24, అక్టోబర్ 2023, మంగళవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...  


*శ్రీ స్వామి వారి పుట్టు పూర్వోత్తరాలు..*


*(ఆరవ రోజు)*


మాలకొండ లో శ్రీ స్వామి వారిని కలిసి, వారి ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకొని, ఆ సాయంత్రానికి తిరిగి మొగలిచెర్ల గ్రామం చేరారు శ్రీధరరావు ప్రభావతి దంపతులు..శ్రీ స్వామివారి గురించి వివరాలు తెలుసుకుందామని ఇంటికి రాగానే మరలా శ్రీధరరావు గారిని అడిగారు..


మొదటిసారి శ్రీ స్వామివారిని మాలకొండలో చూసిన తరువాత, శ్రీధరరావు గారు, స్వామివారి గురించి, మాలకొండ స్థానికులవద్ద కొంత సమాచారం సేకరించారు..ముఖ్యంగా కామినేని యాగంటి అనే అతను శ్రీ స్వామివారి అవసరాలు చూస్తూ వుండేవాడు..యాగంటి ది పెద్ద సంసారం..శనివారం నాడు కొండమీద, కొండక్రింద మెట్ల దారి ప్రక్కన కొబ్బరికాయలు..పూజాద్రవ్యాలు..మాలకొండకు వచ్చే భక్తులకు కావాల్సిన ఇతర సామాగ్రి అమ్ముకునే దుకాణం నడుపుకుంటూ..తన సంసారం నెట్టుకొచ్చేవాడు..శ్రీ స్వామి వారు మాలకొండకు వచ్చిన తరువాత ఆయన కు సేవ చేస్తున్నాననే భావంతో మెలిగేవాడు..స్వామి వారు యాగంటిని ఒక గృహస్తుగా చూసేవారు..


యాగంటి ద్వారా శ్రీధరరావు గారికి శ్రీ స్వామివారి గురించి ఒక అవగాహన ఏర్పడింది..ఈలోపల శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య నాయుడు స్వామివారి కోసం రావడం..శ్రీధరరావు గారు పరిచయం కావడం..వారి కుటుంబం గురించిన పూర్తి వివరాలు చెప్పడం జరిగింది..


కడప జిల్లా సిద్దవటం తాలూకా ఇసుకుపల్లె గ్రామంలో తుమ్మల వేముల నాయుడు మోతుబరి రైతు..పెద్దమనిషిగా కూడా పేరు తెచ్చుకున్నవాడు..భార్య వెంకట సుబ్బమ్మ భర్తకు తగ్గ ఇల్లాలు..ఐదుగురు సంతానం..అందరూ మొగపిల్లలే.. పెద్దకుమారుడు వెంకట కృష్ణయ్య నాయుడు..రెండవకుమారుడు రామకృష్ణ నాయుడు, మూడవకుమారుడు రాజగోపాల నాయుడు..


నాలుగవ కుమారుడు వేణుగోపాల నాయుడు..ప్రస్తుతం మనం "శ్రీ స్వామివారు"గా పిలుచుకుంటూ వున్న వ్యక్తి ఇతనే..1944 వ సంవత్సరం లో వెంకట సుబ్బమ్మ గర్భాన జన్మించారు..భవిష్యత్ లో అవధూతగా మారి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందించడానికి తన నాలుగవ సంతానమైన ఈ బాలుడు కారణం కాబోతున్నాడని ఆ తల్లికి అప్పుడు తెలియదు..తెల్లని మేనిఛాయతో.. తేజస్సు కలసి బోసి నవ్వులు చిందించే ఈ బాలుడు అల్పాయుష్కుడని కూడా ఆ దంపతులకు తెలీదు..తాము ఒక అవధూతకు జన్మ నిచ్చి, తమతో పాటు..తమ వంశాన్ని  కూడా తరింపచేసామని...వేముల నాయుడు, వెంకట సుబ్బమ్మ దంపతులకు తెలియదు.. 


ఐదవ కుమారుడు పద్మయ్య నాయుడు..


ఆ ఐదుగురు సంతానంలో నాలుగవ వాడైన వేణుగోపాల నాయుడి కి చిన్నతనం నుంచే..అంటే..ఐదేళ్ల ప్రాయంలోనే దైవం మీద ఆసక్తి కలిగింది..అప్పుడు ఆ బాలుడి మనసులో పడిన భక్తి బీజం..క్రమంగా వేళ్లూనుకుని..అతని జీవితాన్నే మలుపుతిప్పేసింది..అందరు పిల్లలూ ఆటలాడుకొనే సమయంలో..ఈ పిల్లవాడు మాత్రం దీర్ఘమైన ఆలోచన లో వుండేవాడు..ఎక్కువగా ఏకాంతంగా గడిపేవాడు..విభిన్నంగా కనిపిస్తున్న వేణుగోపాల నాయుడి ప్రవర్తన కు  తల్లిదండ్రులకు కొద్దిగా ఆందోళన కలిగించినా..దైవం పట్ల అతనికున్న భక్తి ప్రపత్తులు చూసి మురిసిపోయేవారు..అన్నలందరూ చదువుకుంటూనే..తండ్రికి వ్యవసాయం లో చేదోడు వాదోడుగా వుండేవారు..ఇంటి పని, పాడి పని, పిల్లల పెంపకం తో వెంకట సుబ్బమ్మ కు తీరుబడి ఉండేది కాదు..


శ్రీ స్వామి వారి కి (వేణు గోపాల నాయుడు) ఎనిమిది, తొమ్మిదేళ్ల ప్రాయంలో తండ్రి వేముల నాయుడు మరణించారు..పెద్దవాడైన వెంకట కృష్ణయ్య నాయుడు, రెండవ వాడైన రామకృష్ణ నాయుడు మీదే సంసార భాధ్యతలు పడ్డాయి..సహజంగానే కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు మరణించడంతో..సంసారం కొద్దిగా ఒడి దుడుకులకు లోనయ్యింది..ఇసుకుపల్లె లో వుండే పొలం రామకృష్ణ నాయుడు కి ఒప్పచెప్పి, తల్లిని, తమ్ముళ్లను  తీసుకొని వెంకట కృష్ణయ్య నాయుడు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం "తూర్పు ఎర్రబల్లె " గ్రామానికి వలస వచ్చాడు..అక్కడే పొలం తీసుకొని వ్యవసాయం ప్రారంభించాడు..కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు త్వరలోనే ఆర్ధికంగా నిలద్రొక్కుకున్నాడు..


ఊరు మారినా..శ్రీ స్వామివారి పరిస్థితి లో మాత్రం మార్పు లేదు..చదువు మీద ధ్యాసే లేదు..భక్తి మార్గమే తన ముక్తి మార్గమని ఆ వయసులోనే తెలిసిపోయింది..ఆధ్యాత్మిక గ్రంథం కనబడితే చాలు..వెంటనే చదివే వారు..ఒక్కసారి చదవగానే..మొత్తం గ్రంథం కంఠస్తం అయిపోయేది..అదే బడికి వెళ్లి తరగతిలో బలవంతాన కూర్చోబెట్టినా..ఒక్క ముక్కా బుర్రకెక్కేది కాదు.."ఇది కాదు!".."ఇది కాదు!" అనుకుంటూ.. తన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించే చదువు కావాలి తనకు..అది చూపించే మార్గదర్శి కోసం స్వామివారు ఎదురుచూడ సాగారు..


అవధూత గా మారే తొలి అడుగు..మోక్షసాధనలో మొదటి మెట్టు... రేపు...


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380. & 99089 73699).

కామెంట్‌లు లేవు: