5, అక్టోబర్ 2025, ఆదివారం

అనగనగా

 🔔 *అనగనగా...* 🔔


పూర్వం శ్రీ రామచంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించేవాడు.


ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులం లో వేయి తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది.


ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు “నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. శాస్త్ర పఠనం మొదలైనవి ఎప్పటికీ మఱువకు” అని అన్నారు.


శిష్యుడైన‘కౌత్సుడు’వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు “అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కార వంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”


“నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు.


ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతనిని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు “నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”అన్నాడు.


గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి.


రాజు తండ్రి వంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు.


అంతకు ముందురోజే రఘుమహారాజు ఒక మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం (సుమారు 14 కోట్ల దీనారాలు) దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టికుండలు పెట్టుకుని సంధ్యావందనం చేస్తున్నాడు. రఘుమహారాజు యొక్క దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు.


కౌత్సుని చూసి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. “రాజా! అది కష్టములే. నేను వెళతాను” అంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు “వట్టి చేతులతో వెనుతిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనా” అని అన్నాడు.


వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు.


“ఱేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తా” అని చెప్పి పంపాడు రఘుమహారాజు.


పురతః(అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు.


మహాజ్ఞాని అయిన వశిష్ఠుడు “రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తు” అని హితం చెప్పాడు.


విజయ భేరీలు మ్రోగాయి.


ఆ భీకర భేరీనినాదాలు వజ్రి చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు “ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని” ఆజ్ఞాపించాడు.


రాజబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే “మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండి” అన్నాడు.


తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు “రాజా! నాకు కావలసినవి 14రాశులే. మిగతా ధనం నాది కాదు” అని వెళ్ళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు.


“మరి ఈ ధనమెవరిది” అని రఘుమహారాజు మిగిలినదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.```


*ఈ కథలోని నీతులను చూద్దాం:*


```


గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు, గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.


రఘుమహారాజు యొక్క దానగుణం


ఈ కథలో వ్యక్తమైంది. అతడు సంపాదించినదంతా దానం చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.


కౌత్సుడి యొక్క, రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు

కామెంట్‌లు లేవు: