18, ఆగస్టు 2020, మంగళవారం

*భళారే... తెలుగు!*

ఒకప్పుడు ప్రముఖ పాత్రికేయులు శ్రీ భండారు శ్రీనివాసరావుగారు ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన ఈ క్రింది ఆంగ్ల వాక్యాన్ని పోస్ట్ చేశారు:

An Amazing Sentence in English

Remarkable indeed! The person who made this sentence must be a GENIUS in English vocabulary.

"I do not know where family doctors acquired illegibly perplexing handwriting; nevertheless, extraordinary pharmaceutical intellectuality, counterbalancing indecipherability transcendentalizes intercommunication's incomprehensibleness.''

ఈ వాక్యంలో ఇరవై పదాలున్నాయి. ఒకటవ పదంలో ఒక అక్షరం, రెండవ పదంలో రెండు అక్షరాలు, మూడవ పదంలో మూడు అక్షరాలు, ఈ విధంగా అక్షరవృద్ధిక్రమంలో ఇరవయ్యవ పదంలో ఇరవై అక్షరాలు ఉన్నాయి.

ఇదొక అపురూపమైన చిత్ర రచన. దీనికి ప్రతిగా తెలుగు భాషకు గల శక్తిని వెల్లడిస్తూ ఏల్చూరి మురళీధరరావు గారు ఈ క్రింది వాక్యాన్ని ప్రకటించారు: 

“ఏ మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వరచనలో పద్యనిర్మాణశక్తికి, సద్గుణాలంకారవ్యక్తికి,
రసోచితశబ్దార్థయుక్తికి, సుమకోమలభావభావనకు, నవ్యసంప్రదాయపదగుంఫనకు, భవ్యరసాస్వాదరసాయనవాణికి, పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు, భారతీయతామరందాస్వాదలోలుపతకు, అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి, విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు, విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి, ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు, రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి, నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు, అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి, శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి, గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి, ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి, సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!

పై వాక్యంలో 26  అక్షరవృద్ధి దళాలున్నాయి. మొదటి దళం ఒక అక్షరం, రెండవ దళం రెండక్షరాలు, మూడవ దళం మూడక్షరాలు.... ఇలా ఇరవై ఆరవ దళం ఇరవై ఆరు అక్షరాలతో అక్షరవృద్ధిక్రమంలో కూర్పబడి ఉన్నాయి.
*****************************

కామెంట్‌లు లేవు: