🙏దేవరకొండ బాగంగాధర తిలక్ 🙏
తెలుగు కవితావరణంలో అమృతం కురిపించిన దేవరకొండ బాలగంగాధర తిలక్ … ఎప్పటికీ గుర్తుండిపోతాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో 1921 ఆగస్టు 1న పుట్టిన తిలక్ … తన 11వ ఏటనే కథ రాయడం, 16వ ఏట నుంచే కవిత్వం అల్లడం ప్రారంభించారు. విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేసి, అనారోగ్య కారణాల చేత ఉన్నత విద్య అభ్యసించలేకపోయారు. తణుకులో ‘సాహితీ సరోవరం’ పేరిట విజ్ఞాన పరిషత్‌ను స్థాపించి, సాహిత్య సృజన సాగించారు.
తిలక్ అనారోగ్య సమస్య మానసికమైనది. లేనిపోని జబ్బులు తనకే ఉన్నాయనే భావం హైపో కాండ్రియాసిస్ వల్ల సైకోన్యూరోసిస్, గుండె సంబంధమైన వ్యాధులతో 1946 నుంచి 1954 వరకు ఎనిమిదేళ్లపాటు మంచానికే పరిమితమయ్యారు. ఆ దశలోనే ‘బాధాగళము’, ‘మండోదరి’ వంటి పద్య కవిత్వం రాశారు తిలక్. ఆరోగ్యం కుదుట పడ్డాక 1954 – 1966 మధ్య ఒక పుష్కర కాలం పాటు అన్ని సాహితీ ప్రక్రియల్లోనూ విస్తారంగా రచనలు చేశారు. ఇరుగు- పొరుగు, సుచిత్ర ప్రణయం, సుప్తశిల, పొగ, భరతుడు (ఏకపాత్రాభినయం) వంటి నాటికలు; సుశీల పెళ్ళి, సాలెగూడు వంటి నాటకాలు కూడా రాశారు. కావ్యసృష్టి, గాంధీ జీవితం ఒక మహాకావ్యం, హేమంత హసంతిక, కావ్యరసం, యుద్ధం వంటి వ్యాసాలు రాశారు. తన మిత్రులకు గొప్ప జీవిత స్పర్శ, సాహిత్య సౌరభం ఉన్న లేఖలు రాశారు. మాక్సిం గోర్కీ, రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితో కథలు రాశారు. సుందరి సుబ్బారావు, ఊరి చివర ఇల్లు కథలు ఎంతో ప్రసిద్ధం. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆయన సృజియించిన వచన కవిత్వం మరొక ఎత్తు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల ప్రభావంతో ఆయన భావాభ్యుదయ కవిత్వాన్ని ఆవిష్కరించారు. శ్రీశ్రీ మహాప్రస్థానం, తిలక్ అమతం కురిసిన రాత్రి సాహితీ ప్రపంచంలో విహరిద్దామనుకునే పాఠకులకు, వర్ధమాన కవులకు రెండు అద్భుత ద్వారాలుగా నిలుస్తాయి. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం తిలక్‌కు కరతళామలకం. ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వృత్త పరిధి చాలక శ్రీశ్రీ లాగానే, వచన గేయాన్ని ఎంచుకున్నారు. అది తన చేతిలో ఒకనొక ప్రత్యేకతని సంతరించుకొని, సౌందర్యాన్ని సేకరించుకుంది.
‘అమృతం కురిసిన రాత్రి’లో ”అందరూ నిద్ర పోతున్నారు- నేను మాత్రం- తలుపు తెరచి ఇల్లు విడిచి- ఎక్కడికో దూరంగా- కొండ దాటి కోన దాటి- వెన్నెల మైదానంలోకి వెళ్లి నిలుచున్నాను” అంటూ పాఠకున్ని కూడా వెన్నెల మైదానంలోకి తీసుకుపోతారు. ”నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు/ నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు/ నా అక్షరాలు వెన్నెలలో ఆడుకోనే అందమైన ఆడపిల్లలు” అని తిలక్ చెప్పుకున్నారు. ఇందులోని మొదటి రెండు వాక్యాలూ తిలక్ తన వస్తువుల గురించి, మూడవది తన శైలిని గురించి చెప్పుకున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ”పాడువోయిన ఊరు”లో – అది అంతా యిసుక- చరిత్రలో ఒక మసక- ఇది నశించిన గ్రామం- విశ్వసించే ఒక శ్మశానం- కాలిపోయే ఇల్లులా జీవితం ఒరుగుతుంది- కాలం పాడు నుయ్యిలా నా కన్నులకు కనబడింది అంటూ భాష సరళతను భావగాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు తిలక్. ‘సైనికుడి ఉత్తరంలో’ ఇక్కడ నేను క్షేమం- అక్కడ నువ్వు కూడా- ముసలి అమ్మ- పాత మంచం కోడు- మన చిన్నబ్బాయి- చెరువులో కొంగా” అంటూ ప్రారంభమైన ఉత్తరం- ”నేనిది వరకటి నేను కాను – నాకు విలువల్లేవు – చంపడం, చావడం తప్ప- కనిపించే ఈ యూనిఫారం కింద- ఒక పెద్ద నిరాశ, ఒక అనాగరికత బ్రిడ్జి కింద నదిలా రహస్యంగా ఉంది” అని సైనికుడు భార్యకు రాసే ఉత్తరాన్ని వివరించారు తిలక్.
సంఘవంచితుల పట్ల ఎంత కారుణ్యాన్ని చూపిస్తారో సంఘ దురన్యాయాల పట్ల అంతే క్రోధాన్ని ప్రదర్శిస్తారు తిలక్. ‘ఆర్తగీతం’లో ”నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలి వాణ్ణి- నేను చూసాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన కింద- నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని- నేను చూశాను నిజంగా తల్లి లేక, తండ్రి లేక, తిండి లేక, ఏడుస్తూ ఏడుస్తూ- ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసి బాలుణ్ణి …” ఇలా వంచితుల దీన గాధల్ని వివరిస్తూ- ఇది ఏ నాగరికతకు ఫలశృతి? ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి? ఏ బుద్ధ దేవుని జన్మభూమికి గర్వ స్మ ృతి” అనే ప్రశ్నలతో తన క్రోధాన్ని ప్రదర్శించారు. ‘న్యూ సిలబస్’ అనే కవితలో సౌత్ ఆఫ్రికా ప్రధాన మంత్రికి సామరస్యం ప్రధాన లక్ష్యం- రష్యా నేత కశ్చేవ్‌కి ప్రపంచ శాంతి ఒకటే గమ్యం- అమెరికన్ కెనడీకి పరోపకారం స్పూనుతో పెట్టిన ఆహారం అయినా యుద్ధం ఎందుకంటే తమ్ముడు! అది మన ప్రారబ్దం అంటూ అని ఆనాడే వాపోయారు. కష్ణశాస్త్రి, శ్రీశ్రీ ప్రభావంతో కవిత్వం రాసినా వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభా సంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళిన వాడు తిలక్.
‘నవత కవిత’లో – ”గంతలు కట్టినంత మాత్రాన గాడిద గుర్రం కాదు- ఖద్దరు ధరించిన ప్రతివాడు గాంధేయుడు కాడు- ఆధునికత ఉన్నంత మాత్రాన ప్రతీదీ శిరోధార్యం కాదు- ఆహార్యం మార్చినంత మాత్రాన సామాన్యుడు మహారాజవడు- అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రొసైక్ భావం పోయెట్రీ అవదు- కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసును- కాళిదాసుకు తెలుసు- పెద్దన్నకి తెలుసూ – కృష్ణ శాస్త్రికి తెలుసు- శ్రీశ్రీకి తెలుసు” అంటూ కవిత్వానికి ప్రామాణికాలను నిర్దేశించారు తిలక్. ‘నీడలు’ కవితలో ”చిన్నమ్మా – నేను వెళ్ళొస్తాను- చీకటి పడుతోంది- చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకొంది- శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది- దారంతా గోతులు ఇల్లేమో దూరం- చేతిలో దీపం లేదు- ధైర్యమే ఒక కవచం” అంటూ ఆశావాహ దక్పథాన్ని పాఠకులకు కలిగిస్తారు.
తిలక్ రాసిన ‘తపాలా బంట్రోతు’ గేయం బాగా ప్రాచుర్యం పొందింది. ”ఎండలో, వానలో – ఎండిన చివికిన- ఒక చిన్న సైజు జీతగాడు – చెవిలో పెన్సిల్- చేతిలో సంచి- ఖాకీ దుస్తులు- అరిగిన చెప్పులు- ఒక సాదా పేదవాడు- ఇంటింటికి- వీధి వీధికి ప్రతిరోజూ తిరిగేవాడు- ప్రైమినిష్టరా ఏం అని అంటూనే అదృష్టాద్వం మీద నీ గమనం- శుభా శుభాలకి నువ్వు వర్తమానం- నీ మ్యాజిక్ సంచిలో- ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం!” అంటూ తన పోస్టుమేన్ స్నేహితున్ని రాజును చేశారు తిలక్. ”ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్లిపోయే నిన్ను చూసినపుడు – తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు” అనే ముగింపు గుండెల్ని పిండేసినట్లుంటుంది.
కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షం’ లాగా, శ్రీశ్రీ మహాప్రస్థానం లాగా తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ కూడా ఆధునికాంధ్ర కవిత్వ చరిత్రలో ఒక మైలురాయి. అనేక ముద్రణలు పొంది ప్రజల అభిమానాన్ని ఈనాటికీ చూరగొంటోంది. ఎందరో యువతీ యువకుల్ని కవులుగా తీర్చిదిద్దుతోంది. ఈ కవితా సంపుటికి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తిలక్ మరణానంతరం లభించాయి, ునజు చీ×+ను ఉఖీ చీజుజుA= గా ఇంగ్లీష్ లో అనువాదమైంది.
”సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు- అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు- చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి” అంటూ బలమైన కంఠంతో విశ్వ మానవ కళ్యాణానికి నిబద్ధుడై కరుణ కలికితురాయిగా తమ అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ అమృతం కురిసిన రాత్రులను, కవిత ఝరులను ప్రవహింపచేశారు దేవరకొండ బాలగంగాధర తిలక్. సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో – 45 ఏళ్ళ నడి వయసులో ఆయన 1966 జూన్ 30న అనారోగ్యంతో కన్నుమూయడం తెలుగు సాహితికి తీరని లోటు! ”యువకవి- లోక ప్రతినిధి- నవ భావామృత రసధుని- కవితా సతినొసట నిత్య రస గంగాధర తిలకం – సమకాలిక సమస్యలకు స్వచ్ఛస్ఫటిక ఫలకం- నడి నింగి మాయమయాడా – మన మిత్రుడు కవితా పుత్రుడు- కదన క్షాత్రుడు- సకల జగన్మిత్రుడు” అంటూ శ్రీశ్రీ తిలక్‌కు నివాళులు అర్పించారు. మనమూ స్మరించుకుందాం.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ