18, ఆగస్టు 2020, మంగళవారం

ఆంధ్రపత్రిక* సంపాదకీయం

 ఒరిగిన సంగీత శిఖరం*// భారతీయ సంగీతమూర్తి అవతారం చాలించింది.ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయకుడు,విద్వాంసుడు  పండిట్ జస్ రాజ్ కన్నుమూశారు. తొమ్మిది పదుల జీవితంలో, ఎనిమిది దశాబ్దాలకు పైగా పాడుతూనే ఉన్నారు.పాడుతూనే తుది శ్వాస వదిలారు.ఉఛ్వాస నిశ్వాసలే సంగీతంగా జీవించారు.అద్భుతమైన పాండిత్యం.పరమాద్భుతమైన కళా విన్యాసం.అన్నింటికీ మించిన భక్తి.శ్రావ్యమైన గొంతు.ప్రతి శృతిలోనూ మాధుర్యం చిలికే గాత్ర సంపద ఆయన సొత్తు.గంభీరమైన రాగాలు, స్వరాలు  కూడా మాధుర్యంగా   ఆ గానంలో ఒదిగిపోతాయి.తాను నేర్చుకున్న విద్య తన వద్దే వుంచుకోలేదు.గొప్ప శిష్య సంపదను సృష్టించారు.సంజీవ్ అభయంకర్, సాధనా సర్గమ్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామ్ నాథ్ మొదలైన ఎందరో పేరెన్నిక గన్న కళాకారులంతా జస్ రాజ్ కు శిష్యులు.సుప్రసిధ్ధ మేవాతీ ఘరానాలో సంగీత అభ్యాసం చేసిన పండిట్ జీ, ఆ ఘరానా గౌరవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పారు.జయహో! మాతా! అని జస్ రాజ్ కచేరీ ప్రారంభించేవారు.భజన్లు, అభంగ్ లు, శ్లోకాలకు వీరు తీసుకువచ్చిన పేరు అంతా ఇంతా కాదు.వీరిది హిందుస్థానీ సంగీతమైనా, దక్షిణాది వారు కూడా వీరి పాటకు చెవి కోసుకుంటారు.ఉత్తరాది-దక్షిణాది అనే అడ్డుగీతలు చెరిపేసిన భారతీయ సంగీతమూర్తి. సంగీతాన్ని ప్రతిభా ప్రదర్శనగా ఏనాడూ చూపించలేదు.దేవతార్చనగానే భావించారు. దుర్గాదేవి ఉపాసకులు.తన కుమార్తెకు, ఇంటికి కూడా దుర్గాదేవి పేరు పెట్టుకున్నారు. శ్రీకృష్ణపరమాత్మను అంతగానే ఆరాధించారు.ఆ మూర్తులను హృదయ పద్మాలలో  నిలుపుకొని గానం చేసిన పరమ భక్తుడు జస్ రాజ్. ఎందరో మహా కళాకారులతో జుగల్ బందీలు,త్రిగళ్ బందీలు చేశారు.ఎవరైనా సరే, వీరి గానానికి బందీ కావాల్సిందే.పండిట్ హరి ప్రసాద్ చౌరాసియా, పండిట్ శివ్ కుమార్ శర్మ, ఎల్ సుబ్రహ్మణ్యం మొదలైన దిగ్గజ వాద్య విద్వాంసులు వీరితో జత కలిసి కచేరీలు చేశారు.  జుగల్ బందీల్లోనూ జస్ రాజ్ ఎప్పుడూ ప్రతిభా ప్రదర్శన చెయ్యలేదు.సహజ గంగా తరంగంలా, మెరుపు వేగంతో ఆ గానం ప్రవహించింది.ఆయన ఒక యోగి. ఒక జ్ఞాని.ఒక మౌని. సంగీత రూప తపస్సంపున్నుడు.వారు పాడుతూ ఉంటే, ఆ దృశ్యం మనకు ఆ భావం కలిగిస్తుంది. శిష్యవాత్సల్యంబు చెలువుతీరిన మూర్తి.ప్రేమ స్వరూపుడు. పండిట్ జీ పరమ వినయ సంపన్నుడు.జస్  రాజ్ కు  కొన్ని కోట్లమంది అభిమానులు ప్రపంచమంతా ఉన్నారు.విద్యలో ఆయన చూడని లోతులు లేవు.కీర్తిలో ఆయన ఎక్కని శిఖరాలు లేవు.ఎప్పుడో 20ఏళ్ళ క్రితమే పద్మవిభూషణ్ పొందిన ఘనుడు.35ఏళ్ళ క్రితమే సంగీత నాటక అకాడెమి అవార్డు సొంతం చేసుకున్నారు. జస్ రాజ్ గొంతులోనే ఒక చెప్పలేని మత్తు ఉంటుంది. భక్తి కోసమే పుట్టిన సంగీతమూర్తి. ఎనిమిది దశాబ్దాల  పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిని గానంతో తరింప జేసిన, పురుషాకృతి దాల్చిన సంగీత సరస్వతి జస్ రాజ్.దర్బారీ,అహిర్ భైరవ్, విలక్షణ తోడి, భాగేశ్రీ, భూప్, మాల్కౌన్స్, కావేరి, యమన్.. ఇలా ఏ రాగంలో పాడుతున్నా, వినేవారు  రసలోకాల్లో విహరించాల్సిందే. ప్రతిభ,కళ, పాండిత్యం రంగరించుకున్న   పరమ భాగవతోత్తముడు. వీరి విద్యా వికాసం వినయ స్వరూపం .చిన్ననాడే బేగం అక్తర్ గజల్స్ కు ఆకర్షితుడయ్యారు.సంగీతమే లోకంగా జీవించారు.  జుగల్ బందీలోనూ వినూత్న ప్రయోగాలు  చేశారు.త్రివేణి, ముల్తానీ, బేహడ, గౌడగిరి మల్హర్, పూర్వీ రాగాలు జస్ రాజ్ గొంతులో కొత్తగా పలుకుతాయి. చిదానంద రూప శివోహం శివోహం, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద్ దామోదర మాధవేతి, మేరో అల్లా,శ్రీ కృష్ణ మధురాష్టకం మొదలైన గీతాలు సుప్రసిద్ధం.అధరం మధురం, వదనం మధురం గీతం పరమాద్భుతం. హైదరాబాద్ కు - పండిట్ జీకి ఉన్న అనుబంధం చాలా ఆత్మీయమైంది.  బాల్యమంతా  ఎక్కువగా  హైదరాబాద్ లోనే సాగింది. ఆ  చిహ్నంగా, తండ్రి, సంగీత కళాకారుడు పండిట్ మోతీ రామ్ జీ  స్మృతి చిహ్నంగా , ప్రతి సంవత్సరం  హైదరాబాద్ లో, కార్తీకమాసంలో సంగీత సమారోహ్ నిర్వహించేవారు. చివరగా 2014 లో ఆంధ్రప్రదేశ్ లో,విశాఖపట్నంలో,శ్రీ కొప్పరపు కవుల కళా పీఠంవారి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు.ఆ సందర్భంగా జస్ రాజ్ మాట్లాడుతూ తెలుగు నా మాతృభాష అని చాటి  చెప్పుకున్నారు. తెలుగురాష్ట్రాలు రెండుగా ఏర్పడినా, తెలుగువారంతా ఒక్కటే అని పండిట్ జస్ రాజ్ తెలుగునేలపై తన కున్న అనురాగాన్ని ఆవిష్కరించారు.  నాదయోగి పండిట్ జస్ రాజ్  అవతారం సమాప్తమైంది. అనంత సంగీత లోకంలో, కాలంలో, ఆ నాదం వినిపిస్తూనే ఉంటుంది.జయహో! పండిట్ జీ -మాశర్మ🙏
*********************

కామెంట్‌లు లేవు: