31, ఆగస్టు 2020, సోమవారం

విశ్వనాధల* *కవితాదృక్పధము!🌷

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
 🌷 *శ్రీ శ్రీ - విశ్వనాధల* 
   *కవితాదృక్పధము!🌷*
            🌷🌷🌷
ఇది, శ్రీ రమణ (మిధునం)గారి యనుభవం!
             
 శ్రీరమణ పాత్రికేయునిగా విజయవాడలో నున్నప్పుడు జరిగినది. రమణగారు విశ్వనాధగారి సన్మానమును
చీరాలలో నేర్పాటుచేసి, వారినితోడ్కొనిరావటానికి తామేపూనుకొన్నారు. టాక్సీలో ప్రయాణం 4గంటల వ్యవధి, గమ్యంచేరటానికి. మధ్యమధ్య నస్యం ముక్కుల్లో ధట్టిస్తూ విశ్వనాధ రమణతో యేవేవో ముచ్చట్లు చెపుతున్నారు. వారికినచ్చని విషయమేదైనా అడిగితే అమ్మో! వారికికోపం వస్తుందేమో? విషయం అసలుకే చెడుతుంది. అందుకే రమణగారు కంఠదఘ్నంగా ఉన్న తమ కోరికను బయటకు చెప్పలేక పోతున్నారు. అలాగని అడగటం మానాలనీలేదు. ప్రయాణమాపూర్తికావచ్చింది.కోరికా మిగిలిపోయింది.
ఇంతలో రైలుగేటు పడింది విశ్వనాధ కొంచెంతీరుబడిగా కన్పించారు. మెల్లగా శ్రీరమణ విషయం కదిపారట! బాబాయిగారూ! నాదో చిన్నకోరిక, "ఆఁ ఏవిటో అడుగవయ్యా!" -అన్నవెంటనే" శ్రీ శ్రీ-కవితాదృక్పధానికీ,
మీ కవితా దృక్పధానికి మధ్యతేడా ఏమిటో కకొంచెం సెలవీయండి", అనియడిగారట!
దానికాయన కోపందెచ్చుకోక, నశ్యం ఒకపట్టు గట్టిగాపీల్చి ముక్కులుతుడుచుకుంటూ"అబ్బో! ఆవిషయం చెప్పాలంటే చాలా ఉందయ్యా! చెపుతానులే, విను.

ఉదాహరణకు భాగవతంలో సముద్రమధన ఘట్టం ఉన్నది గదా. అగో దానినిద్దరం వింటున్నామే అనుకో, దానిని చదువుతున్నప్పుడు అక్కడ ఆదృశ్యాన్ని మేము చూసే తీరుల్లో తేడా చాలా ఉంటుందయ్యా, నేనయితే ఆదృశ్యాన్ని పోతన చిత్రించిన తీరునుజూచి అబ్బురపాటుతో ఆనందాన్ని పొందుతాను.
"ఆ ఘట్టంలోని అద్భుత రసపోషణను, అలంకార ప్రయోగచాతుర్యాన్ని, మెచ్చుకుంటాను". ఎందుచేత, నాదంతా ప్రాబంధికదృష్టి, అంటే సౌందర్యదృష్టి!"-

 "ఇదే శ్రీశ్రీయైతే, ఆమంధర పర్వతంక్రింద నలిగిపోతున్న నత్తలుా, కప్పలూ, మొదలైన జలచరాలమృత్యుఘోషను,వాటిబాధలను, అవిచేస్తున్న ఆక్రందనలనూ,
దేవదానవులు చేస్తున్న ప్రాణిహననమునూ, నిరసించేదృష్టితో చూస్తాడు. చూడటమేగాదు, ఆఅల్పప్రాణులయెడ తనకుగలసానుభూతిని కవితావిష్కారంచేయటానికి ప్రయత్నిస్తాడుకూడా.
     
నాది సౌందర్య శిల్పకళాదృష్టి!

అతనిది జీవ కారుణ్యదృష్టి !
 
ఇదీ మాకవితాదృక్పథము మధ్యగల భేదము"-
 
విశ్వనాధగారి వివరణపూర్తియైనది. టాక్సీ గమ్యమును చేరినది.
       🌷 స్వస్తి!🌷

కామెంట్‌లు లేవు: