*తిరుమల సర్వస్వం 235-*
*పద్మావతిదేవి పూర్వజన్మ వృత్తాంత-1*
*శిలాతోరణం*
తిరుమల క్షేత్రంలో శ్రీమహావిష్ణువుతో ప్రగాఢ అనుబంధం ఉన్న పౌరాణిక అవశేషాలలో ముఖ్యమైనది 'శిలాతోరణం'. దీనినొక భౌగోళిక అద్భుతంగా కూడా పరిగణించవచ్చు.
ప్రధానాలయానికి ఉత్తరదిశగా, వేదపాఠశాలకు నెలవై ఉన్న 'ధర్మగిరి' అనే ప్రాంతానికి వెళ్ళే మార్గంలో తిరుమల లోని ముఖ్యమైన తీర్థాలలో ఒకటైన 'చక్రతీర్థం' ఉందని ఇంతకు మునుపే తెలుసుకున్నాం. దీనికి అత్యంత సమీపంలో 'ఈ 'శిలాతోరణం' ప్రకృతిసిద్ధంగా ఏర్పడింది. ఇక్కడ చూడ చక్కనైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని 'శిలాతోరణం ఉద్యానవన సముదాయం' పేరుతో ప్రముఖ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దారు.
1980 వ సంవత్సరంలో ఈ ప్రదేశంలో త్రవ్వకాలు జరుపు తున్నప్పుడు అప్పటివరకు రాతి పొరల్లో నిక్షిప్తమై ఉన్న ఈ 'శిలాతోరణం' వెలుగు చూసింది. తరువాతి కాలంలో ఇది జాతీయ స్మారకచిహ్నంగా గుర్తించ బడింది. దీనిని కోట్లాది సంవత్సరాల క్రితంనాటి ప్రోటోజాయిక్ కాలానికి చెందిన భౌగోళిక అవశేషంగా భూగర్భ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతే గాకుండా ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న బండరాతి శిలలు అతి తీవ్రమైన నీటికోతకు గురవ్వడంతో ఈ ఆకార మేర్పడినట్లు కూడా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మనం అప్పుడప్పుడు వినేటట్లు యుగాంతంలో సమున్నతమైన శేషాచలశిఖరాలు సైతం సాగరగర్భంలో మునిగి పోతాయన్న సత్యాన్ని శిలాతోరణం ఉనికి మరియు దాని ఆవిర్భావం నిర్ధారిస్తున్నాయన్న మాట.
భౌగోళిక, నైసర్గిక పరిణామ క్రమాల్ని అలా ఉంచితే, దీనికి విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం కూడా ఉంది.
3 శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మి జాడకోసం ప్రప్రథమంగా వైకుంఠం నుండి భూలోకానికి వేంచేసినప్పుడు తన మొదటి అడుగును నారాయణగిరి పర్వతశిఖరంపై, నేడు 'శ్రీవారి పాదాలు'గా చెప్పుకునే ప్రాంతంలో మోపాడని ఇంతకుముందే తెలుసుకున్నాం. అక్కడి నుండి ఈ 'శిలాతోరణం' ద్వారా వెళ్ళి, ఇప్పుడు ఆనందనిలయం ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడని భక్తుల విశ్వాసం. మూలవిరాట్టు ఎత్తు మరియు శిలాతోరణం ఎత్తు కూడా ఇంచుమించు సరిసమానంగా ఉండటం ఈ నమ్మకాన్ని ధృవపరుస్తుంది.
శ్రీనివాసుడు ఈ ప్రాంతంలో రెండవ అడుగును, ఇప్పుడు మూలవిరాట్టు కొలువై ఉన్న ప్రాంతంలో మూడవ అడుగును మోపాడని కూడా మరి కొందరు భావిస్తారు.
ఈ శిలాతోరణంపై స్వామివారి ఆయుధాలైన శంఖువు, సుదర్శనచక్రం, కటి-వరదహస్తాలు, స్వామివారికి అత్యంత ఆప్తుడు మరియు వాహనము అయిన గరుత్మంతుని రూపం మొదలైనవి సహజసిద్ధంగా ఏర్పడి ఉండటంతో ఈ శిలాతోరణానికి, శ్రీవారికి అనుబంధం ఉన్నదనే విశ్వాసం మరింత బలోపేత మవుతుంది.
ఇన్ని విశేషాల సమాహారమైన 'శిలాతోరణం' తిరుమలక్షేత్రంలో తప్పనిసరిగా చూడవలసిన యాత్రాస్థలమనడంలో అతిశయోక్తి లేదు.
[ రేపటి భాగంలో ... *ద్వాదశ ఆళ్వారులు* గురించి తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి