31, ఆగస్టు 2020, సోమవారం

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*657వ నామ మంత్రము* 31.8.2020

*ఓం యుగంధరాయై నమః*

కలియుగాది యుగములను ధరించు కాలస్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.

విశ్వమందు జంటలు జంటలుగా సయోధ్యతోను, పరస్పర వైరుధ్యంతోనూ ఉండే ఎన్నిటికో సమన్వయ స్వరూపిణియై విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యుగంధరా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం యుగంధరాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని అత్యంతభక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకునికి అంతులేని ఆత్మానందానుభూతి ప్రాప్తించును. నిత్యమైన, సత్యమైన ఆనందమును అనుభవించును. జగన్మాత సకలలోకాలను తనలో ఇముడ్చుకొని, జీవులను తన బిడ్డలవలె భావించి వారిని సర్వాభీష్టసిద్ధులను జేయును. జగన్మాత కాలస్వరూపిణి. నాలుగు యుగములను కలిపితే ఏర్పడే మహాయుగములను ధరించును.

యుగం అనే పదమునకు జంట అనే అర్థము గలదు. స్థూలం-సూక్ష్మం,దేహము-ఆత్మ, సుఖము-దుఃఖము, ఆనందం-విషాదం, వెలుగు-చీకటి, పగలు-రాత్రి, జడము-చైతన్యము ఇటువంటి జంటలతో ఏర్పడినదే సృష్టి. అమ్మవారు సృష్టి స్వరూపిణి గనుక ఈ జంటలను తనయందు ధరించి *యుగంధరా* అని నామము పొందినది.

జగన్మాత సమన్వయ స్వరూపిణి. యుగాలను తనయందు ఇముడ్చుకున్న కాలస్వరూపిణి. శివా-శివ సమన్వయ స్వరూపిణి.

జగన్మాతకు నమస్కరించునపుడు
*ఓం యుగంధరాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*80వ నామ మంత్రము*

*ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః*

దైత్యులను ఉద్భవింపజేసే భండాసురుని సర్వాసురాస్త్రం నుండి వెడలి వచ్చిన హిరణ్యకశిప, రావణాది దైత్యులను తుదముట్టించడానికి తన చేతి పది వ్రేళ్ళ నఖములనుండి నారాయణుని దశావతారములుద్భవింపజేసిన అఖిలాండేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే అన్నవస్త్రములకు లోటులేక, ఆధ్యాత్మికచింతన యందు నిమగ్నుడై చతుర్విధ పురుషార్థములను సాధించి తరించును.

భండాసురుని దైత్యులను ఉద్భవింపజేసే *సర్వాసురాస్త్రం* ప్రయోగించగా హిరణ్యకశిఫ, రావణాది దైత్యులు ఆవిర్భవించి యుద్ధం చేయ నారంభించారు. అందుకు ప్రతిగా జగజ్జనని నారాయణుని దశావతారములు జనియింపజేసి ఆ రాక్షసుల సంహారం కావింపజేసింది..

*దశ* అంటే *అవస్థ* అని *కృతి* అంటే *కృత్యం* అనీ అర్థాలు చెప్పుకుంటే ఈ నామ మంత్రమునకు మరియొక అర్థము గలదు. దేవుడైన నారాయణుని అంశలే జీవులు. కాబట్టి అటు దేవుని పరంగా నారాయణునికి పంచకృత్యాలుంటాయి. వాటిని *సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహా* లంటారు. ఇక జీవుని పరంగా పంచ అవస్థలుంటాయి. వాటిని *జాగ్రత్, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణాలు* అంటారు.కాబట్టి నారాయణుని దైవలక్షణంగా ఐదుకృత్యాలు, జీవి లక్షణంగా ఐదు అవస్థలు ఉంటాయి. ఈ పదీ అమ్మవారి చేతి వ్రేళ్ళ పదిగోళ్ళనుండి రూపుదాల్చినట్లుగా భావించవచ్చును.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు: