24, అక్టోబర్ 2023, మంగళవారం

విష్ణువు-బుద్ధుడు

 ---------

విష్ణువు-బుద్ధుడు

-------------


విష్ణువుకు బుద్ధుడుకి ఏ సంబంధమూ లేదు. దశావతారాల్లోని బుద్ధ అవతారమూ, సిద్దాద్ద గోతమ బుద్ధుడూ ఒకరు కాదు. త్రిపురాసుర వధ సందర్భంగా 8,9 శ్లోకాల్లో దశావతార బుద్ధుడి ప్రసక్తి ఉంది. సిద్దాద్ద గోతమ బుద్ధుడు ఏ రాక్షస వధకూ కారణం కాదు.


కొందరు విద్వేషవాదులూ, సరైన అవగాహన లేనివాళ్లూ బుద్ధుడి తరువాతే లేదా బుద్ధుణ్ణి చూసే విష్ణువును  రూపొందించడం జరిగిందని చెబుతూ సనాతన వ్యతిరేక విషాన్ని సమాజంపై చిమ్ముతున్నారు. 


సామాన్య శకానికి పూర్వం 7 శతాబ్దికి చెందిన బోధాయన గృహ్య సూత్రాల్లో విష్ణువు శిల్పాల ప్రసక్తి ఉంది. అంతే కాకుండా ఈ సూత్రాల్లో విష్ణువుపరంగా చెప్పబడ్డ శ్లోకాలు ఉన్నాయి. దీన్నిబట్టి బుద్ధుడికన్నా ఎంతో పూర్వమే  వైదిక సాహిత్యంలో విష్ణువు

ఉన్నట్టు అవగతం ఔతోంది. 


తమిళనాడులోని కంచిలో ఉన్న తిరువెక్కాలో యదోక్తకారీ పేరుతో ఒక విష్ణువు ఆలయం ఉంది. ఈ విష్ణువు ఆలయం తమిళ సంగకాలం నాటికే బాగా ప్రాచుర్యంలో ఉండేది. తమిళ సంగకాలం  

BCE 300. అంటే ఇప్పటికి 2,300 యేళ్లకు క్రితం వచ్చిన సాహిత్యంలో విష్ణువు ఆలయం ప్రస్తావన ఉందని తెలుస్తోంది. నిజానికి ఈ ఆలయం అప్పటికి ఎంత కాలం పూర్వందో? తిరువెక్కాలో యదోక్తకారీ ఆలయంలో విష్ణువు ఆకృతి కళ్లు మూసుకుని ధ్యానంలో శయనిస్తూ ఉంటుంది. సామాన్య శకం 3 వ శతాబ్దిలో వచ్చిన తమిళ సిలప్పదిగారంలో శ్రీరంగంలోని శయన భంగిమలో ఉన్న విష్ణువు రూపం గురించి చెప్పబడ్డది. ఆ ఆలయం కూడా సిలప్పదిగారం కాలానికి పూర్వందే అయుంటుంది కదా?


BCE 304-232 ల అశోకుడుకు ముందే బుద్ధుడు ఉండి వెళ్లిపోయినా BCE 239లో అశోకుడు బౌద్ధ స్థూపం కట్టిన తరువాత కాని బుద్ధుడిపై ప్రచారానికి కదలిక రాలేదు. సామాన్య శకం 1-3 శతాబ్దుల వరకూ సిద్దాద్ద గోతమ బుద్ధుడి గురించి లిఖిత సాహిత్యం లేదు! తొలి లిఖిత బౌద్ధ సాహిత్యం గాంధార భాషలో ఆప్ఘనిస్తాన్ ప్రాంతంలో లభ్యమైంది.  లిఖిత బౌద్ధ సాహిత్యంలో భాగంగా సామాన్య శకం 1-3 తరువాతే బుద్ధుడి ఊహా చిత్రాలు వచ్చి ఉంటాయి. బుద్ధుణ్ణి చూసినవాళ్లు అన్ని వందలయేళ్లు బతికి ఉండి బుద్ధుడి నిజ రూపాన్ని చిత్రించగలిగే అవకాశం లేదు. మనం చూస్తున్నవి బుద్ధుడి ఊహా చిత్రాలే. 


శయన స్థితిలో ఉన్న బుద్ధుడి ఊహా చిత్రం రావడానికి కొన్ని వందలయేళ్లకు ముందే శయనస్థితిలో ఉన్న విష్ణువు ఆకృతి తిరువెక్కాలో ఉంది. తిరువెక్కాలో ఉంది అంటే దానికి ఆధారం ఏ రచనో అయుండాలి కదా? విష్ణువు పాల సముద్రంలో శేషుడిపై పవళించి ఉంటాడు అన్న వర్ణన అప్పటికే ప్రజల్లో ఉండి ఉంటుంది. బుద్ధుడు శయన స్థితిలో మనం చూస్తున్న ఊహా చిత్రానికి మూలాలు లేదా ఆధారాలు మనకు సనాతన లేదా వైదిక లేదా పురాణ సాహిత్యంలోనూ, హైందవ ఆలయాల్లోనూ తేటతెల్లంగా తెలియవస్తున్నాయి.


ఆరాధనలు, మూర్తులు, మందిరాల గురించి బుద్దుడు మాట్లాడలేదు; సూచించలేదు. బుద్ధ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఒక దశలో బుద్ధుడికి మందిరాలు, మూర్తులు రావడం బుద్ధ-ద్రోహం. అప్పటికి ప్రచారంలో ఉన్న విష్ణువు రూపంలో బుద్ధుణ్ణి చూపించి ప్రజల్ని బౌద్ధంలోకి లాగే పన్నాగం లేదా ప్రయత్నం జరిగినట్టు స్పష్టమౌతోంది. పౌరాణిక విష్ణువు ఆకృతికి నకలుగా ఒక ఊహా చిత్రణగా శయన బుద్ధుడి ఆకృతి రూపొందింది. ఈ వాస్తవానికి విరుద్ధంగా బుద్ధుడి తరువాతే లేదా బుద్ధుణ్ణి చూసే విష్ణువును రూపొందించుకున్నారు అనడం చదువు, తెలివిడి, తెలివి, బుద్ధి లేకుండా దాష్టికత్వంతో వైదికత్వంపై దాడి చెయ్యడమే. 


బుద్ధుడిని ఆధారంగా చేసుకుని వాస్తవాలకు వ్యతిరేకంగానూ, వక్రీకరణలతోనూ సనాతనంపై దాడి చెయ్యాలనే ప్రయత్నం గర్హనీయం. సత్యాల ముందు ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నం విఫలం అవుతూనే ఉంటుంది. ఆ దాడి చేస్తున్నవాళ్లు అసత్యవాదులు, వర్జనీయమైనవాళ్లు కనుక వాళ్లను ప్రజలు నిరసిస్తున్నారు; వర్జిస్తున్నారు. అంతేకాదు వాళ్లవల్ల బుద్ధుడికి, బౌద్ధానికి కాస్తో కూస్తో ఉన్న పరిగణన కూడా ఈ దేశంలో లేకుండా పోతోంది; వాళ్లవల్ల బుద్ధుడికి పెనుహాని జరుగుతోంది.


మనం వాస్తవాల్ని, చారిత్రిక సత్యాల్ని మననం చేసుకుంటూ అసత్యాలకు, జరుగుతున్న బుద్ధ-హానికర  ప్రయత్నాలకు అతీతంగా బుద్ధుడిని యథాతథంగా పరిగణిద్దాం.


- రోచిష్మాన్

కామెంట్‌లు లేవు: