*తిరుమల సర్వస్వం -277*
*సుప్రభాత గానం 7*
*పన్నెండవ శ్లోకం*
*"పద్మేశమిత్రశతపత్రగతాళివర్గాః*
*హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యా*
*భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం*
*శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్."*
*శ్లోకార్థం:*
సూర్యదేవునికి మిత్రులు, సూర్యోదయంతో వికసించే కలువపూల యొక్క కాడలలో నివసిస్తున్న తుమ్మెదలు మిసమిసలాడే తమ నల్లని మేని ఛాయతో నల్లకలువల మెరుపును మరపింప జేస్తూ; భేరీనినాదాన్ని తలపించేంత బిగ్గరగా ఝంకారం చేస్తున్నాయి. శేషాచల వాసా నీకు సుప్రభాతం.
ఈ శ్లోకంలో మరోసారి తుమ్మెదలు, నల్లకలువల ప్రస్తావన వచ్చింది. శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన కలువపూలను పదేపదే ప్రస్తావించడంలో ఆవగింజంతైనా ఆశ్చర్యం లేదు. అర్థాంగి అంటే ఆనందనిలయునికి అపరిమితమైన ఆదరాభిమానాలు కదా!
ఈ శ్లోకంలో సూర్యభగవానుని ప్రసక్తి కూడా వచ్చింది. సూర్యుడు శ్రీవేంకటేశ్వరునికి పరమ భక్తుడే కాకుండా ఆప్తమిత్రుడు కూడా.
సూర్యుని తొలికిరణాలతో పద్మం వికసించడం వల్ల, ఆ పద్మంలో నివసించే శ్రీమహాలక్ష్మికి కూడా సూర్యుడంటే పుట్టింటివారంత ప్రీతి. అదే కారణంతో, శ్రీవేంకటేశ్వరుడు పద్మావతిదేవితో తనకు జరుగబోయే పరిణయానికి తనపై అలిగి వైకుంఠం నుండి వెడలి కరివీరపురంలో (నేటి కోల్హాపూరు) నివాసముంటున్న శ్రీమహాలక్ష్మికి ఆహ్వానం, రాయబారం పంపించాడు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంతో శ్రీనివాసునికి సూర్యుడు మరింత ఆప్తుడయ్యాడు.
అటువంటి పద్మాలను, సూర్యభగవానుణ్ణి పదే పదే తలపుకు తేవడం ద్వారా శ్రీవేంకటేశ్వరుని త్వరితగతిని మేల్కొలప వచ్చని అణ్ణన్ మహాశయులు భావించారు.
అణ్ణన్ స్వామి తన భక్తి భావోద్వేగ తరంగాలను వ్యక్తపరచడం కోసం ఉపమానాలంకారన్ని కడు సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. ముందటి శ్లోకంలో కవ్వంతో మజ్జిగ చిలుకగా వచ్చే శబ్దాన్ని చల్లకుండలు దిక్కులతో తలపడుతుండగా వచ్చే భీకరశబ్దాలతో పోల్చగా; ఈ శ్లోకంలో తుమ్మెదల ఝంకారాన్ని యుద్ధభేరి నినాదంతో పోల్చారు. దిగ్దిగంతాలను ఏలే శ్రీనివాసుని సన్నిధిలో ఉత్పన్నమయ్యే చిరుధ్వని సైతం దిక్కులు పిక్కటిల్లేలా ఉంటుందేమో!!
*పదమూడవ శ్లోకం*
*"శ్రీమన్నభీష్టవరదాఖిలలోకబంధో*
*శ్రీ శ్రీనివాస జగదేకదయైకసింధో*
*శ్రీదేవతాగృహభుజాంతరదివ్యమూర్తే*
*శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్"*
*శ్లోకార్థం*
శ్రీమహాలక్ష్మికి ప్రియతమమైన వానివి, కోరిన కొర్కెలు తీర్చేవానివి, విశ్వమంతటికీ ఆప్తుడైన వానివి, శ్రీమహాలక్ష్మికి నెలవైన వానివి అయిన నీవు విశ్వానికంతటికీ ఏకైక దయాసముద్రుడవై విలసిల్లుతున్నావు. శ్రీమహాలక్ష్మికి నిలయమైన దివ్యదేహముతో వెలుగొందే శ్రీవేంకటాచలాధీశా నీకు సుప్రభాతం.
ఈ శ్లోకంలో శ్రీవేంకటేశ్వరుణ్ణి 'దయాసముద్రుని' గా సంబోధించడం ద్వారా వారి కరుణాంతరంగాన్ని కొనియాడటమే కాకుండా; క్షీరసాగరతనయ యైన శ్రీమహాలక్షిని కూడా తలపుకు తెచ్చుకున్నారు. లక్ష్మీదేవి క్షీరసాగరమథనంలో ఉద్భవించింది.
అప్టైశ్వర్యాలకు అధినేత్రియైన శ్రీమహాలక్ష్మి కటాక్షించితేనే శ్రీవేంకటేశ్వరుడు సైతం సిరిసంపదలు చేకూర్చగలడు. వక్షస్థలంలో లక్ష్మీదేవిని ధరించడం వల్లనే శ్రీనివాసునికి అసమాన సౌందర్యం గల దివ్యరూపం సంప్రాప్తించింది. మనవల్ల జరిగే తప్పిదాలను సైతం అమ్మవారు మాతృహృదయంతో క్షమించి, శ్రీవారి ఆగ్రహాతిశయాన్నుండి కాపాడుతారు. అందువల్ల శ్రీమహాలక్ష్మిని శ్రీవేంకటేశ్వరునితో అభిన్నంగా భావిస్తూ, ఇరువురినీ ఏక కాలంలో స్తుతించడం జరిగింది.
*పదునాల్గవ శ్లోకం*
*"శ్రీ స్వామిపుష్కరిణికా ప్లవ నిర్మలాంగాః*
*శ్రేయోర్థినో హరవిరించిసనందనాద్యాః*
*ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః*
*శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్"*
*శ్లోకార్థం*
పరమశివుడు, బ్రహ్మదేవుడు, సనందాది మునీశ్వరులు స్వామిపుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి, పవిత్రశరీరులై; నీ దర్శనార్థం ఆలయద్వారం ముందు వేచియున్నారు. నిన్ను త్వరితంగా దర్శించుకోవాలనే అతృతతో వారు నీ ద్వారపాలకుల బెత్తం దెబ్బలు చవిచూస్తున్నారు.
ఈ శ్లోకంలో తిరుమలక్షేత్రంలో కొలువై ఉన్న స్వామిపుష్కరిణి ప్రాశస్త్యాన్ని అన్యాపదేశంగా ఉదహరించడం జరిగింది. సృష్టి-లయకు కారణభూతులు, త్రిమూర్తులలో ఇరువురు అయిన బ్రహ్మరుద్రులు; బ్రహ్మ మానసపుత్రులైన సనందాది మునులు సైతం స్వామిపుష్కరిణిలో స్నానమాడి పవిత్రులయ్యారంటే ఆ పుష్కరిణి మహాత్మ్యాన్ని అవగాహన చేసుకోవచ్చు.
స్వామివారి క్షణకాల దర్శనానికై ఆలయద్వారం ముందు వేచియుండే ఇక్కట్లు ఆనాడే ఉన్నాయన్నమాట. శ్రీవారి దర్శనార్థం ఈనాడు మనం చూస్తున్న తొక్కిసలాటలకు ఆనాడే నాందీప్రస్తావన జరిగింది. బ్రహ్మరుద్రాదులకు సైతం ద్వారపాలకులైన జయవిజయులతో బెత్తం దెబ్బలు తినే వెతలు తప్పలేదు. మనమెంత?
*సిఫారసులకు ఎగబడడం, వక్రమార్గాలు వెదకడం మాని ఓర్పుతో వేచియుండి, స్వామివారిని సరియైన రీతిలో దర్శించుకోవడం సర్వదా శ్రేయస్కరం. దేవుని ముందున్నా లేక క్యూ వరుసల్లో కాలం గడిపినా దైవసన్నిధిలో ఉన్నట్లే! క్షణకాల దర్శనం తోనే శ్రీవారి దివ్యమూర్తిని మన మనోఫలకంపై ముద్రించుకోవాలి. ఎంత త్వరగా, ఎన్నిసార్లు, ఎంతసేపు స్వామివారిని దర్శించుకున్నామన్న దానికంటే క్షణకాలమైనా ఎంత ఆర్తితో శ్రీవారి దివ్యసుందర విగ్రహాన్ని దర్శించు కున్నామన్నదే ముఖ్యం.*
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి