18, ఆగస్టు 2020, మంగళవారం

ఆత్మలింగం భూకైలాసం గోకర్ణం

మన దేశంలోని శైవక్షేత్రాలైన వారణాశి, రామేశ్వరం ఆలయాల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో ఆ కోవలోకి చెందినదే మహాబలేశ్వర ఆలయం. కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణ పట్టణంలో కొలువుదీరి ఉన్న ఈ ఆలయాన్ని గోకర్ణం అని కూడా అంటారు. అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి. గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఓ వైపు అపారమైన ఆధ్యాత్మికత, మరో వైపు ప్రకృతి రమణీయకతతో  అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది.

 గోకర్ణ క్షేత్రం గురించి రామాయణ, మహాభారత గ్రంథాలలో వివరించబడింది. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి కఠోర తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నింబంధన ఏమిటంటే.. రావణాసురుడు లంకకు వెళ్లేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు. అలా దించితే ఆ లింగం అక్కడే ప్రతిష్టితమైపోతుంది.

 అలా ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు తన లంక రాజ్యం వైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని భయపడిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ... తదితర దేవుళ్లను వేడుకున్నారు. అప్పుడు గణపతి చిన్నపిల్లవాని రూపంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది.

  అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కిందపెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏ మాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు.

 రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలో గణపతి విగ్రహానికి చూడవచ్చు.

 ఆత్మలింగం చుట్టూ పంచక్షేత్రాలు
 ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరంవైపు నుంచి లాగుతాడు. ఆ పెట్టె అతి విసురుగా వెళ్లి దూరంగా పడిపోయింది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలిసింది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవించింది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురడేశ్వరం లింగం వెలిసింది. పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట ధారేశ్వరలింగం ఉద్భవించింది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం ‘మహాబలేశ్వర లింగం’ గా గోకర్ణంలో వెలిసింది. ఆత్మలింగంతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటారు.

 గో రూపం దాల్చిన భూమాత...
 మరొక కథనం ప్రకారం పాతాళలోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రానికి గో (అవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందంట.

 రాజుల కాలంలో గోకర్ణం
 దక్షిణ కాశి, భూ కైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైంది. కాళిదాసు తన ‘రఘువంశం’ కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేశాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్దనుడు ‘నాగానంద’ కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలను ఏర్పాటు చేశాడని, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు- కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. క్రీ.శ 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.

 సర్వపాప హరణం కోటి తీర్థంలో పుణ్యస్నానం
 గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానాలు ఆచరిస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటి తీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనన్ను అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక, కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్టింపబడిన వరటేశ్వర లింగం ఉంది. ఈ ఆలయం భక్తుల సౌకర్యార్థం 24 గంటలూ తెరిచే ఉంటుంది.

 నయనానందకరం రథోత్సవం
 అతి ప్రాచీనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంది. ఈ లింగం కింది వైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నించడం వల్ల పై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వేలును ఉంచినప్పుడు కిందనున్న లింగం వేలికి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండేళ్లకొకసారి జరిగే విశేష కార్యక్రమంలో శివలింగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ముందుగా వినాయక దర్శనం...

 రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చాతుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వర క్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసి మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనపడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పు దిక్కున ఉంది.

 ఉత్తరాన రుద్రుని సతి తామ్రగౌరి
 మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున తామ్రగౌరి ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని అర్ధాంగి. ఈమె బ్రహ్మదేవుని కుడి చేయి నుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రుని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయత్రం 5 గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.

 సిద్ధించిన అమృతం
 నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఇక్కడే ఆవిర్భవించిందట. అమృతమథనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు జరపడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి. గోకర్ణ క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపకర్మలు తొలగిపోయి సర్వసుఖాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

 సమీప పుణ్యక్షేత్రాలు
 ధారేశ్వర ఆలయం: ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణ దిక్కున దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయసలల శిల్పశైలిలో కనపడుతుంది. దీనిని 11వ శతాబ్దిలో పునర్నిర్మించినట్లు తెలుస్తోంది.
 గుణవంతేశ్వర: ఈ ఆలయం కూడా గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతుంది. గోకర్ణం నుంచి సుమారు 60 కిలోమీటర్లు.  మురుడేశ్వర ఆలయం: పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటుంది. గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరం.
పూర్తి సేకరణ.
********************

కామెంట్‌లు లేవు: