శు భో ద యం 🙏
ముక్కు మీద చక్కని పద్యం !
శా: నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే
లా న న్నొల్ల దటంచు ? 'గంధఫలి ' బల్కాకం దపంబంది ,యో
షా నాసాగ్రము బూని , సర్వ సుమనస్సౌరభ్య సంవాస మై ,
పూనెం బ్రేక్షణమాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్ .
వసు చరిత్రము 2 ఆశ్వాసము- రామ రాజ భూషణుడు.
ప్రబంధకవులు చిత్ర విచిత్రమైన వర్ణనలు చేశారు. కావ్యనాయిక సోందర్య మాధారంగా, వారు (ప్రబంధనాయిక)
అంగాంగ సౌందర్యమును పనిగట్టుకు వర్ణించారు. ఉపమలతో ఉత్ప్రేక్షలతో అతిశయోక్తులతో, అప్పటి ప్రభువుల, ప్రజల అభిరుచులు
అలా ఉండేవన్నమాట.
వసుచరిత్రలో నాయిక గిరిక ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తూ కృతికర్త రామ రాజ భూషణుడు. ముక్కుపై నొక చక్కని పద్యం వ్రాశాడు. అదే పైపద్యం.
" గంధఫలి"- అంటే సంపెంగ పూవు. ( ఈసంపెంగలు రెండురకాలు 1 తుప్ప సంపెంగ 2 చెట్టు సంపెంగ. దీనినే మనవారు "సింహాచలం సంపెంగ"- అంటారు. అదే ముక్కును పోలియుంటుంది. ఇప్పుడు దాన్ని గురించే మనం చెప్పుకోబోయేది)
ఆసంపెంగకు తుమ్మెదలపై కోపం వచ్చిందట. ఎందుకు? నానాసూన వితాన వాసనల నానందించు సారంగము(తుమ్మెద) యేలానన్నొల్లదని. అనేక పుష్పాలపైవ్రాలి మకరందం జుర్రుకునే తుమ్మెద నాదగ్గరకు రాదేం? అని దానికి కోపం! యెలాగైనా పట్టుబట్టి సాధించాలిగదా! అందుకనే అది తపస్సు చేసింది. ఆతపః ఫలంగా గిరిక ముక్కుగా నవతరించి ,సకల పుష్పముల సువాసనలను పుణికి పుచ్చుకొని తన ముఖానికిరువైపులా చూపులనే (కన్నులనే) రెండుగండు తుమ్మెదలను కదల కుండా కట్టేసిందట!
ఇంతకీ యిక్కడో విషయం చెప్పుకోవాలి. ఏవిటది? తుమ్మెదలకు సంపెంగికి యెందుకు విరోధం? ఏమో అది ప్రకృతిగతమైనది.సంపెంగ వాసన తుమ్మెదకు పడదు. ఆవాసకది తలదిరిగి పడిపోతుంది. అందుకని అది సంపెంగ దరిదాపులకు రాదు.
దాని నాధారంగా కవి యొక కథనల్లాడు. అదే "తుమ్మెదపై సంపెంగ అలక"
గతంలో సంపెంగ గా ఉండటంతో తుమ్మెదలు దరికి రాలేదు. ఆరువాత తపస్సుచేసి గిరిక ముక్కుగా అవతరించింది. ఇక అప్పుడు తుమ్మెదకు తప్పలేదు. అదిగూడా అందమైన ఆమెకన్నుల వలెమారిపోయింది. అదీ సంగతి!
ఇంతకీ గిరిక ముక్కు సంపెంగి వలె, కన్నులు తుమ్మెదల వలె నున్నాయని చెప్పటమన్నమాట.
ఇంతకీ యీముక్కుపద్యం కర్తృత్వం వివాదాస్పదమైంది. అప్పటికీ యిప్పటికీ ఆవివాదం తెగలేదు. ఈపద్యం నంది తిమ్మన గారిదనీ, ముక్కుమీద పద్యంవలననే ఆయనకు ముక్కు తిమ్మన యనే వ్యవహార నామం వచ్చిందనీ కొందరివాదన.దాన్ని రామరాజభూషణుడు వెలగొని తనగ్రంథంలో వాడుకున్నాడని దానికి సమర్ధింపుగా చెప్పారు.కానీ తిమ్మనగారి పారిజాతాప హరణంలో ఈపద్యం కనిపించదు. కాబట్టి ఈవాదంలో పస గనిపించదు.
మొత్తానికి ముక్కు మీద కూడా ప్రబంధకవులు పద్యాలల్లినది యదార్ధం!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి