శ్రీ చన్ద్రశేఖరేన్ద్ర యతీంద్ర చరితామృతం -2
చంద్రశేఖరుల యొక్క జన్మ చాలా విచిత్రమైన స్థితి.వారి తాతగారి పేరు గణపతిశాస్త్రి గారు. ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్దకొడుకు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.ఆయనకు ఐదుగురు కుమారులు.తాతగారైన గణపతిశాస్త్రి గారి పేరుని సుబ్రమణ్యశాస్త్రి గారు తమ పెద్ద కొడుక్కిపెట్టారు.
సుబ్రహ్మణ్యశాస్త్రి గారు మెట్రిక్యులేషన్ వరకు చదువుకొని తమిళనాడు విల్లుపురం స్కూల్స్ ఇన్స్పెక్టరుగా పని చేస్తూ ఉండేవారు.'ఒక్క కుమారుడు కుమారుడు కాదు, ఒక కన్ను కన్ను కాదు' అని స్వామిమలైన ఉన్న స్వామినాథునికి మొక్కుకున్నారు.రెండో కుమారుని ప్రసాదించిన దీక్ష చేత రెండో కుమారునికి 'స్వామినాథశాస్త్రి' అని పేరు పెట్టుకున్నారు.రెండో కుమారుని తర్వాత మరో ముగ్గురు కుమారులు కలిగారు.వారు సాంబమూర్తిశాస్త్రి, సదాశివశాస్త్రి, కృష్ణమూర్తిశాస్త్రి.అయిదుగురు కుమారుల తరువాత పుట్టిన అమ్మాయికి లలితాంబిక అని పేరు పెట్టుకున్నారు.
ఈ రెండో కుమారులు స్వామినాథశాస్త్రి గారే భవిష్యత్ కాలంలో చంద్రశేఖర సరస్వతీ స్వాములు అయ్యారు.స్వామినాథశాస్త్రి గారు చిన్నప్పటి నుంచి కూడా పంచవన్నెల చిలుకలా అందంగా మాట్లాడేవారు.కన్నడంలో 'గిని 'అంటే పంచవన్నెల చిలుక అని అర్థం. అలా చిలుకలా మాట్లాడేవారు కనుక ఆయనని 'గిని 'అని పిలుచుకునేవారు.ఇంట్లో ఆ పిల్లవాడు ముద్దుల మూట కడుతూ చిలక పలుకులు పలుకుతూ తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటుండేవారు.వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ప్రభుత్వోద్యోగంలో ఉన్నారు కనుక తరచూ బదిలీలు జరుగుతూ ఉండేవి.విల్లుపురం,తిండివనం, చిదంబరం, ఫిరంగిపురం మొదలైన అనేక ప్రాంతాలలో తిరుగుతూ ఉండేవారు.
స్వామినాథుని మూడవ సంవత్సరంలో మహోత్కృష్టమైన సంఘటన జరిగింది. దాని నుంచి ఆయన ప్రేరణ పొందే వయసు కాదు కానీ పొందారు.
ఒక రోజు రాత్రి తల్లిదండ్రులతో ఆ పిల్లవాడు నిద్రపోతున్నాడు.వీళ్ళు కాపురం ఉంటున్న ప్రాంతంలో ప్రక్క ఇంటిలో పెద్ద అలజడి వినపడింది ఇంటిలో ఉంటున్న వారు ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లి ఉన్నారు.లోపల గిన్నెలు మూట కడుతున్నట్లు, గిన్నెలు అన్నీ క్రిందకు పడిపోతున్నట్టు పెద్ద చప్పుడు వినిపిస్తోంది ఆ ఇంట్లో నుంచి.
'ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు, నిర్భయంగా మూటలు కట్టేస్తున్నారు' అని ఒకరే వెళ్లి ఎదుర్కోలేక ఆ సందులో ఉన్నవారంతా ఆయుధం పట్టుకొని, 'దొంగలు పని పూర్తి చేసుకుని వస్తారు, అప్పుడు వారిని పట్టుకుని కొడదామూ అని ద్వారం దగ్గర ఎదురు చూస్తున్నారు.
చప్పుడు ఎక్కువ అవుతోంది కానీ దొంగలు బయటకి రాలేదు.ఏదో విచిత్రమైన పరిస్థితి లోపల ఉంది అనుకుని కొందరు సాహసవంతులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు.జరిగింది ఏమిటి అంటే, ఆ ఇంట్లో వారు ఊరు వెళ్ళే ముందు బెల్లంపాకంతో ఒక మధుర పదార్ధం తయారు చేసుకొని ఆ బెల్లంపాకం గిన్నె కడగకుండా అలాగే ఉంచి వెళ్ళిపోయారు.ఒక పిల్లి ఆ గిన్నెలో తల దూర్చి పానకం పూర్తిగా నాకేసింది.ఆ పాత్ర మూత సన్నగా ఉండటంతో దాని తల గిన్నెలోంచి ఊడి రాలేదు.అది భయపడి తల అందులో ఉండగా అటు ఇటు పరిగెత్తడం ప్రారంభించింది.అది ఆ శబ్దాలకి కారణం.ఆఖరికి అందరూ కలిసి దానిని పట్టుకుని ఒక స్తంభానికి కట్టేసి ఆ గిన్నెని బలవంతంగా లాగారు, గిన్నె ఊడి వచ్చింది.దీన్ని కొన్ని రోజుల పాటు అందరూ చెప్పుకునేని నవ్వుకుంటూ ఉండేవారు.
ఎనిమిది సంవత్సరముల స్వామినాథుడు మాత్రం రాత్రి పడుకుని ఆలోచించసాగాడు.మానవాళి 'ఆశ' అనే పాత్రలో ఇలాగే ఇరుక్కుని దారీ తెన్నూ తెలియక కొట్టుకుంటున్నారు.ఈనాడు పిల్లికి జరిగింది.నా జీవితానికి పెద్ద తేడా ఏమిటి?ఆనాడు ఆయనకి 'ఆశ' అనే దాని మీద అసహ్యం పుట్టింది.
పెద్ద పెద్ద వాళ్ళు, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఆ కథ చెప్పుకుని నవ్వుకుంటుంటే,పిల్లవాడికి వైరాగ్యం కలగడం ఎంత అపూర్వం.
ఆయనకి డెబ్భై ఏళ్ళు వచ్చిన తరువాత ఒక ఉపన్యాసంలో ఆ కథ గుర్తు తెచ్చుకుని కొంతసేపు ధ్యానమగ్నులు అయిపోయారు.
ఈ కథ చెప్పిన రెండు రోజుల అనంతరం ఒక పిల్లి వచ్చి వారి ఆశ్రమంలో అలాగే ఇబ్బంది పడింది.ఆ సంఘటనతో అందరూ పరమాచార్యులవారితో, "స్వామీ!పిల్లులు ఇలా తలదూర్చడానికి వీలు లేకుండా ఆ పాత్రలకి మర మూతలు తెచ్చి బిగిస్తాము" అని అన్నారు.అంతా విన్నాక పరమాచార్యులవారు, "మర మూతలు పెట్టకండి!పాలు విశాలమైన పాత్రలలో పోసిపెట్టండి.కావలసినంత పాలు త్రాగేసి పిల్లి వెళ్ళిపోతుంది" అన్నారు.
పాలు ఎలా దాచుకుందామని ఆశ్రమవాసులు, పరమాచార్యుని చుట్టూ చేరిన వాళ్ళు ఆలోచిస్తుంటే, స్వామి ఆలోచన ఎలా ఉందో చూడండి.ఆశ్రమంలో చేరినంత మాత్రాన వైరాగ్యసిద్ధి పొందినట్లు కాదు.
మహాత్ముల యొక్క మాటలు, విశాల భావాలు అంత గొప్పగా ఉంటాయి. ఆశ్రమంలో ఉండేవాడే ఒక వంట మనిషి ఒక రోజు నాలుగు సేర్ల మినప్పప్పు ఇంటికి పట్టుకుని పోదామని తీసుకుని తలక్రింద పెట్టుకొని పడుకున్నాడు.
అందరూ పడుకున్నాకా ఆ వ్యక్తిని పరమాచార్యుల వద్దకి తీసుకుని వచ్చి, "స్వామీ!వీడు మినప్పప్పు పట్టుకుని పోతున్నాడు!" అని చెప్పారు.
స్వామి వారు , "ఆ దోషం అతనిది కాదు, మనది.అతనికి తినడానికి సరిపడా వడలు పెట్టలేదేమో ఇక్కడ.ఈరోజు మినపప్పు నానబెట్టి శుభ్రంగా రుబ్బి,జీలకర్ర, కొత్తిమీర వేసి వడలు తయారు చేయించి ఇతనికి కడుపునిండా తినగలిగినంత పెట్టండి.ముందుకు మన దోషం పోవాలి" అన్నారు.
అందరిముందూ కూర్చోబెట్టి వానికి వడలు తినిపించారు.అందరూ ఒక దృష్టితో చూస్తే వారు ఒక దృష్టితో చూస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి