23, జులై 2020, గురువారం

మొసలి గజేంద్రుని పట్టుకొనుట

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - రెండవ అధ్యాయము



ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

2.1 (ప్రథమ శ్లోకము)

ఆసీద్గిరివరో రాజంస్త్రికూట ఇతి విశ్రుతః|

క్షీరోదేనావృతః శ్రీమాన్ యోజనాయుతముచ్ఛ్రితః॥6359॥

శ్రీశుకుడు నుడివెను-పరీక్షిన్మహారాజా! పాలసముద్రము మధ్య త్రికూటము అను పేరుగల ఒక మహాపర్వతము గలదు. అది మిగుల ప్రసిద్ధి గాంచినది. అది పదివేలయోజనముల ఎత్తుగలిగినది.

2.2 (రెండవ శ్లోకము)

తావతా విస్తృతః పర్యక్ త్రిభిః శృంగైః పయోనిధిమ్|

దిశః ఖం రోచయన్నాస్తే రౌప్యాయసహిరణ్మయైః॥6360॥

దాని పొడవు వెడల్పులు గూడ నాలుగువైపుల అంతే వైశాల్యము గలదు. అది బంగారము, వెండి, ఇనుములతో నిర్మితములైన మూడు శిఖరములతో విలసిల్లుచుండును. వాటి కాంతులు సముద్రమును, ఆకాశమును, దిక్కులను ప్రకాశింపజేయు చుండెను.

2.3 (మూడవ శ్లోకము)

అన్యైశ్చ కకుభః సర్వా రత్నధాతువిచిత్రితైః|

నానాద్రుమలతాగుల్మైర్నిర్ఘోషైర్నిర్ఝరాంభసామ్॥6361॥

దాని ఇతర శిఖరములు విచిత్రములైన రత్నములతో ధాతవులతో ఒప్ఫుచు, అన్ని దిక్కులయందు తమ ప్రకాశమును వెదజల్లు చుండెను. ఆ శిఖరములపై వివిధ జాతుల వృక్షములు, లతలు, పొదలు నిండియుండెను. వాటిపైగల సెలయేళ్ళు గలగల ధ్వనులను చేయుచుండెను.

2.4 (నాలుగవ శ్లోకము)

స చావనిజ్యమానాంఘ్రిః సమంతాత్పయఊర్మిభిః|

కరోతి శ్యామలాం భూమిం హరిణ్మరకతాశ్మభిః॥6362॥

ఆ పర్వతము చుట్టునుగల సముద్రపుటలలు, దాని పాదములను ప్రక్షాళనము చేయుచున్నట్లు ఉండెను. చక్కని మరకతములతో కాంతులీనుచున్న ఆ పర్వత శిలలు ఆ భూమిని శ్యామల వర్ణముతో నింపుచుండెను.

2.5 (ఐదవ శ్లోకము)

సిద్ధచారణగంధర్వవిద్యాధరమహోరగైః|

కిన్నరైరప్సరోభిశ్చ క్రీడద్భిర్జుష్టకందరః॥6363॥

ఆ పర్వతగుహలయందు సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, కిన్నరులు, అప్సరసలు మున్నగువారు విహారము చేయుచుండిరి

2.6 (ఆరవ శ్లోకము)

యత్ర సంగీతసన్నాదైర్నదద్గుహమమర్షయా|

అభిగర్జంతి హరయః శ్లాఘినః పరశంకయా॥636॥॥

అచటి సంగీత ధ్వనులు గుహలయందు ప్రతిధ్వనించు చుండెను. ఆ ధ్వనులను విన్న సింహములు వేరే సింహములు గర్జించుచున్నవని భావించి, తామును బిగ్గరగా గర్జించుచుండెను.

2.7 (ఏడవ శ్లోకము)

నానారణ్యపశువ్రాతసంకులద్రోణ్యలంకృతః|

చిత్రద్రుమసురోద్యానకలకంఠవిహంగమః॥6365॥

ఆ పర్వతముల లోయలు పలువిధములైన వన్యమృగముల సమూహములచే శోభిల్లుచుండెను. వివిధములగు వృక్షములతో నిండి అవి దేవతల ఉద్యానవనములను తలపింప జేయుచుండెను. అందమైన పక్షులు మధురముగా కలకల ధ్వనులను గావించుచుండెను.

2.8 (ఎనిమిదవ శ్లోకము)

సరిత్సరోభిరచ్ఛోదైః పులినైర్మణివాలుకైః|

దేవస్త్రీమజ్జనామోదసౌరభాంబ్వనిలైర్యుతః॥6366॥

ఆ పర్వతముపై పెక్కునదులు, సరోవరములు కలవు. అందలి జలములు స్వచ్ఛముగా ఉండెను. వాటి తీరములయందలి ఇసుక తిన్నెలు మణులవలె అలరారుచుండెను. ఆ సరోవరములయందు దేవతా స్త్రీలు స్నానములను ఆచరించుచుండుటచే అందలి జలములు పరిమళభరితములై యుండెను. వాటి మీదుగ వీచు వాయువులు ఆ సుగంధమును నలుదిశలయందును వ్యాపింపజేయుచుండెను.

2.9 (తొమ్మిదవ శ్లోకము)

తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః|

ఉద్యానమృతుమన్నామ ఆక్రీడం సురయోషితామ్॥6367॥

ఆ త్రికూట పర్వతము యొక్క లోయయందు మహాత్ముడైన వరుణ దేవుని ఉద్యానవనము గలదు. దాని పేరు ఋతుమంతము. దానియందు దేవాంగనలు విహరించుచుందురు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

కామెంట్‌లు లేవు: