5, మార్చి 2021, శుక్రవారం

మొగలిచెర్ల

 *సీతాలక్షమ్మ గారి సలహా..*


"ఏరా ప్రసాదూ బాగున్నావా?..పదేళ్ల తరువాత ఇప్పుడు కుదిరింది నాయనా ఈ స్వామిని దర్శించుకోవడానికి.." అంటూ సీతాలక్షమ్మ గారు నా ప్రక్కన వచ్చి కూర్చున్నారు..స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లో సీతాలక్షమ్మ గారు మా తల్లిదండ్రులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు..సీతాలక్షమ్మ గారింటి ఇలవేల్పు మాల్యాద్రి లక్ష్మీనారసింహుడు..ఆ కారణం చేత ఆవిడ భర్త తో కలిసి ఆరోజుల్లో తరచూ మాలకొండకు వచ్చేవారు..మా తల్లిదండ్రులకు కూడా మాలకొండ వద్దే సీతాలక్షమ్మ గారు, ఆవిడ భర్త లక్ష్మీనరసయ్య గారు పరిచయం అయ్యారు..మాలకొండలో ఒక యువక యోగి తపస్సు చేసుకుంటున్నాడనీ..ప్రతి వారం ఆ యోగి ని తాము కలుస్తున్నామనీ మా అమ్మగారు సీతాలక్షమ్మ గారికి చెప్పడం..ఆ దంపతులు కూడా ఆ యోగిని చూడాలని కుతూహలం చూపడం జరిగింది..ఒక శనివారం మధ్యాహ్నం మూడు గంటల వేళ, సీతాలక్షమ్మ గారి దంపతులను వెంటబెట్టుకొని..స్వామివారిని కలవడానికి మాలకొండకు ఉత్తరం వైపున దిగువున ఉన్న పార్వతీదేవి మఠం వద్దకు మా తల్లిదండ్రులు వెళ్లారు..


ఒక పది పదిహేను నిమిషాల తరువాత స్వామివారు శివాలయం పైన ఉన్న గుహల వద్దనుంచి మెల్లిగా దిగి వీళ్ళవద్దకు వచ్చారు.."శ్రీధరరావు గారూ మీతో బాటు అతిథులను కూడా తీసుకొచ్చారా?.." అని నవ్వుతూ పలకరించారు.."మీగురించి నేనే చెప్పాను నాయనా..మిమ్మల్ని కలవాలని ఆసక్తి చూపించారు..మాతోపాటు వెంట బెట్టుకొని వచ్చాము.." అని మా అమ్మగారు బదులిచ్చారు.."పర్లేదమ్మా.." అని..సీతాలక్షమ్మ దంపతుల వైపు తిరిగి.."అమ్మా..బాగున్నారా?" అని అడిగారు స్వామివారు..సీతాలక్షమ్మ గారికి గానీ..లక్ష్మీ నరసయ్య గారికి కానీ..ఏం మాట్లాడాలో తెలీని అచేతన స్థితిలో ఉండిపోయారు..స్వామివారి చల్లని చూపు వారిని కట్టిపడేసింది..మాటలు కూడబలుక్కుంటునట్లు.."బాగున్నాము స్వామీ.." అన్నారు.."మీ ఇలవేల్పు లక్ష్మీనృసింహుడి పాదాలు విడవకుండా పట్టుకోండి..మీకు ఏలోటూ లేకుండా ఆయన చూస్తాడు..సంతానం కూడా వృద్ధిలోకి వస్తుంది.." అని స్వామివారు ఆశీర్వదించారు..మరో పదినిమిషాల తరువాత అందరూ స్వామివారి వద్ద సెలవు తీసుకొని వచ్చేసారు..


ఆ తరువాత కూడా ఆ దంపతులు స్వామివారిని మాలకొండలో రెండు మూడు సార్లు కలుసుకున్నారు..స్వామివారు మొగిలిచెర్ల లో ఆశ్రమం కట్టుకుని సాధన చేసే రోజుల్లో కూడా వచ్చి వెళ్లారు..స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన విషయాన్ని మా నాన్నగారు ఉత్తరం ద్వారా ఆ దంపతులకు తెలియచేశారు..ఆ ఉత్తరం చదివిన వెంటనే మొగిలిచెర్ల వచ్చి స్వామివారి సమాధిని దర్శించుకున్నారు.."ప్రభావతీ..మీ ఇద్దరూ అదృష్టవంతులు..ఈ మహానుభావుడు కొన్నాళ్ళు మీ ఇంట్లోనే వున్నాడు..మీచేతి ఆహారం స్వీకరించాడు.." అని తరచూ చెప్పేవారు.."వీడు కూడా పెట్టి పుట్టాడు ప్రభావతీ..అంతటి యోగిపుంగవుడికి రోజూ అన్నం తీసుకెళ్లి ఇచ్చి వచ్చాడు కదా.." అని నాగురించి చెప్పేవారు..


నేను మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర బాధ్యతలు తీసుకున్న తొలినాళ్లలో..అనారోగ్యం తో ఉన్న మా నాన్నగారిని చూడటానికి సీతాలక్షమ్మ గారు భర్త తో సహా వచ్చారు..నాన్నగారిని పరామర్శించి..స్వామివారి మందిరానికి వచ్చారు..స్వామివారి సమాధిని దర్శించుకొని.."జీవితం లో ఇటువంటి అవధూతను చూడగలిగే భాగ్యం మా దంపతులకు మీ తల్లిదండ్రుల వల్ల కలిగింది..మీకు ఏ లోటూ ఉండదు అని ఆరోజు ఈ స్వామివారు చెప్పిన మాట అక్షరసత్యం నాయనా..మా పిల్లలూ సుఖంగా వున్నారు..స్వామివారు మొట్టమొదటి రోజు మమ్మల్ని చూసిన  చూపు ఇప్పటికీ మర్చిపోలేము..మీ తల్లిదండ్రుల లాగే నువ్వుకూడా స్వామివారి సేవ చేసుకుంటున్నావు..జాగ్రత్త నాయనా..ఎక్కడా అహంకరించొద్దు..ఎవ్వరినీ అమర్యాదగా చూడొద్దు..ఈ మందిరానికి వచ్చే ప్రతి భక్తుడినీ గౌరవించు..వాళ్ళు ఎంతో దూరం నుంచి వాళ్ళ బాధలు తీరుతాయనే ఆశతో ఇక్కడికి వస్తారు..నువ్వు పలికే స్వాoతన పలుకులు వాళ్లకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి..అది గుర్తు పెట్టుకో.."అని నా ప్రక్కన కూర్చుని చెప్పారు.."వీలుంటే ఇక్కడ అన్నదానం జరిగే ఏర్పాటు చూడు ప్రసాదూ.." అని సలహా ఇచ్చారు.."అన్నదానం ఖర్చుతో కూడుకున్న పని..ఆలోచిస్తున్నాను.." అన్నాను.."నువ్వు ప్రారంభించు..ఆపై స్వామివారు చూసుకుంటారు..ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులన్నీ నీ వల్ల జరుగుతున్నాయా..అంతా ఆయన కృప వలనే నడచిపోతున్నది..ఇదీ అంతే.." అన్నారు..


సీతాలక్షమ్మ గారు భౌతికంగా ఈరోజు లేకపోయినా..ఆవిడ చెప్పిన మాటలు నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి..ఒక్కొక్కసారి సహనం కోల్పోయి..కొంత పరుషంగా మాట్లాడిన సందర్భాలలో..సీతాలక్షమ్మ గారి సలహా గుర్తుకొస్తుంది..ఒకరకంగా స్వామివారే ఆమెచేత ఆ పలుకులు పలికించారేమో..ఈరోజు అన్నదానం చేయగలుగుతున్నాము..చూడటానికి సీతాలక్షమ్మ గారు లేకపోయినా..ఆవిడ ఆశీస్సులు వుంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: