23, జులై 2020, గురువారం

*కలికాలంలో లోకాన్ని తరింప జేసే కార్యక్రమాలు*

అనంతమైన ఈ కాల మానములో ఎన్నో మహా యుగాలు గడిచి పోయాయి. ఎందరెందరో బ్రహ్మలు గతించారు.
ఇప్పుడున్న బ్రహ్మకు *పద్మసంభవుడని* పేరు. ఇప్పటికీ ఆయన కాల మానములో 50 సంవత్సరాలు గడిచి 51 సంవత్సరము (బ్రహ్మ జీవిత కాలము మానవ కాల ప్రమాణంలో 29,30,40,00,00,00,000 సంవత్సరములు) లో,  శ్వేత వరాహ కల్పములో, ఆరు మన్వంతరాల తరువాత, ఏడవ దైన వైవస్వత మన్వంతరంలో 27 మహా యుగాలు గతించాయి. 28 వ మహా యుగములో సత్య, త్రేతా, ద్వాపర యుగాల అనంతరము, కలియుగము ఇప్పుడు నడుస్తున్నది.

సత్య యుగంలో *ధర్మం* నాలుగు పాదాల, త్రేతా యుగంలో మూడు పాదాల, ద్వాపరంలో రెండు పాదాల, చివరికి *కలి యుగంలో* భూమిపై *ధర్మం* ఒక్క పాదంతో నడయాడుతుంది.
ఈ విధంగా కాలం గడిచేకొద్దీ *అనుష్టాతులకు* స్వధర్మం పట్ల *శ్రద్దా భక్తులు* సన్నగిల్లుతుంటాయి.

ఈ కలియుగములో జరిగే చాలా అనుచిత కార్యక్రమాలలో కొన్ని....  *యజ్ఞాలు, హోమాలు మంత్రాది లోప భూయిష్టంగా చేయబడుతాయి* ఉదాహరణకు సాధారణంగా మనము చూస్తూనే ఉన్నాము. మన ఇంటికి వచ్చిన యాగ్నికులలో *కొంతమంది* పూజలను, హోమాలను *శ్రద్దా భక్తి సమన్విత* గా కాకుండా మధ్య మధ్య లో సెల్ ఫోన్లు వాడడము, *స్వాహా* అన్నప్పుడు యజ్ఞ కుండము వైపు దృష్టి లేకుండా యథాలాపంగా కార్యక్రమాలు కొనసాగించడము. *బ్రాహ్మణులు నిందిత కర్మలకు పాల్పడతారు*
కొంతమంది బ్రాహ్మణులు డబ్బు మీది వ్యామోహముతో అవినీతి పరులను,  ధర్మ హీనులనులను, అనైతికులను ఆశ్రయించడం. 
*సరస్వతిని విక్రయిస్తారు* విద్యను వ్యాపార రంగంగా మార్చడము మొదలగునవి.

 *లోకంలో ధర్మం నానాటికీ తగ్గి, అధర్మం బలపడుతుంది*.

నిద్రాణమైన జాతిని మెల్కొల్పి, చైతన్యాన్ని రంగరించిపోసి, జాగృతము చేయ వలసిన అవసరము మరియు ప్రజలను ఆధ్యాత్మిక చింతనతో నింప వలసిన అవసరము కూడా దిన దినము పెరుగుతూనే ఉన్నది.

ఈ శ్రావణ మాస (21-7-2020 మంగళ వారము నుండి 19-8-2020 బుధ వారము వరకు) సందర్భంగా కొన్ని మంచి ఆలోచనలు చేద్దాము. *మామూలు సమయాలలో శుభ కార్యాలు చేయవద్దని కాదు* ఈ శ్రావణ మాసాన్ని శుభారంగా స్వీకరిద్దాము.
 
*లోకాన్ని తరింపజేసే కొన్ని కార్యక్రమాలు*
నిత్య సంధ్యావందనములు (శ్రీ గాయత్రీ జపము), అర్చనలు, అభిషేకములు, మండల దీక్షలు, రుద్రాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు, సకాలములో హోమ క్రియలు...ఇంకా..
అధర్వ యజ్ఞము, గో జప మహా యజ్ఞము, పంచ యజ్ఞాలు...దైవ, పితృ, భూత, మనుష్య మరియు బ్రహ్మ యజ్ఞము, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలు, తులసి యజ్ఞాలు, పుష్కర బ్రహ్మ యజ్ఞాలు, గీతా యజ్ఞాలు. గణపతి హోమాలు, సుదర్శన హోమాలు, పుష్ప , శ్రీ, అతి రుద్ర యాగాలు, నవ చండి, శత చండి, శ్రీ మహా రుద్ర సహిత చండి, శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల, ప్రత్యంగిరా యాగాలు. ఆయుత శత చండి యాగము. శ్రీ రామ క్రతువులు, అష్టాక్షరీ మహా క్రతువులు, శ్రీ సీతారాముల కళ్యాణము, తులసి కళ్యాణము, సహస్ర నామ పారాయణములు, విష్ణు పురాణ, వేద, రామాయణ, భాగవత, మహా భారత, భగవద్ గీతా పారాయణాలు. లు, శుక్ర వారోత్సవములు, క్రమం తప్పని సత్యనారాయణ వ్రతాలు, మంగళ గౌరి వ్రతములు, వేదాంత సభలు..ఇంకా ఎన్నెన్నో.

*ఈలా చెప్పుకుంటూ పోతే అన్ని  పుణ్య, పవిత్ర  భక్తి కార్యక్రమములు కలిపి 500 ల పై చిలుకు మాటే*.

సాధారణ దైనందిన జీవితములో తప్పని సరిగా *ఇష్ట దైవాలను, గోవులను, సద్ బ్రాహ్మణులను, సిద్ధులను, ఆచార్యులను పూజించాలి*.
పై కార్యక్రమాలతో బాటు దీనజనొద్దరణ కూడా సజ్జనుల లక్షణము.

బుద్ధిమంతులు, క్షమావంతులు, వినయ శీలురు, ఆస్తికులు సర్వోత్తమ లోకాలు పొందురనుటలో సందేహము లేదు. *సద్గుణాలే మన వెంట వచ్చే సంపద*, కొండంత జ్ఞానము కన్న *కాసంత ఆచరణ మిన్న*.
నైతికత, సత్కార్యాలు, సత్కర్మలే దైవ పూజ.
*ఆధ్యాత్మికతను మించిన నిధి లేదు*.

అబ్బా! ఈ అధునాతన కాలములో *ఇవన్నీ ఎందుకు అనుకునే నీరస, నాస్తిక ప్రాణుల కంటే*  మించిన (అధిక సంఖ్యలో) *ప్రజలు పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు, మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలలో అధిక సంఖ్యలో అమిత శ్రద్దా, భక్తి ప్రపత్తులతో పాల్గొంటున్నారు*

*ఇటువంటి పవిత్ర కార్యాలే గదా ప్రశాంతతకు, సుఖ సంతోషాలకు ఆలవాలము*
చివరిగా.....
*గో పశు పక్షాది జన, రాష్ట్ర, జగత్ హితాయచ అహం సంకల్పం కరిష్యామి*
ధన్యవాదములు.

కామెంట్‌లు లేవు: