార్జున శర్మ 

                                   శ్రీకాకుళం.



* క్షమిస్తున్నారు కదా అని*

*మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ*

*కష్టపెట్టకు!*


*వాళ్ళు ఒక్క క్షణం*

*మంచితనాన్ని మర్చిపోయారంటే*

*వేరేలా మారడానికి*

*నిమిషం కూడా పట్టదు!*


*మనకు ఎన్ని పనులు ఉన్నా*

*ఉదయాన్నే మనసుకు నచ్చినవారిని* *పలకరించడంలో ఉండే ఆనందం*

*మాటల్లో చెప్పలేం!*


*విలువ లేని దుమ్ము కూడా,*

*ఒక్కోసారి నీ కంట్లో పడి,*

*నిన్ను విలవిలలాడేలా చేస్తుంది..!*


*అలాగే కొందరు విలువ లేని మనుషులు కూడా,*

*చాలాసార్లు వారి మాటలతో బాధపెడతారు,*


*ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముల లక్షణం...!*


 *"నీ చుట్టూ ఉన్నవాళ్ళ స్థానం, స్థాయి మారితే*

*నిన్ను మర్చిపోతారేమో.*


*అయినా కూడా* 

*నువ్వు నీలానే ఉండాలి!* 

*స్థానం మారినా, స్థాయి మారినా!*

*అదే వ్యక్తిత్వం అంటే!"*



 *"ఏదీ శాశ్వతం కాదు!*

*నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు.*

*ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే*

*మారిపోక తప్పదు."*



 *కాలం ఎందరినో*

*పరిచయం చేస్తుంది.*

*కానీ కొందరినే*

*మనసుకు నచ్చిన వారిగా*

*మార్చుతుంది.*

*అది స్నేహమైనా, ప్రేమైనా..!!*


 *మనిషిని గెలుచుకోవడంలో*

*సంతోషం ఎన్నిరోజులు*

*ఉంటుందో తెలియదు కానీ...*

*మనసును గెలుచుకోవడంలో*

*ఉండే సంతోషం మాత్రం...*

*జీవితాంతం ఉంటుంది....!!*


 *మనం ఇతరులకి సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకి ఇవ్వడమే తెలుసు. మంచి మనుషులు కూడా అంతే… ఇతరులకి సాయం చెయ్యడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమీ ఆశించరు!*


 *మన కష్టంలో మనవాళ్లే*

*కలిసిరానప్పుడు*

*ఎవరో ఆదుకోవడానికి*

*రాలేదని బాధపడటం*

*అనవసరం.*


*ఎక్కువగా నమ్మటం,*

*ఎక్కువగా ప్రేమించటం,*

*ఎక్కువగా ఆశించటం..*

*ఫలితంగా వచ్చే బాధ కూడా*

*ఎక్కువగానే ఉంటుంది.*✍️


. 🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

                     

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

కవితా చమత్కారం

 శుభోదయం👏


కవితా  చమత్కారం!

-------------------------------- 


                  చ:  కలశ పయోధి  మీద  తరఁగల్  మరి 'హోయని'  మ్రోయ ,  వేయిభం


                        గుల  తలపాన్పు  పాము  బుసఁగొట్టఁగ ,  నేగతి  నిద్రఁ  జెందెదో ?


                        అలసత  తండ్రి !  చీమ చిటుకన్నను  నిద్దుర  రాదు  మాకు  , ఓ


                        బలవదరీ !  దరీకుహర  భాస్వదరీ !  యదరీ !  దరీ ! హరీ !


                          చాటుపద్యం-   అజ్ఙాత కర్తృకం ;


                          కవితా చమత్కారాలు  యెన్నిరీతులో?  ఒకొక్క  కవిది  ఒక్కొక్క  ఊహ! ఆవూహకు తగ్గ భావసంపద. దానిని ఆవిష్కరించే  చక్కని పద్యరచన!  అత్యద్భుత మనిపించక మానదు.


                          మనం నిద్ర పోతుంటే  అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. ఏమాత్రం చిన్నశబ్దమైనా మెళకువ వచ్చి ప్రక్క వారిపై విసుగు ప్రదర్శిస్తాం. అదే లోకేశ్వరునకు  ఆపరిస్థితే వస్తే  ఆయన కెంత బాధ? కానీ యివేవీ పట్టించుకోకుండా  ఓదేవాది దేవుడు

నిద్రపోతున్నాడట. ఆయన నిద్రను జూచి యీకవి యబ్బురపడుతున్నాడు.  పదండి ఆసంగతేమిటో చూద్దాం;


                  "  పాల  సముద్రంలో   కెరటాలు  హోరుమని మోత పెడు తుండగా, వేయితలల నాగు  ఆదిశేషుడు  బుసలు కొడుతుండగా ,   లోకపాలనతో అంతగా అలసిపోయిన నీవు  యెలా నిదురించినావయా ? నాయనా?  మాకైతే  చీమచిటుకన్నా

నిద్దుర రాదే ,  అబ్బో నీవు చాలా గొప్పవాడివేనయ్యా!  అంటూ తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడీ కవి.


                     అంత భయంకరమైన  చప్పుడవుతున్నా  నిమ్మకు నీరెత్తినట్లు  నిశ్చలంగా నిదురించటం ఇక్కడ ఆశ్చర్య జనక మైన

చమత్కారం. దాన్ని కవి బహు చక్కగా వర్ణించాడు.


                   కడలో కెరటాలు అనంతం వాటి మ్రోతలు కూడా నిర్విరామమే! ఇక  ఆది శేషునకున్నపడగలా  వేయి. ఒక్క పాము బుసకొడితేనేమనం

హడలిపోతాం. అలాటిది వేయిపాములొక్కసారిగా బుసలు సారిస్తే  యెంత శబ్దమో ? ఆశబ్దం  కర్ణ కఠోరంగదా? మరి ఆరొదలో కదలకుండా నిద్రపోవటం మాటలా? మహ దిట్టతనమో, మొండి తనమోకావాలి. ఆరెండూ నీకున్నాయయ్యా! లేకపోతే  చీమచిటుకు

మన్నామాకు మెలకువ వస్తుందే ?మరి నీకెందుకురాదు? అనికవి ప్రశ్న?


 

                   బలవదరీ!  దరీకుహర భాస్వదరీ! యదరీ!  దరీ!  హరీ!  ------  దీనివరుసచూస్తే  ఇదేదో శతకానికి మకుటంలాగ ఉంది.

కవి చాలా ప్రౌఢుడు." దరీ " శబ్దాన్ని వృత్యనుప్రాసంగా ప్రయోగించి  యర్ధభేదం సాధించటమేగాదు. తానెంత ప్రతిభావంతుడో మనకు

తెలియజేశాడు. అహోబలనృసింహ స్వామిని యీ సంబోధనలతో కవి సంభావిస్తున్నాడు.


              బలవదరీ- బలవంతుడైన శత్రువు గలవాడా( హిరణ్య కస్యపుడు బలవంతుడేగదా) దరీకుహర- పర్వత గుహలో; భాస్వదరీ!- ప్రకాశించు  నృసింహాకారా! ; అదరీ- చక్రము; దరీ- శంఖము ధరించెడువాడా ;హరీ- స్వామీ  శ్రీహరీ!


             బలవంతుడైన హిరణ్యకస్యపుని సంహరించినవాడా! శంఖ చక్రధారీ! పర్వత బిలమందు ( అహోబిలము) నివసించు నృసింహ స్వామీ! యని సంబోధనము.


                   మొత్తానికి  పాలకడలిలో  విష్ణమూర్తి నిద్ర కూడా కవితా వస్తువైనది.


                       ఇదండీ    విషయం!


                                                                   స్వస్తి!

విష్ణు సహస్రనామం

 మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది! భీష్మపితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?


అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది" అని అడిగారు. 


ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"


ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"  


స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"


మళ్ళీ నిశబ్దం.


స్వామివారు చెప్పడం మొదలుపెట్ట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్టురుడిగాడు. 


"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.  


శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.  


"అదేలా" అని అందరూ అడిగారు. 


శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. 


శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు. 


ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

-సేకరణ

శ్రావణమాసం

 శ్రావణమాసం అంటే ఏమిటి..?



శ్రావణమాసము:- ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. శ్రావణమాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.


పంచాంగ ప్రకారంగా ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు.


శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉన్నాయి.

శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.


ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్షఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.


వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి బ్రహ్మ స్వరూపం అర్ధమౌతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది. స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.


పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.


ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమ రోజు బ్రహ్మచారులు గాని గృహస్థులు గాని శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ( జంధ్యం ) ధారణ అనేది అనాది ఆచారంగా వస్తున్నది. రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురిసి వాతవరణంలో మార్పు చెందడం వలన వ్యవసాయ సాగు కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు.

ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్నిస్తుంది.


శ్రావణ మాసం లక్ష్మీ ప్రదమైనమాసం 

శ్రావణ మాసం.

స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. అనేక రకములైన వ్రతములు, నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే “శ్రావణ మాసం“.

చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే, శ్రావణమాసం ఐదవ మాసం. పూర్ణిమనాదడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి.


మంగళగౌరీ వ్రతం:


శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.


వరలక్ష్మీ వ్రతం:

శ్రావణ మాసం లో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.


శుక్లచవితి-నాగచతుర్థి:

దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈరోజుని నాగులచవితి పండుగలా నాగాపుజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి.


శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి:

శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.


శ్రావణ పూర్ణిమ –  రాఖీపూర్ణిమ:

అన్న/తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అనికూడా అంటారు.

పూర్ణిమ – హయగ్రీవ జయంతి:

ఈరోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని, హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వ శ్రేష్టం.


కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి:

మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. అంతే కాదు. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర, శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడినది.

కృష్ణపక్ష అష్టమి – 


శ్రీకృష్ణాష్టమి:


శ్రీమహావిష్ణువు యోక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది.

కృష్ణపక్ష ఏకాదశి – కామిక 


ఏకాదశి:

ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి. ఈరోజున నవనీతమును(వెన్న) దానం చేయాలని పెద్దలు అంటారు. తద్వారా ఈతి బాధలు పోయి, కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య – పోలాల అమావాస్య:

పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్లు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్తా, పోలేరు అమావాస్య గా మారి,  పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.


*ఆదిరాజు ప్రసాద్ శర్మ*

అవకాశం ఇస్తుంది

 *🙏🏻రెండు డైరీలు - భార్య❤️భర్త 👇🏻*



తమ వివాహ వార్షికోత్సవ  సందర్భాన, భార్యాభర్తలు ఇద్దరూ  కలిసి  కూర్చుని  కాఫీ తాగుతూ  కబుర్లు చెప్పుకుంటున్నారు.  ప్రపంచానికి, వారొక ఆదర్శమైన జంట.  నిజానికి  వారిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది, కానీ కాలక్రమేణా వారిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి.


వారి సంభాషణలో.......భార్య ఒక ప్రతిపాదన చేసింది, “నేను మీతో చాలా చెప్పాలి, కానీ మనకు ఒకరి కోసమొకరికి సమయం దొరకడం లేదు. అందుకే నేను రెండు డైరీలు కొన్నాను. ఈ సంవత్సరం  మొత్తం మన మనసులో ఒకరి మీద ఒకరికి  ఉన్న వాటిని వీటిలో రాద్దాం. 

వచ్చే ఏడాది పెళ్లి రోజున, మన లోపాలను తెలుసుకోవడం కోసం ఒకరి డైరీని మరొకరు చదువుదాం, వాటిని  సరిదిద్దుకోడానికి  కలిసి  ప్రయత్నిద్దాం,”  ఆలోచన నచ్చి భర్త వెంటనే దానికి అంగీకరించాడు. 


 ఇద్దరూ తమ తమ డైరీలు  తీసుకున్నారు.


 ఒక  సంవత్సరం వేగంగా  గడిచిపోయింది.  మరుసటి  సంవత్సరం  వివాహవార్షికోత్సవం  సందర్భంగా, భార్యాభర్తలిద్దరూ  ముందుగా నిర్ణయించుకున్న విధంగా  తమ  డైరీలను  మార్చుకున్నారు.

మొదట.......భార్య  తనను  ఉద్దేశించి  వ్రాసిన  డైరీని భర్త  చదవడం  ప్రారంభించాడు.


మొదటి పేజీలో, "ఈ రోజు మన వివాహ వార్షికోత్సవం.  మీరు  నాకు  మంచి బహుమతి ఇవ్వలేదు" అని,


రెండవ పేజీలో - "మీరు నన్ను భోజనానికి రెస్టారెంట్ కి తీసుకెళ్లలేదు."

మూడవ పేజీలో - "నన్ను సినిమాకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, కానీ అలసిపోయానని చెప్పి చివరి క్షణంలో రద్దు చేసారు."


 " నా తరఫు బంధువులు వచ్చారు  కానీ మీరు వారితో సరిగ్గా మాట్లాడలేదు."


"చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు నా కొక డ్రెస్ కొన్నారు, కానీ అది చాలా పాత ఫ్యాషన్ ది !"


 ఇలా భర్త మీద ఎన్నో పనికిమాలిన ఫిర్యాదులు  ఆమె తన డైరీలో రాసుకుంది. అది చదవడం పూర్తికాగానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.


 భర్త, “ఓ  ప్రియా, నన్ను క్షమించు!  ఇప్పటి వరకు నా తప్పుల గురించి నాకు తెలియదు.  భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.” అని చెప్పాడు.


 ఇప్పుడు తన కోసం భర్త రాసిన డైరీని చదివడం భార్య వంతు...........


 మొదటి పేజీ - ఖాళీ

 రెండవ పేజీ - ఖాళీ

 మూడవ పేజీ - ఖాళీ

 ... ఖాళీ


 భార్య 50-60 పేజీలు తిరిగేసింది, కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి!  


భార్య కలత చెంది, “నా ఈ చిన్న కోరిక కూడా మీరు తీర్చలేరని నాకు తెలుసు.  నా మనసులో ఉన్నదంతా వ్రాయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఈ సంవత్సర కాలంలో నేను పడిన బాధ అంతా మీకు తెలియాలని నేను కోరుకున్నాను, కానీ మీరు నా కోసం ఇంత కూడా చేయలేకపోయారు!" అని వాపోయింది.


భర్త చిరునవ్వు నవ్వి, “చివరి పేజీలో అంతా రాశాను ప్రియా” అన్నాడు.


 భార్య ఆత్రంగా చివరి పేజీ తెరిచింది. 

అందులో ఇలా ఉంది - “ ఎదురుగా ఉండి ఎంత  కసురుకున్నా, ఇన్నాళ్లూ నువ్వు నాకు, నా కుటుంబానికి అందించిన అపరిమితమైన ప్రేమ ముందు, ఈ డైరీలో వ్రాయడానికి నీలోని ఏ లోపాన్ని నేను గుర్తించలేకపోయాను.  


అలాగని నీలో ఏమి లేవని కాదు. కానీ నీప్రేమ, అంకితభావం, మా కోసం నీ త్యాగం ఆ బలహీనమైన లోపాలన్నింటినీ అధిగమించేలా చేశాయి.  


నాలో లెక్కలేనన్ని క్షమించరాని  తప్పులు  ఉన్నప్పటికీ, నా  జీవితంలోని  ప్రతి దశలో నాకు నీడలా  ఉన్నావు.  ఆ నీడలో లోపాన్ని ఎలా కనుగొనగలను?!" అని వ్రాసాడు.


అది చదివిన భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి.  ఆమె తన భర్త చేతిలో నుండి తన డైరీని తీసుకొని, రెండు డైరీల తో పాటు తన విభేదాలు , ఫిర్యాదులను మంటల్లో కాల్చివేసింది..  మళ్లీ వారి జీవితాలు కొత్తగా పెళ్లయిన జంటలా ప్రేమతో వికసించాయి!


 వివాహం మనందరికీ ఎదగడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి, ప్రేమించడం నేర్చుకోడానికి అవకాశం ఇస్తుంది.  మనం ప్రమాణానికి కట్టుబడి ఉంటే, మరింత ఎక్కువగా ఇవ్వడం గురించి వివాహం మనకు నేర్పుతుంది. 🙏🙏🙏🙏

శ్రీరాఘవం

 శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

ఆపదామప హత్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

*శ్రీసీతారామచంద్ర అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణా ఫలసిద్థిరస్తు*

*సౌమ్యవాసర శుభోదయః*
సర్వేజనాః సుఖినోభవంతు
లోకాఃసమస్తాః సుఖినోభవంతు 

అదృష్టం ఉంటేనే

 శ్లోకం:☝️

  *న దైవమపి సంచిన్త్య*

*త్యజేదుద్యోగమాత్మనః l*

  *అనుద్యోగేన తైలాని*

*తిలేభ్యో నాప్తుమర్హతి ll*


భావం: అదృష్టం ఉంటేనే కార్యసిద్ధి కలుగుతుందని ఆలోచిస్తూ .. తన అధీనమైన పురుష ప్రయత్నమును వదలకూడదు. అందుబాటులో ఉన్న నువ్వుల నుండి ఏ ప్రయత్నమూ లేకుండానే నూనె రాదు కదా!