23, జులై 2020, గురువారం

విజ్ఞత

*ఎదుటవాళ్లను ఏమార్చవచ్చు, కానీ తనని తాను ఏమార్చుకోవడం ఏ మనిషికి సాధ్యం కాదు. తెలిసి తెలిసీ తనని తాను వంచించుకోవడం ఆత్మ వంచనే అవుతుంది. ఇది పరవంచన కన్నా హీనం. ఈ కారణంగానే విజ్ఞతతో మెలగడం అవసరమని పెద్దలు పదే పదే చెబుతుంటారు. ఇతరులకు సంబంధించిన విషయాల్లో మంచిచెడ్డల మీద తీర్పులు ఇస్తుంటారు. తనదగ్గరకి వచ్చేసరికి అన్నింటినీ మరచిపోతారు. తాను చేస్తున్న పని మంచిదా, చెడ్డదా అనే వివేచన ఉండదు. తన మాటలకి చేతలకీ పొంతన లేనితనం ఉందన్న సంగతిని గ్రహించరు. తను చెప్పిన సూత్రాలని తానే ఆచరించకపోవడం చాలామంది విషయంలో చూస్తూవుంటాము. తమవల్ల జరిగిన పొరబాటును కూడా ఒప్పుకోరు మరికొందరు. కానీ తమ తప్పుల్ని, ఒప్పుల్ని తమకు తాముగా తెలుసుకోవడం విజ్ఞుల ఉత్తమ లక్షణం. ఇతరులు చెప్పకుండానే తమ ప్రవర్తనని, వ్యవహర సరళిని తామే బేరీజు వేసుకోవాలి. ఇతరుల తప్పొప్పులని పరిశీలించి మీరు ఎలా నిర్దారణకి వస్తారో, మీ గురించి కూడా ఇతరులు అలాంటి నిర్దారణకు వస్తారని గ్రహించండి. అందుకని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం మీ విజ్ఞతకు నిదర్శనంగా నిలుస్తుంది. తద్వారా మీకు తెలియక జరిగిన పోరాబాట్లను సవరించుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా తన మాటలు, పనులు ఎల్లవేళలా సరైనవేనని వాదించడం సముచితం కాదు. ఇతరులని నొప్పించకుండా వ్యవరించడం మనిషి విజ్ఞతను తెలియ చేస్తుంది. మీ వల్ల జరిగిన పోరబాటుకు క్షమాపణలు కోరడం వల్ల మీ గౌరవం ఇనుమడిస్తుంది. కుటుంబంలో కానీ, సామాజిక జీవితంలో కానీ విజ్ఞతతో వ్యవహరించడం ద్వారా పదుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు.*

కామెంట్‌లు లేవు: