13, ఫిబ్రవరి 2024, మంగళవారం

జరాసంధ వధ

 🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.                *పురాణ పఠనం*

.        *🪐శ్రీ కృష్ణావతారం🪐*

.               *88వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


జరాసంధ వధ 


రెండు పర్వతాలూ, రెండు సముద్రాలూ, రెండు సింహాలూ, రెండు వృషభాలూ, రెండు అగ్నులూ, రెండు మత్తేభాలూ తలపడి పోరుతున్నాయా అన్నట్లుగా, భీమ జరాసంధులు ఇద్దరూ భయంకరంగా ద్వంద్వ యుద్ధం చేశారు. గదలతో భీకరంగా కొట్టుకుంటూ, ఒకరి నొకరు తాకుతూ, పైకెగురుతూ, వంగుతూ, త్రోసుకుంటూ, తన్నుకుంటూ, కుడి ఎడమలకు తిరుగుతూ, ఆకాశం బద్దలవుతోందా అన్నట్లు సింహనాదాలు చేస్తూ, రెండు గదల పరస్పర తాకిడులకు ఛట ఛట మంటూ నిప్పురవ్వలు రాలగా విజృంభించి వారు ఘోరంగా పోరు సాగించారు. అలా భీమ జరాసంధుల భీకర పోరు సాగుతుండగా...హుంకార శబ్దంతో ఆకాశం అల్లల్లాడేలా పాదఘట్టనతో భూమండలం దద్దరిల్లేలా విజృంభించి జరాసంధుడు గదతో సాచిపెట్టి భీముడిని కొట్టాడు. దానితో భీముడు ఆగ్రహోదగ్ర మైన ముఖం భీకరమై వెలిగిపోతుండగా ఆ దెబ్బను తప్పించుకుని, తిరిగి జరాసంధుని తలమీద మోదాడు. అతడు దానిని తప్పించుకున్నాడు. భీమజరాసంధులు ఏమాత్రం వెనుదీయకుండా విజృంభించి పెద్దపులుల్లాగా ఒకరినొకరు వీపులూ మూపులూ ముంజేతులూ శిరస్సులూ తొడలూ మోకాళ్ళూ నడుములూ బ్రద్దలయ్యేటట్లు గట్టిగా పెద్ద పెద్ద గదాఘట్టనలతో కొట్టుకోసాగారు. అలా పరస్పరం మోదుకుంటూ, తప్పించుకుంటూ...పెనుగదలు బద్దలై పొడిపొడిగా రాలేలాగ, పిడుగులు పడేలా, చుక్కలు రాలేలా, నిప్పురవ్వలు వ్యాపించేలా, దిక్కులు వణికేలాగ, సముద్రాలు అల్లకల్లోల మయ్యేలాగ, భూమి చలించేలా; కొట్టుకుంటూ, నెట్టుకుంటూ; ఒకరికొకరు తీసిపోకుండా; పిడుగుపాటు దెబ్బలకు అదిరిపోతున్నా, తడబాటు అన్నది లేకుండా తట్టుకుంటూ ఆ భీమజరాసంధులు యుద్ధం చేశారు.

అలా భీమజరాసంధులు పోరాడుతుండగా వారి గదాదండాలు ఖండఖండాలు అయిపోయాయి. దానితో ఇద్దరూ నిరుత్సాహపడకుండా దిగ్గజాల తొండాలవంటి ప్రచండ బాహుదండములు సాచి ముష్టియుద్ధానికి తలపడి.....కాళ్లతో కుమ్ముకుంటూ కీళ్ళు విరగకొట్టుకుంటూ, నొసళ్ళూ, ప్రక్కలూ, చెక్కిళ్ళూ, రొమ్ములు పగిలేలా, ఎముకలు విరిగేలా, గాయాలనుండి నెత్తురు కాలువలు కట్టి ప్రవహించేలా, భూత, బేతాళాలు కేరింతలు కొడుతూ ఉండగా భీమజరాసంధులు ఇరువురూ యుద్ధం చేయసాగారు. ఆ ముష్టియుద్ధంలో భీమజరాసంధులు ప్రక్కలూ, చెక్కులూ, మెడలూ పగిలేలా చేతులతో బాదుకుంటూ, ముక్కులు పగిలేలా గ్రుద్దుకుంటూ, డొక్కల్లో పిక్కల్లో పొడుచుకుంటూ అతి భయంకరంగా పోరాడారు. భీమజరాసంధులు ఇద్దరూ హుంకారాలు చేస్తూ ఒకరి నొకరు తాకుతూ, తిరిగి దూరమవుతూ, శరీరాలు పగిలి గుల్లలయ్యేలా కాళ్ళతో కుమ్ముకుంటూ, పిడికిటి పోట్లతో నొప్పించుకుంటూ, సోలుతూ, వాలుతూ, రొప్పుతూ రోజుతూ, తేరుకుంటూ, బలపరాక్రమాలు ప్రదర్శిస్తూ పోరాడ సాగారు. ఇలా దేవేంద్రుడి వజ్రాయుధంలాంటి పిడిగ్రుద్దుల వలన శరీరాలు పగిలి కారుతున్న రక్తాలతో భీముడు జరాసంధుడు పుష్పించిన అశోకవృక్షాలలా, ఎఱ్ఱని కొండలలా కనబడసాగారు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి పుట్టుక చావుల గురించిన వివరాలు తెలిసినవాడు కాబట్టి, భీముడికి అలసట కలుగకుండా తన దివ్యతేజాన్ని అతడిలో ప్రవేశపెట్టాడు. శత్రుసంహార ఉపాయం ఆలోచించి, భీముడు చూస్తుండగా శ్రీకృష్ణుడు వీణ్ణి ఇలా చేసి చంపు అని సూచన అన్నట్లు, ఒక చెట్టురెమ్మను పట్టుకుని రెండుగా చీల్చి పడేసాడు. అది గ్రహించిన భీముడు తక్షణం జరాసంధుడిని క్రింద పడవేసి ఒక కాలును తన కాలుతో త్రొక్కిపెట్టి, రెండో కాలు చేతులతో గట్టిగా పట్టుకుని మదించిన ఏనుగు తాటిచెట్లను పెళపెళమనే శబ్దం పుట్టేలా చీల్చునట్లు, వాడిని తల వరకూ చీల్చి చంపేశాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి పురజనులు భయంతో హహాకారాలు చేశారు.


 రాజబంధమోక్షంబు 


జరాసంధుడిని చంపినందుకు అర్జునుడూ కృష్ణుడూ ఆనందంతో భీముడిని కౌగలించుకున్నారు; అతని పరాక్రమాన్ని ప్రస్తుతించారు. దయామయుడూ భక్తవత్సలుడూ అయిన శ్రీకృష్ణుడు అప్పుడు జరాసంధుడి కుమారుడైన సహదేవుడికి పట్టం గట్టి మగధరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు..జరాసంధుడికి లోబడి అతడి చెరసాలలో దుఃఖంతో మ్రగ్గుతూ, తన పాదపద్మాలనే స్మరిస్తూ ఉన్న ఆ రాజులు అందరినీ (విడిపించాడు) .

అలా ఆ సమయంలో శ్రీకృష్ణుడు మరచిపోకుండా ఆ రాజులు అందరిని కారాగారం నుండి విముక్తులను చేసాడు. వారు చాలాకాలం పాటు చెరసాలలో బంధించబడి అనేక బాధలు పడుతూ ఉండడం వలన రక్తమాంసాలు క్షీణించి, చిక్కిశల్యమై, దుమ్ముకొట్టుకున్న శరీరాలతో, జడలు కట్టిన తలలతో, మాసిన బట్టలతో వాసుదేవుడి వద్దకు వచ్చారు. పద్మాక్షుడూ, భవబంధ విమోచనుడూ, దురిత దూరుడూ, నానాలంకార సంశోభితుడూ, దోష రహితుడూ, భక్తులకు ఉత్సాహాన్ని ఇచ్చేవాడూ, శివుడి చేత పొగడబడేవాడూ, సకల లోక విహారుడు, గరుడ వాహనుడూ, మంగళాకారుడూ, ఇంద్రనీల ఛాయ దేహము వాడూ, విశాల వక్షము వాడు, గొప్ప కిరీటం ధరించు వాడు, పచ్చని పట్టువస్త్రాలు ధరించు వాడు, ముత్యాల పేరులు వనమాలలు ధరించువాడు, శ్రీవత్సశోభితుడూ, శంఖ చక్ర గదా శార్ఞ్గ పద్మాలను ధరించు వాడు, పవిత్ర చరితుడూ, దేవకీపుత్రుడూ అయిన కృష్ణుడిని ఆ రాజులు అందరు చేరి దర్శించారు. బంధవిముక్తులైన ఆ రాజులందరూ సంతోషించారు.


కృష్ణుని పాదాలకు మ్రొక్కి, చేతులుజోడించి నమస్కారం చేసి అణుకువగా ఇలా స్తుతించారు.


“ఓ దయామయా! సజ్జనుల దుఃఖాలను పోగొట్టేవాడా! ఆశ్రితరక్షకా! దురిత నివారణ! వరదా! పద్మనాభా! శ్రీహరీ! శ్రీకృష్ణ! వాసుదేవా! గోవిందా! ఇందిరావల్లభా! ఆశ్రిత ఆర్తి హరణా! శాశ్వతా! అనంతా! లక్ష్మీపతి! నీకు ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటాము. యాదవవంశ మనే సముద్రానికి చంద్రుని వంటి వాడా! పరమజ్ఞానీ! శ్రీకృష్ణా! నీ పాదాలను ఆశ్రయించిన మాకు జరాసంధుడి బంధనాల వలన కలిగిన పరితాపాన్ని నీ కరుణాకటాక్షమనే జడివానతో చల్లార్చావు. అవును, సజ్జనులను రక్షించుట, దుర్జనులను శిక్షించుట చేయడమే నీ కర్తవ్యాలు కదా. వినవయ్యా శ్రీకృష్ణా! జరాసంధుడు మా దగ్గర బంధువే కాని శత్రువేం కాదు. రాజ్యవైభవం అనే మదాంధులమైన మా గురించి చెప్పటం అనవసరం. దుర్జనులు మనోఙ్ఞమైన నీటి అలలలాగా, దీపశిఖలలాగా చంచలములు ఐన సిరిసంపదలు శాశ్వతాలని నమ్మి, పరానికి సంబంధించిన కార్యకలాపాలను పరిత్యజించుతారు; పరస్పరం విరోధాలను పెంచుకుంటూ దుష్ఠులు అయి, ప్రజలను బాధిస్తూ ఉంటారు; మరణభయాన్ని మరచిపోయి, పొగరుబోతులై ప్రవర్తిస్తారు. ఓ మాధవా! లక్ష్మీపతీ! త్రిలోకశరణ్యా! అట్టి దుర్జనులు చివరకు ఐహికసుఖాలను నష్టపోతారు; వ్యర్ధమైన కోరికల వెంటబడి నీళ్ళనే భ్రమతో ఎండమావులను చేరినట్లు భ్రష్టులైపోతారు; సంసారసముద్రాన్ని దాటలేక నశించిపోతారు; అటువంటి క్లేశములు మేము అనుభవించలేము. యశోదామాతచే ఉదరమున తాడు కట్టబడిన దామోదరా! శ్రీకృష్ణా! దుష్ట సంసారసాగరాన్ని తరింపచేసేవాడా. ఈ సమస్త సృష్టికీ కారణమైన వాడా. వేదాంత వీధుల్లో విహరించే నీ పాదపద్మాలు మా హృదయాల్లో ఎల్లప్పుడూ నిలచి ఉండే ఉపాయాన్ని మాకు అనుగ్రహించు.” భక్తజనావాసుడైన పద్మలోచనుడు దయతో కూడినవాడై, తనను శరణుకోరుతున్న ఆ రాజులకు ఇలా చెప్పాడు. “ఓ రాజులారా! మీ మాట నిజం. రాజ్యమదంతో బ్రాహ్మణులనూ, ప్రజలనూ మిక్కిలి బాధించటం వలననే కదా వేనుడు, నహుషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు నాశనమయ్యారు. కాబట్టి ధర్మాన్ని పాటించకపోతే కులం, బలం, ఆయుస్సు, ఔన్నత్యం నిలబడవు. కావున, ఈ శరీరం శాశ్వతంకాదని మీరు గ్రహించండి...మీరు ధర్మాన్నీ నీతినీ న్యాయాన్నీ తప్పకుండా ప్రజలు సుఖసంతోషాలలో మునిగితేలేలా పరిపాలన సాగించండి. నన్ను ఉద్దేశించి యజ్ఞయాగాదులను నిర్వహించండి. నా పాదాలను భజిస్తూ పాపరహితులై చక్కగా ప్రవర్తించండి. మీరు కనక అలా నడచుకుంటే ముక్తిని పొందుతారు. నా పాదాలపై మీకు అచంచలమైన భక్తి సిద్ధిస్తుంది.” అని ఆనతి ఇచ్చి, శ్రీకృష్ణుడు ఆ రాజులకు అందరికీ మంగళస్నానాలు చేయించాడు. మణిభూషణాలూ, మాల్య వస్త్ర గంధాలనూ బహుకరించాడు. సుష్ఠుగా భోజన తాంబూలాదులు పెట్టించాడు. వారిని సంతృప్తులను చేసాడు. రథాలు గుఱ్ఱాలు గజాలు ఎక్కింపించి, వారి వారి రాజ్యాలకు పంపించాడు. జరాసంధుడిచే బంధింపబడిన ఆరాజులందరూ ఈ విధంగా శ్రీకృష్ణుడిచేత బంధవిముక్తులై, ఎంతో సంతోషంతో గౌరవప్రదంగా వారి వారి రాజ్యాలకు బయలుదేరారు. తమ భార్యా పుత్రులు మిత్రులు మున్నగువారు సంతోషించగా నిర్మలహృదయులై పద్మాక్షుడు శ్రీకృష్ణుడి సద్గుణాలను సంకీర్తిస్తూ, శ్రీకృష్ణుడిని... ఆ రాజులు అనేక రకాల నుతిస్తూ తమ తమ రాజ్యాలకు వెళ్ళారు. ఆ రాజులు అందరూ న్యాయశీలురై శ్రీకృష్ణుడు ప్రబోధించిన ధర్మమార్గాన్ని తప్పక తమ తమ రాజ్యాలను వైభవంగా పరిపాలించుకుంటూ సుఖంగా ఉన్నారు. అలా శ్రీకృష్ణుడు జరాసంధ సంహారం, రాజులందరినీ విడిపించుట నిర్వహించాడు. భీముడు అర్జునుడు తాను జరాసంధుడి కుమారుడు సహదేవుడు చేసిన పూజలను స్వీకరించారు. పిమ్మట, బయలుదేరి భీమార్జున సమేతుడై ఇంద్రప్రస్థపురం చేరాడు. పుర ముఖద్వారంలో వారు విజయశంఖాలు పూరించారు. శత్రు భీకరములు, బంధు ప్రీతికరములు అయిన ఆ విజయసూచకాలైన ఆ శంఖధ్వనులను విని, పౌరులందరూ జరాసంధుడు మరణించాడని గ్రహించి సంతోషించారు. శ్రీకృష్ణుడు భీమార్జున సహితంగా ధర్మరాజును దర్శించి నమస్కారం చేసి, తాము మగధకు వెళ్ళిన వృత్తాంతం అక్కడ జరిగిన జరాసంధ సంహారాది సర్వం వివరంగా నివేదించాడు. కన్నులలో ఆనందబాష్పాలు పొంగిపొరలుతుండగా కృష్ణుడికి తమమీద గల స్నేహ వాత్సల్య కారుణ్యాది గుణాలకు సంతోషిస్తూ ధర్మరాజు ఈ విధంగా అన్నాడు. “ఓ కమల నయనా! శ్రీకృష్ణా! నీ అంశంనుండి జన్మించిన దిక్పాలకులు అందరూ సర్వలోకాలకూ గురుడవైన నీ ఆజ్ఞను శిరసావహిస్తూ లోకాలు అన్నింటినీ పరిపాలిస్తున్నారు. అంతటి నీకు ఒక సామాన్యుడైన భూపాలుడిని శిక్షించడం ఒక లెక్కలోనిది కాదు. ఇదంతా నీ మాయ కాక మరేమిటి గోవిందా! పుండరీకాక్ష! లోకరక్షకా! చిన్మయరూపా! అద్వితీయమైన నీ తేజస్సుకు తిరుగు లేదు. నీ పాదసేవకులకు భేదభావం ఏమాత్రం కానరాదు.”


సశేషం🙏


*🙏 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: