30, ఆగస్టు 2023, బుధవారం

తుం గ భ ద్రా న ది

 శు భో ద యం!👏👏

              చొప్పకట్ల.


తుం గ భ ద్రా  న ది

...........................


గంగా సంగమ మిచ్చగించునె, మదిన్  కావేరి  దేవేరిగా 

అంగీకారమొనర్చునే, యమునతో ఆనందమున్ పొందునే, 

రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాక రేంద్రుండు నీ 

అంగంబంటి సుఖించునేని, గుణభధ్రా తుంగభద్రా నదీ!


తెనాలి రామకృష్ణ కవి

పాండురంగ మాహాత్మ్యము

ప్రథమాశ్వాసం

139 వ పద్యం


తెనాలి రామకృష్ణ కవి తుంగభద్రానదిని స్తుతిస్తున్నాడు. 


ఓ తుంగభద్రా నదీ!

నీవు గుణభద్రవు, నీవు సముద్రునితో కలవడం లేదు. ఒకవేళ, తన ఉత్తుంగ తరంగ హస్తాలతో రత్నాకరేంద్రుడైన సముద్రుడు నీ స్పర్శా సౌఖ్యాన్ని గనక పొంద గలిగి వుంటే, అతడు తానిప్పుడు అనుభవిస్తున్న గంగాసంగమాన్ని ఇష్టపడతాడా? కావేరిని దేవేరిగా అంగీకరిస్తాడా? యమునతో ఆనందాన్ని పొందుతాడా? 

అవేవీ ఆ నదులతో పొందబోడని పద్యభావం.


ఈ పద్యంలో సముద్రంలో ప్రత్యక్షంగా కలిసే నదులు రెండు - గంగ, కావేరి. అట్లా కలవని ఉపనదులు రెండు - యమున, తుంగభద్ర. తక్కిన నదీ సముదాయాన్ని కవి పేర్కొనడం లేదు. యమున శాఖానది. త్రివేణి వద్ద గంగతో సంగమిస్తుంది. కాకపోతే, సముద్రుడు యమునతో కూడా ఆనందాన్ని పొందుతున్నాడని వక్కాణిస్తున్నాడు. అంటే, యమునానది, గంగతో బాటు రహస్యంగా ప్రవహించి, సముద్రునితో రహస్య దాంపత్యం నెరపుతున్నదని కవి భావం. అందుకే యమునతో "ఆనందమున్ పొందునే" అంటున్నాడు.

 

విశ్వనాథ వారు ఈ పద్యం గురించి రాస్తూ ఇట్లా అంటారు: "యమున ప్రయాగ వద్ద గంగతో కలిసి ఆమె వెనక దాగికొని వెళ్ళుచున్నది. గంగకు కూడా తెలియకుండా వెళ్ళు చున్నదేమో! సముద్రునకు యమున తోడి సంగమం చాల రహస్య సంగమం. అందుచేత అతడధికమైన సుఖాన్ని పొందుచున్నాడు. అందుకనియే గంగా కావేరుల విషయంలో ఉపయోగించి ఆనంద శబ్దమును వాడినాడు. గంగా కావేరితో సంసారం చేయుచున్నాడు. యమునతో ఆనందమును పొందుచున్నాడని అర్థము" .


ఇది విశ్వనాథవారి వ్యాఖ్య. మరి తుంగభద్ర విషయం? ఆ నది సముద్రునితో రహస్య కాపురం చెయ్యడం లేదని, ఒక్కసారి గనక తుంగభద్రా సౌఖ్యం సముద్రునికి కలిగితే, యమునను పరిత్యజించి, తుంగభద్ర తోనే ఆనందాతిరేకాన్ని పొందుతాడనీ కవి తాత్పర్యం.


ఇదంతా రామకృష్ణ కవి పద్యరచనలో చూపించే గడుసుదనం.


శబ్ద సౌందర్యంలో ఈయన ఎవరికీ తీసిపోడు. ఈ పద్యంలో తుంగభద్ర పొంగులను చూపడానికి శార్దూల వృత్తాన్ని ఎన్నుకున్నాడు. ఇతర నదులను వర్ణిస్తున్నా ఆయన ధ్యాస తుంగభద్ర పైనే. అందుకే అందుకు అనుగుణమైన పాదప్రాసను ఎన్నుకున్నాడు. గంగాసంగమము, అంగీకార మొనర్చడము, రంగత్తుంగ తరంగ హస్తాల సముద్రుడు, అంగంబంటి సుఖించడము - తుంగభద్రానదిని స్ఫురింపజేసే శబ్దాలు ఇవన్నీ. 

All the sounds that rhyme with the spelling of Tungabhadra.


ఇవి గాక, కావేరి దేవేరి కావడము, తుంగభద్ర గుణభద్ర కావడమూ, ఈ ప్రాసా సౌందర్యాలన్నీ ఒలకబోసి, మీదికి లంఘించే శార్దూల పద్యంలో సముద్రుడు, కనీసం భావనా ప్రపంచంలో నైనా తుంగభద్రను తన ఉత్తుంగ తరంగ హస్తాలతో గాఢ పరిష్వంగంలో చేర్చుకొక పోతాడా అనే భ్రమను సృష్టిస్తాడు.


 ( మోహన్ గారి సుదీర్ఘవ్యాసంలో ఇది కొంతభాగం మాత్రమే!)


అక్టోబర్ 1971 - నివర్తి మోహన్ కుమార్


 


👏🌸🌷🌷💐💐🌷🌷🌷👏🌷🌷💐

కామెంట్‌లు లేవు: