21, నవంబర్ 2020, శనివారం

రామాయణమ్ 131

 రామాయణమ్  131

.....................

రాముడు తన మీద మరులుకొన్న శూర్పణఖను చూస్తూ పూజ్యురాలా! నాకు వివాహమైనది ఈమె నాకు చాలా ఇష్టురాలైన భార్య. నీవంటి ఆడవాళ్ళకు సవతిపోరు ఎందుకుగానీ అడుగో అతడు అక్కడున్నాడే వాడు! నా తమ్ముడు లక్ష్మణుడు! భార్య దగ్గర లేనివాడు, పరాక్రమ వంతుడు .

.

,చూడగానే ఆనందము కలిగించేవాడు,చాలాకాలమునుండి భార్యాసుఖము లేనివాడు ప్రస్తుతము భార్య అవసరము ఉన్నవాడు.అతడిని సేవించు నీకు సవతి పోరు ఉండదు అని పలుకగా ఆ రాక్షసి రాముని విడచి లక్ష్మణుని వద్దకేగి ఆయనతో " నీ సౌందర్యానికి నేనే తగిన దానను రా ! హాయిగా విహరిద్దాము అని పలికింది.

.

అప్పుడు పరిహాసంగా ఒక చిరునవ్వు నవ్వి ఓ! లోకోత్తరసుందరీ! నేనే దాసుడను అడుగో మా అన్న ఆయనకు దాస్యము చేస్తున్నాను నాతోపాటు నీవుకూడా దాసివి అవుతావా ఆ బాధలు నీకెందుకు గానీ ఆయననే మరొక్కమారు అడుగు ,వికృతంగా అణగిపోయిన పొట్టతో భయంకరంగా ఉన్న ఆ ముసలి భార్యను విడిచి నిన్నే చేసుకుని రమిస్తాడు అని వేళాకోళంగా మాట్లాడాడు.

.

అది నిజమే అని నమ్మి మరల రాముని వద్దకు వెళ్లి .

ఈ వికృత రూపంతో చెడ్డదైన ముసలి భార్య నీకెందుకు? దీనిని ఇప్పుడే నేను తినేస్తాను నాకు సవతి పోరు ఉండదు ,అప్పుడు మనమిద్దరమూ సుఖముగా ఉండవచ్చు అని అంటూ సీతను భక్షించడానికి మీదమీదకు రాసాగింది .

.

అది మీదకు వస్తుంటే సీతమ్మ వణికిపోయింది వెంటనే రాముడు అడ్డము వచ్చి  ,లక్ష్మణా అంటూ కేకవేశాడు.

.

ఇదుగో ఈ రాక్షసులతో మనకు పరిహాసమెందుకు? ఈ రాక్షసి చాలా మదించి ఉన్నది దీనిని వికృత రూపుగాలదానినిగా చెయ్యి అని పలికాడు.

.

వెనువెంటనే లక్ష్మణుడు ప్రక్కనే ఉన్న ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోసివేశాడు.ఆ గాయాల బాధకు అది వికృతముగా అరుస్తూ వచ్చినదారినే పారిపోయింది.

..

జానకిరామారావు వూటూకూరు

.

కామెంట్‌లు లేవు: