18, ఆగస్టు 2020, మంగళవారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*67వ నామ మంత్రము* 18.8.2020

*ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతాయై నమః*

అశ్వారూఢా దేవి అను దేవతచే అధిష్ఠింపబడిన అనేక గుర్రములచే ఆవరింపబడియున్న జగదీశ్వరికి నమస్కారము.

ఇంద్రియములు అనే  అశ్వములను అదుపులో ఉంచి జ్ఞాన సముపార్జనకు మార్గమును జూపు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతా* యను పదహారక్షరముల (షోదశాక్షరీ) నామ మంత్రమును *ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతాయై నమః* అని ఉచ్చరించుచూ జగన్మాతయైన ఆ లలితాంబను భక్తిప్రపత్తులతో ఉపాసనచేయు భక్తులకు వారి కోరికలు అనే గుర్రములు వారి అదుపులో ఉండి, ఇంద్రియలౌల్యమునకు గురికాకుండా, శాశ్వతజ్ఞాన సముపార్జన, తద్వారా ఆత్మానందమును పొందుదురు.

*అశ్వారూఢా* అనగా ఒక దేవత జగన్మాత పాశమునుండి ఉద్భవించినది. ఈ దేవత అమ్మవారి అశ్వదళములోని *అపరాజిత* అను గుర్రమును అధిష్టించియుండును. ఈ *అశ్యారూఢ* అన్ని జాతుల గుర్రములను అదుపులో ఉంచి రణరంగ మందు తన ఆజ్ఞలకు లోబడి గుర్రములు నడుచునట్లు చేయును. అందుచే జగన్మాత ఈ *అశ్వారూఢ* ను అశ్వసేనా నాయకురాలిగా చేసెను. *అశ్వారూఢ* అను ఈ దేవత *అపరాజితాశ్వము* ను అధిరోహించి, వివిధ జాతుల గుర్రముల సమూహములను తనతో ఉంచుకొని జగన్మాతను (చుట్టూ ఉండి - ఆవరించుతూ) సేవించుచుండును. అనగా అశ్వారూఢ తన సేనతో అమ్మవారికి ముందు ఉండును. శ్రీసూక్తంలో 

*అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా''ద-ప్రబోధి'నీమ్*

 అను మూడవ శ్లోకము లోని మొదటి పాదము ద్వారా ఈ మాటే తెలియుచున్నది.

*కోరికలే గుర్రములయితే* అనే నానుడి ప్రకారం మనకోరికలు గుర్రములవంటివి. అమ్మవారి పాశము *అశ్వారూఢ* అను దేవత వంటిది. ఆ దేవత మన కోరికలను గుర్రములను అదుపులో పెట్టి శాశ్వతమైన బ్రహ్మానందము వైపు మరియు తద్వారా మోక్షసాధనవైపు నడిపించును. గాన ఈ నామమంత్రము జరిపించుటవలన మనకోరికలు అను గుర్రములు అదుపులో ఉండి, మోక్షసాధన దిశగా నడచుచూ జగన్మాత పాదసేవాభిలాష కల్పించును. కనుక జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమును మరియు వివిధ గ్రంథములు పరిశీలించి, వారికి పాదాభివందనమాచరించుచూ వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319
***********************

కామెంట్‌లు లేవు: