31, ఆగస్టు 2020, సోమవారం

తెలంగాణ వచ్చాకే తెలుగు వెలుగుకు హోదా

#classical_language_status_telugu
#Telangana
తెలంగాణ వచ్చాకే తెలుగు వెలుగుకు హోదా!

2006లో కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చింది. కానీ, తమిళనాడుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ గాంధీ ప్రజాప్రయోజన వ్యాజ్యంతో దీన్ని అడ్డుకున్నారు. అయితే, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో తన వాదన వినిపిస్తూ అఫిడవిట్ సమర్పించింది. కానీ, అటు తర్వాత ఈ విషయంలో స్తబ్దత ఏర్పడగా దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఛేదించి ప్రాచీన హోదాకు మార్గాన్ని సుగమం చేయగలిగింది.
కాగా, ప్రాచీన హోదాకు కావాల్సిన అర్హతలను కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఇలా నిర్దేశించింది.

1. ప్రాచీన హోదా పొందాలంటే ఆ భాషకు వెయ్యేళ్లకు పైగా సాహిత్య చరిత్ర ఉండాలి. 2. ఆ భాషకు 15 వందల ఏళ్ల భాషా చరిత్రా ఉండాలి. 3. అది ఎక్కడినుంచి కూడా అరువు తెచ్చుకున్న భాష కాకుండా స్వతంత్రమైంది కావాలి
ఈ మూడు విషయాల్లో ఆంధ్రప్రదేశ్ వాదనకై శ్రీమదాంధ్ర మహాభారతాన్ని తెనుగించిన నన్నయ్యను ఆధారం చేసుకోవడం వల్ల, ఆయన పదకొండో శతాబ్దానికి చెందిన వారైనందున భాషా సాహిత్య చరిత్ర తొమ్మిది వందల ఏళ్లకే పరిమితమై మన వాదన వీగిపోయింది.

రెండవది, తొలి కావ్యంగా వాదించిన నన్నయ్య కావ్యం కూడా స్వతంత్ర రచన కాకపోవడం, అది సంస్కృతంలో వ్యాస భారతానికి అనువాదమే కావడం వల్ల స్వతంత్ర రచన కాదని! మూడో పాయింట్ ప్రకారం అరువు తెచ్చుకున్న భాషనుంచి ప్రాచీన హోదా సాధ్యం కాదని! దీంతో ఆనాటి వాదన వీగిపోయింది.

అప్పటి నుంచి నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో మరే ప్రయత్నమూ చేయలేదు. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందో మనం మేలుకున్నాం. మనదైన వాదనని తెలంగాణ మూలాలనుంచి దేవులాడి ముందుకు పెట్టి ఇప్పటి దాకా స్వయంగా అడ్డుపడ్డ అడ్వొకేట్ గాంధీనే కాదు, మహా మహా ఉద్ధండులను సైతం మేలుకునేలా చేశాం. పక్కా వాదనతో మనం ముందుకు రావడంతో కోర్టు సైతం అంగీకరించే పరిస్థితి రావడం, చివరాఖరికి మన భాషకు ప్రాచీన హోదాకు మార్గాన్ని సుగమం చేసుకోగలగడం తెలంగాణ సాధించిన మరొక అపూర్వ విజయంగానే చెప్పుకోవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 2015 ఏప్రిల్‌లో మన ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి సూచనతో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చెన్నైకి చెందిన రవీంద్రనాథ్ అనే అడ్వొకేట్ ద్వారా కౌంటర్ అఫిడవిట్ నమోదు చేశారు. మాజీ అడ్వొకేట్ సాలిసిటర్ జనరల్ అయిన వి.టి.గోపాలన్‌ను మన తరఫున కోర్టులో వాదనల్ని వినిపించుకునేందుకు నియమించుకున్నాం.
ఇలా- మన ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ చేసిన కసరత్తుతో మొత్తానికి మద్రాస్ హైకోర్టు తుది వాదనల్ని ఈ సంవత్సరం జూలై 13న వింది. కాగా, ఈ ప్రయత్నంలో మనతో పాటు ఉన్నది చెన్నై తెలుగు ప్రకాశం సంపాదకులు తూమాటి సంజీవరావు. వారు కూడా తెలుగుకు ప్రాచీన హోదాను సమర్థిస్తూ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఐతే, ఈ తుది వాదనలు కూలంకశంగా, ప్రాచీన హోదా మనకు లభించేలా చేయడానికి మనం పెట్టిన వాదన ఏమిటంటే, తొమ్మిదవ శతాబ్దానికి చెందిన మన ఆదికవి పంపనని ప్రస్తావించడం. అలాగే, పురావస్తు శాఖా తవ్వకాల్లో బైటపడ్డ మన కోటిలింగాల, ధూళికట్ట ఆనవాళ్లను ఆధారం చేసుకుని క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచే మన భాషకు చరిత్ర ఉందని వాదించగలగడం.

క్రీ.శ. 931 ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన పంపన ఆది పురాణం, విక్రమార్జున విజయం రచించారు. దీన్నిబట్టి మన భాషా సాహిత్యానికి 1,070 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉన్నట్టే. అలాగే, పురావస్తు శాఖ తవ్వకాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన కోటిలింగాలలో లభించిన ఆధారాలను బట్టి అవి క్రీస్తుపూర్వం రెండు, మూడు శతాబ్దాలకు చెందినవని, అంతేకాక, పెద్దపల్లి సమీపంలోని ధూళికట్టలో కనుగొన్న బుద్ధుడి స్తూపం క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దానికి చెందిందని, వీటిని బట్టి మన భాషా చరిత్రకు పదిహేను వందల ఏళ్లకు పైగానే చరిత్ర ఉందని గట్టి ఆధారాలు చూపగలిగాం. ఇక పంపన తెలుగులోనే రచనలు చేయడం వల్ల అరువు తెచ్చుకున్న భాష మనది కానే కాదనీ చెప్పగలిగాం.
ఈ వాదనలు విన్న హైకోర్టు బెంచ్‌లోని చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ మాహదేవన్‌లు ఆగస్టు 8న తీర్పు చెబుతూ, కేంద్ర ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా సంస్కృతం, తమిళ భాషలకు ఎలాగైతే ప్రాచీన హోదా దక్కిందో తెలుగుకు కూడా ప్రాచీన హోదా దక్కనున్నట్టు, అందుకు ఇక ఎటువంటి అడ్డంకీ లేదని తేల్చి చెప్పింది.

బెంచ్ ఇప్పటిదాకా ఉన్న రిట్ పిటిషన్లను కొట్టి వేయడమే గాక ఆలివర్ వెండిల్ హోమ్స్‌ను కోట్ చేస్తూ, ప్రతి భాషా ఒక దేవాలయం. అందునా ఆ భాష మాట్లాడే వారి ఆత్మ గర్భగుడిలా కొలువబడుతుంది అని చెప్పడం విశేషం.
నిజమే. ఇక ముందు మన భాషను, మన సాహిత్యాన్ని, మన చరిత్రను సగర్వంగా కొలుచుకుందాం. తెలంగాణ పునర్నిర్మాణంలో మన అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకుందాం. విస్మృతిలో ఉన్న మన సాహిత్యకారులను, వారి రచనలను ప్రాచుర్యంలోకి తెస్తూ తేనెలొలికే తెలుగు భాషను వెలుగులోకి తెద్దాం.

కామెంట్‌లు లేవు: