9, జులై 2025, బుధవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*432 వ రోజు*

అర్జునుడి రథం దగ్ధంకావడము

కృష్ణుడు అర్జునుడితో " అర్జునా ! నీ గాండీవం అక్షయ తుణీరం తీసుకుని ముందు నీవు రథం దిగు తరువాత నేను రథం దిగుతాను అన్నాడు. అర్జునుడు అలాగే అని చెప్పి గాండీవ సహితంగా రథం దిగాడు. తరువాత కృష్ణుడు పగ్గములను నొగల మీద ఉంచి తాను కూడా రథం దిగాడు. కపిధ్వజం మీద ఉన్న హనుమంతుడు భూతగణ సహితంగా తను కూడా రథమును విడిచి వెళ్ళాడు. వెంటనే ఆరథం భగభగ మండి పోయింది. అర్జునుడు ఆశ్చర్యచకితుడై " కృష్ణా ! ఏమిటీ వింత ! " అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు " అర్జునా ! ఇప్పటి వరకు యుద్ధంలో గెలవడం నీ మహిమ అనుకుంటున్నావు. కాని కర్ణుడి అస్త్ర ధాటికి ఈ రథం ఎప్పుడో ధగ్ధం అయిపోయింది. కాని నొగల మీద నేను ధ్వజం మీద హనుమంతుడు ఉన్నాము కనుక ఇప్పటి వరకు నిలిచి ఉంది. అందుకే నేను నీ తరువాత రథం దిగాను. హనుమంతుడు ఎగిరిపోగానే రథం ధగ్ధం అయింది. ఇందులో వింత ఏముంది " అన్నాడు. అన్నాడు.


*కృష్ణుడు అర్జునుడిని ధర్మరాజుకు అప్పగించుట*


కృష్ణుడు ఆతరువాత ధర్మరాజుకు అర్జునుడిని అప్పగిస్తూ " ధర్మరాజా ! యుద్ధారంభంలో ఉపప్లాయంలో నీవు నాన్ను వస్త్రములతో సత్కరించి అర్జునుడిని నాచేత పెట్టి " కృష్ణా ! వీడిని నీవు కాపాడాలి " అని అర్ధించావు. నేను అందుకు అంగీకరించాను. ఇడుగో యుద్ధంలో విజయుడై వచ్చిన అర్జునుడిని సురక్షితంగా నీకు అప్పగిస్తున్నాను " అన్నాడు. ధర్మరాజు " అదేమిటి కృష్ణా ! నీవు లేకున్న మేము ఈ పద్దెనిమిది రోజుల యుద్ధంలో జరిగిన ఈ యుద్ధసాగరాన్ని దాటగలమా ! నాడు వ్యాసుడు చెప్పనే చెప్పాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడే అని. నీ కరుణ వలనే కదా ! మాకీ విజయం ప్రాప్తించింది " అన్నాడు ధర్మరాజు. కృష్ణుడు " ధర్మజా ! ప్రారంభంలో అర్జునుడికి యుద్ధం చేయుట ఇష్టం లేదు. నేను గీతను బోధించి అతడిని రణోన్ముఖుని చేసాను. కానీ ఇప్పటికీ అర్జునుడికి ఈ మారణకాండమున యుద్ధమున ఆసక్తి లేదు. లేకున్న ఇంద్రకుమారుడైన అర్జునుడు ఏపని చేటకైనా సమర్ధుడే. ముల్లోకాలను తృటిలో నాశనం చేయగలడు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు " అన్నాడు. ఆ ప్రకారం అందరూ సరససల్లాపంలో తేలియాడారు. ధర్మరాజు అత్యధిక సంపదలు కలిగిన సుయోధనుడి ధనాగారం స్వాధీనం చేసుకున్నాడు. మిగిలిన కౌరవ సేనలను చూసుకుంటూ ఆనందంగా తిరుగున్నాడు. కృష్ణుడు " ధర్మనందనా ! సుయోధనుడు లేని ఈ మందిరం పాడుబడింది. ఇక ఇక్కడ ఉండటం మంచిది కాదు. వేరొక ప్రశాంత ప్రదేశముకు పోదాము " అన్నాడు. తరువాత కృష్ణుడు పాండవులను ఓఘవతీ తీరానికి తీసుకు వెళ్ళాడు. ధర్మరాజుకు భయం పట్టుకుంది " అర్జునుడు చేసిన సైగతో భీముడు సుయోధనుడి తొడ విరిచాడు. అది చాలక కాలితో సుయోధనుడి తల నరికాడు. కనుక గాంధారి నన్ను శపిస్తుంది. కనుక ఆమెను శాంతింప చేయాలి. ఈ పని చేయడానికి శ్రీకృష్ణుడే తగిన వాడు " అనుకుని శ్రీకృష్ణుడిని హస్థినాపురం పంపాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: