23, జులై 2020, గురువారం

భాగవతం శ్రవణం - వైశిష్ట్యం




*ఓం నమో భగవతే వాసుదేవాయ*

సందేహం;- నిత్యము భాగవతం శ్రవణం చెయ్యాలని పెద్దలు చెప్తున్నారు. దీని వైశిష్ట్యం ఏమిటో వివరిస్తారా?

సమాధానం;- శ్రీమద్భాగవతం వేద కల్పతరువు నుండి శుకుని చేయూతతో భూమిపై పడిన మధురాతి మధురమైన ఫలము. శ్రీరామాయణ, భారతములు వేదతుల్యములు. శ్రీభాగవతము ఆ వేద వృక్షము యొక్క శాఖాగ్రంలో పండినపండు. ఆ మధుర ఫల రస స్వరూపుడే శ్రీకృష్ణభగవానుడు. ఆ శ్రీకృష్ణుని వాజ్ఞ్మయ అవతారమే శ్రీభాగవతం. భగవదుపాసనమే భాగవతోపాసనం. ఇది భక్తి శాస్త్రము. 

భగవంతుని విషయములోను, భగవంతుని విభూతి విషయములోను ప్రసరించే ప్రేమే భక్తి. భగవంతుని విషయములోను, భగవంతుని విభూతి విషయంలోను ప్రసరించే ప్రేమే భక్తి. భగవానుని స్థూలరూపమే విశ్వం. అసాధారణ రూపం యశోదానందనుడు. ఆ నందనందనుణ్ణి ధ్యానించడమే జగత్కారణమును ధ్యానించడం. దానికి ప్రధానమైన సాధనం భాగవతాన్ని అభ్యసించడం. 

శ్రీకృష్ణుని అతిమానుష చేష్టితాలను విని, ఆ సుందర సుకుమార దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించినంతనే, మనసు ఇతర విషయాలపైకి పోకుండా నిశ్చలంగా ఉంటుంది.

స్వామి లీలలను శ్రవణం చెయ్యడంవల్ల మనకు భగవానునితో గల సంబంధం గోచరిస్తుంది. ఈ విధంగా భక్తి, జ్ఞాన, వైరాగ్యములను కలిగించి తరింపజేస్తుంది భాగవతం. 

ఈ విశ్వానికి భగవంతునితోగల నిత్య సంబంధమును మనం గుర్తించిననాడు, మనం విశ్వాన్ని ప్రేమించగలం. అందువల్ల పరస్పర ద్వేషములతో, భేద భావములతో, తాపత్రయములతో తపించే మానవజాతికి తాపాన్ని చల్లర్చి శాంతిని ప్రసాదించే దివ్యౌషధం భాగవతం. లోక క్షేమాన్ని, తన అభ్యుదయాన్ని, సమాజశ్రేయాన్ని  కోరుకునే ప్రతి ఒక్కరూ భాగవతాన్నినిత్యం శ్రవణం చెయ్యాలి.

*శుభంభూయాత్*

********************************

కామెంట్‌లు లేవు: