*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*కర్ణ పర్వము ప్రథమాశ్వాసము*
*373 వ రోజు*
*కర్ణుడు శల్యుని తనకు సారధిని చెయ్యమని అడుగుట*
కర్ణుడు " సుయోధనా ! ఈ రోజు నుండి యుద్ధము నాకు అర్జునుడికి మధ్య మాత్రమే జరుగుతుంది. అర్జునుడిని చంపడమే నా లక్ష్యము. నా వద్ద ఇంద్ర శక్తి లేదని అర్జునుడు తప్పక విజృంభిస్తాడు. కనుక మనం అర్జునుడిని చంపుటకు ఉపాయం ఆలోచించాలి. నా వద్ద ఉన్న అస్త్రములు అర్జునుడి వద్ద ఉన్న అస్త్రములు సమానమే. యుద్ధములో చురుకుగా కదలడంలో అర్జునుడి కన్నా నేనే మిన్న. అర్జునుడికి గాండీవం ఉంది. నా వద్ద లేదు. పూర్వము విశ్వకర్మ,అ ఇంద్రుడికి ఒక అస్త్రము తయారు చేసి ఇచ్చాడు. దానితో ఇంద్రుడు అసురసంహారం చేసాడు. ఇంద్రుడు దానిని పరశురాముడికి ఇచ్చాడు. నా మీద కలిగిన వాత్సల్యంతో నా గురువైన పరశురాముడు దానిని నాకు నాకు ఇచ్చాడు. ఆ మహనీయచాపంతో నేను ఈ రోజు అర్జుడిని చంపి యుద్ధము పూర్తి చేసి నీకు కురుసామ్రాజ్యాన్ని కట్టబెడతాను. ఇక అర్జునుడికి ఎన్నటికీ మరణించని హయములు, అపూర్వమైన రధము, అక్షయ తుణీరములు ఉన్నాయి. వాటి గురించి నాకు భయము లేదు నా వెంట అనేక ఆయుధములున్న శకటములు ఉంటాయి. నిరంతరము నాకు ఆయుధములు అందుతూ ఉంటాయి కనుక అక్షయతుణీరముకు సమానమే. అనేక మేలు జాతి అశ్వములు నా వెంట ఉంటాయి కనుక అశ్వములు పడి పోగానే వేరు వాటిని సమ కూర్చుకుంటాను. అలాగే అనేక రధములు నా వెంట ఉంటాయి కనుక రధము విరిగిన వేరు రధమును ఏర్పరచు కొనగలను. అర్జుడికి కృష్ణుడి సారధ్యము ఉంది. నాకు అతడికి ధీటైన సారధి కావాలి. మధ్రదేశాధిపతి శల్యుడు అందుకు తగిన వాడు. అతడికి అశ్వహృదయం తెలుసు. రధము నడపడంలో కృష్ణుడికంటే నేర్పరి. కనుక నీవు అతడిని నాకు సారధిని చేయాలి. సుయోధనుడు " కర్ణా ! అదెంత పని. నేను ఇప్పుడే మధ్ర దేశాధిపతిని ఒప్పించి నీకు సారథిని చేస్తాను. నీ వెంట అనేక శకటములు ఆయుధములతో నడుస్తాయి. శతాధిక రథములు, అనేక అశ్వములు నీ వెంట ఉంటాయి. రా మనం శల్యుని వద్దకు పోతాము " అన్నాడు.
*శల్యుని కర్ణుడికి సారధ్యం వహించమని కోరుట*
సుయోధనుడు శల్యునికి నమస్కరించి " మీరు మాకు పెద్దలు నిత్యసత్యవ్రతులు, పూజ్యులు కనుక నేను మిమ్ము అధికంగా గౌరవిస్తాను. ఇందరి మధ్య నేను మిమ్ము ఒక కోరిక అడుగుతున్నాను కాదనకుండా తీర్చండి. ఇతడు కర్ణుడు, నా మిత్రుడు, మన స్వర్వసైన్యాధ్యక్షుడు, అర్జునుడిని సంహారముకు దీక్షాబద్ధుడు, అర్జునుడి సారథి కృష్ణుడు, కృష్ణుడికి దీటుగా సారథ్యం చేయగల సామర్ధ్యం మీకే ఉంది. భీష్మ ద్రోణులు చని పోయిన తరువాత నేను నిన్ను, కర్ణుడిని నమ్మి యుద్ధము చేస్తున్నాను. మీరు కర్ణుడికి సారథ్యం వహిస్తేనే అతడు అర్జునుడిని వధించ కలడు " అన్నాడు. ఆ మాటలకు శల్యుడు కోపంతో ఊగిపోతూ " సుయోధనా ! నేనెవరో తెలిసీ నన్ను ఇలాంటి నీచపు కోరిక అడుగుతావా ! నీకు వర్ణాశ్రమ ధర్మాలు తెలువవా ! మద్రదేశాధిపతిని, సుక్షత్రియుని నన్ను ఒక సూతునికి సారథ్యం వహించి అతడిని సేవించమని అడుగుతావా! నేను ఒక సూతకుల సంజాతునికి సారథిగా ఉండలేను. నేను నీకు సాయం చేయ వచ్చాను. నువ్వు ఎవరితో యుద్ధం చేయమంటే వారితో యుద్ధం చేసి శత్రు సంహారం చేస్తాను. అందరిని ఒక్కసారిగా ఎదుర్కొనమని చెప్పినా చేస్తాను. నేను రణరంగమున అర్జునుడిని కృష్ణుడినే లెక్క చేయను నా బలములో పదహారవ వంతు కూడా శక్తి లేని ఈ కర్ణుడు నాకు ఎంత. తెలియక పోతే సరే అన్నీ తెలిసి నన్ను కర్ణుడికి సారథిగా ఉండమంటే నేను నా దారిన పోతాను. అంతే కాని ఇలాంటి నీచపు పని చెయ్యను " అని చెప్పాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి