21, నవంబర్ 2020, శనివారం

సౌందర్య లహరి

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఇరవైయవ శ్లోక భాష్యం - ఆరవ భాగం


అమృతంతో సంబంధమున్న గరుత్మంతుడు ప్రజలను విషము నుండి రక్షిస్తాడు. చంద్రకాంత శిలామూర్తిగా అంబికను ధ్యానం చేసినవారు గరుడుని వలే పాముల విషాన్ని శమింప చేయగలడని ఆచార్యులవారంటున్నారు. “ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ”. 'శకుంతము' అంటే పక్షి. మేనకా విశ్వామిత్రుల సంతానము పక్షుల చేత పెంచబడి శకుంతల అయింది కదా! గరుత్మంతుడు శకుంతాధిపుడు పక్షిరాజు. 


ఈ శ్లోకం జపం చేయడం వలన పాముకాటు వల్ల ఎక్కినా విషము హరించడమేకాక, దోమవంటి కీటకముల వలన కలిగిన చలిజ్వరములు, వైరల్ జ్వరములు కూడా శమిస్తాయి. అంబికను అమృత కిరణమూర్తిగా ధ్యానించిన వారికి అమృతనాడి సిద్ధిస్తుంది. లేక సహస్రారంలో కురిసిన అమృతపు జల్లులకు అతడి నాడీమండలమంతా అమృత మయమవుతుంది. అమృత నాడులున్న అతడి దృష్టి జ్వరగ్రస్తుని పై పడితే చాలు, జ్వరం మటుమాయమయిపోయి అతడు సుఖిస్తాడు. 


“జ్వరపుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా”


అంబిక అరుణారుణమైన తనుచ్ఛాయతో నభోంత రాళములు ప్రకాశిస్తున్నట్లు ఆ కాంతితో భూమ్యాకాశములు నిండిపోయినట్లు భావించిన సాధకునికి వశీకరణ శక్తి లభిస్తుందని పద్దెనిమిదవ శ్లోకంలో చెప్పబడి ఉంది. సాధారణంగా అంబిక తనుచ్ఛాయ శుద్ధస్ఫటికం వలె ప్రకాశించేదే అయినప్పటికీ, శ్రీవిద్యాధిదేవతగా అంబిక అరుణవర్ణంతో ప్రకాశిస్తుందని చెప్పబడింది. అది శ్రీ విద్యాధిదేవత యొక్క ప్రత్యేకత. సూర్యోదయ కాలంలో ఆకాశమంతా అరుణిమతో ప్రకాశిస్తుంది కదా! అదే విధంగా భూమ్యాకాశములు, సమస్త బ్రహ్మాండము ఆమె తనుచ్ఛాయవలన అరుణారుణంగా ప్రకాశిస్తోందనే భావన చేయాలన్నమాట. వశీకరణ విషయంలో మనం వశీకరింపబడకూడదనే ఉద్దేశంతో నేనా శ్లోకాన్ని వ్యాఖ్యానించలేదు. అయితే అంబిక యొక్క ప్రత్యేకత అయిన ఈ అరుణ వర్ణం గురించి చెప్పుకోకుండా ఉండేదెలా? అదీకాక వశీకరణం యొక్క అంతరార్థం గురించి మనం చెప్పుకోవద్దా?


సొందర్యలహరిలోనూ మరి అటువంటి ఇతర శాక్త గ్రంథములలోనూ వశీకరణ, స్త్రీవశ్యము, మన్మథునిబోలిన గురించి బహుధా చెప్పబడి ఉంటుంది. ఆ మాటల అర్థాన్ని కేవలం వాచ్యార్థంగా తీసుకొంటే ప్రమాదమున్నది. ఒక వ్యక్తీ ఇంకొకరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడంటే అర్థమేమిటి? అతడు వారిచే ఆకర్షించబడినాడన్న మాట. అందువల్లనే వశీకరణ మంత్రాలను ఉపయోగించి వారిని స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఒకరు ధన కనక వస్తువాహనాది సంపదను సంపాదించి, వాటిని తాను స్వంతం చేసుకొన్నానని భావిస్తారు. నిజంగా జరిగేది ఏమంటే అతడు వాటిచేత స్వంతం చేసుకోబడ్డాడు. వాటికి బానిస అయినాడు. దీనికి తార్కాణమేమిటి? ఒకవేళ ఆ సంపద పోయినట్లయితే ఈతడి మతి చలించిపోతోంది కదా! ఏదో ఒక వస్తువునో, వ్యక్తినో వశీకరించుకోవాలని మంత్రజపం చేసే వ్యక్తి, తన వశ్య మంత్రానికి గమ్యమైన వస్తువు లేక కోరికకు బానిస అయిపోయాడు. అటువంటి వానికి అంబికను సదా తన హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తూ క్రమశః ఆత్మసాక్షాత్కారం పొందే దారి మూసి వేయబడుతుంది.


మంత్రశాస్త్రాన్ని ఆవిష్కరించిన ఆచార్యుల వారి వంటి మహాపురుషులు ఒక మనిషి తన పరమగమ్యము చేరుకోవడానికి పయనించవలసిన దారిని మూసివేసే పద్ధతి ఉపదేశిస్తారని మీరనుకొంటున్నారా? అంబిక భక్తులు మనఃస్థితిని ఆచార్యులవారు “మృదితమల మాయేన మనసా” అని అభివర్ణిస్తారు. భక్తుని మనసు చెడ్డ ఆలోచనలకు, కోరికలకు దూరంగా మాయను అణచి ఉండే విధంగా ఉంటుందట. అంబిక భక్తుడు తుచ్ఛమైన వశీకరణాది విషయాల్లో మనస్సు పెట్టేవాడుకాదు. మాయ అనే మహా సర్పాన్ని కాళీయ మర్దనం చేసిన కృష్ణునివలె మర్దించేవాడు. కాబట్టి 'వశ్యము' అనేదానికి అంబికను ధ్యానించే సాధకుడు ఎటువంటి ఆకర్షణలకు బానిసకాడనీ, అతడి మనస్సు ఎప్పుడూ అతడి అధీనంలోనే ఉంటుందనీ అర్థం చెప్పుకోవాలి. అతడు వశీకరించు కొన్నాడన్న మాటకు ఆ వస్తువు అతనిలో ఐక్యమయిందనే అర్థం చెప్పుకోవాలి. గీతలో భగవానులు “సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయాం ప్రవిశంతి సర్వే” అంటారు. సముద్రం నదులన్నిటినీ తనవైపుకు లాగి తన అధీనంలోనికి తెచ్చుకొన్నట్లు - వశ్యమంటే తన వైపుకు లాగుకొనడమేకదా! నదులుగానీ, సముద్రం గానీ ఒకదాని కొకటి భిన్నంగా గుర్తించుకోలేవు కదా! సముద్రము నదులూ కూడా అద్వైత భావాన్ని పొది “శాంతిం ఆప్నోతి” శాంత స్థితిని పొందుతాయి.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: