14, అక్టోబర్ 2020, బుధవారం

మహాభారతము ' ...50.

 మహాభారతము ' ...50. 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


సభా పర్వం..


తనవలన వంశక్షయం అవుతుందని వ్యాసులవారు చెప్పిన భవిష్యవాణి విని, మనసు వ్యాకులపడగా,ధర్మరాజు, తనతమ్ములు నలుగురనూ పిలిచి, తనకు జీవించివుండే అర్హతలేదనీ,మరణిస్తానని చెప్పాడు. అర్జునుడు ఆయనను వారించి, ' కానున్నది కాకమానదు. మనకు భవిష్యత్తు తెలిసినందువలన, చేతనైన జాగ్రత్తలు తీసుకుని, అరిష్ట నివారణకు ఉపాయాలు చూడాలి. అదే కదా విజ్ఞుల లక్షణమని ' హితవచనాలు చెప్పాడు.  


ఆమాటలకు స్వాంతనపడి ధర్మరాజు, ' నేను యికనుండీ మీతోగానీ, మిగిలిన రాజులతో గానీ కఠినంగా మాట్లాడను. బంధుమిత్రులకు,దాయాదులకు సంతోషం కలిగే పనులే చేస్తాను. నేను కష్టపడే పని అయినా యితరులకోసం యిష్టంగా చేస్తాను. అందరినీ సమభావంతో చూస్తాను. ఏ వివాదానికి నేను కారణం కాకుండా చూసుకుంటాను. ఇదేనా ప్రతిజ్ఞ. ' అని సోదరులతో అన్నాడు. అందరూ మన:శాంతితో అక్కడినుండి నిష్క్రమించారు.


ఈ అతిమంచితనం యెక్కడికి దారితీస్తుందో కాలమే చెప్పాలి.  


ఇక మయసభలో దుర్యోధనుడు కలయ తిరుగుతూ, అసూయతో రగిలిపోతున్నాడు. అంతటి గొప్ప కట్టడం యాచకులుగా జీవించిన పాండవులకు దక్కడం అతను భరింప లేకపోతున్నాడు. ఒకచోట నీలి కాంతులతో కూడుకున్న స్పటికమణుల నేలనుచూసి, నీటిమడుగు అనుకుని వస్త్రములు పైకెత్తి పట్టుకుని నడిచి, భంగపడ్డాడు. ఇది జరుగగానే మత్సరం యింకాపెరిగి, మనసు కుతకుత లాడింది దుర్యోధనునకు. ఇంకొద్ది దూరంలో. పద్మాలతో కూడిన మణులు వున్న సరోవరం చూసి, వెనుకటి అనుభవం గుర్తుకు తెచ్చుకుని, అది నేల అని నిశ్చయంగా అనుకుని, కాలు క్రిందపెట్టగానే, నీటిలో దిగి తడిసిపోయాడు. అసౌకర్యానికి గురి అయి యిబ్బందిపడ్డాడు. అంతటితో పోకుండా, ఆసన్నివేశం దాయాదులైన భీమార్జున నకులసహదేవులు చూసి, అప్రయత్నంగా నవ్వారు. దీనివలన, తన అసూయాద్వేషాలు మిక్కుటమయ్యే పరిస్థితి దాపురించింది.  


ఒకచోట, గదిద్వారం మూసి వుండగా, అద్దం ప్రభావం వలన, గుమ్మం తెరచి వున్నదని, లోనికి వెళ్లబోగా, ముఖానికి బొప్పికట్టింది. ఈ అనుభవంతో, వేరొక గదిద్వారం తీసి వున్నను, మూసివున్నదని, ముందు జాగ్రత్తగా, తలుపు తీయ ప్రయత్నించి, అక్కడ ద్వారం లేదని తెలుసుకుని క్రుద్ధుడైనాడు.  


ఇవి అన్నీ అతి చిన్నవిషయాలు. కానీ, తన భంగపాటు అవమానంగా తీసుకోకుండా, హాస్యంగా తీసుకుంటే, అతను దురభిమానధనుడు ఎందుకవుతాడు ?  


అయితే, దుర్యోధనుడు యీ విషయాలను చాలా పెద్దవిగా, భూతద్దంలో చూసినట్లు చూసి, తనకు చిన్నప్పటినుండి పాండవులపై వున్న మత్సరాన్ని, పెంచుకునే విధంగా తయారుచేసుకున్నాడు. హస్తినకు తిరిగివచ్చిన తరువాత, మేనమామ శకునితో ' మామా ! నేను మరణిస్తాను. నా పరివారంలో పాండవులంతటి సమర్థులు లేరు. వారి గొప్పదనం పొగుడుతూ జీవించే హృదయం నాకులేదు. నా మరణానికి అడ్డు చెప్పవద్దు. ' అని బేలగా అన్నాడు.


అయితే, శకుని దుర్యోధనునకు అనేకవిధాల నచ్చజెప్ప ప్రయత్నించాడు.' దుర్యోధనా ! పాండవులు సంపదలు ప్రోగు చేసుకున్నారు. అనుభవిస్తున్నారు. నీవు అట్టి ప్రయత్నం యేమీ చెయ్యలేదు. వారు గొప్పవారవుతారని నీవు ముందే వూహించి, వారిని చంపాలని అనేక విధాలా ప్రయత్నించవు. భంగపడ్డావు. నీ ప్రయత్నలోపం లేదుకదా ! '


' ఇక మయసభ అంటావా ! ఖాండవ దహనం చేసి, అనుకోకుండా మయుని రక్షించి యీ మయసభ స్వంతం చేసుకున్నారు. దీనికి నీవు చింతించవలసిన పని యేమున్నది. ఒకవేళ అగ్నిదేవుడు, కృష్ణార్జునులను కాకుండా, దుర్యోధనుని, కర్ణుని ఖాండవ దహనానికి సహాయం చెయ్యమంటే, యేమో మయుడు నీకే నిర్మించి యిచ్చేవాడేమో ఆ మయసభ. ఇందులో నీవు బాధ పడవలసినది నాకేమీ కనబడడం లేదు. '


' మనపైకి రానంతవరకు, కృష్ణార్జునులు యెన్ని విజయాలు సాధించినా, మనకు పొయ్యేదేమీ లేదు. మనమీదకు రాకుండా యేమి చేయవలెనో అది ఆలోచించడం వుత్తమం. నీకెవరూలేరనే నిస్సహాయస్థితిలో నీవు వుండడం ఓటమిని వొప్పుకోవడమే. నీకు నూర్గురు సోదరులు వున్నారు, కంటిసైగతో కార్యాలు చక్కబెట్టేవారు. వారికి అందరు సోదరులు లేరే ! మేమందరమూ, ద్రోణుడు, కర్ణుడు, అశ్వద్ధామ నిన్ను అంటిపెట్టుకునే వున్నాము. '


అని తన తర్క వితర్కాలతో, కుటిలనీతితో దుర్యోధనుని, చనిపోయే ఆలోచన నుంచి మరల్చాడు. దుర్యోధనుడు కూడా అవమానభారం మర్చిపోయి, వెంటనే, ' మామా ! నువ్వు అనుమతిస్తే, యిప్పుడే పాండవుల మీద యుద్ధం ప్రకటించి, వారిసంపదను కొల్లగొడతాను. ' అన్నాడు.  


దానికి శకుని, ' దుర్యోధనా ! మనశక్తి యిప్పుడు పాండవులమీద పనిచేయదు. వారు విజయాల మీద విజయాలతో గొప్ప ఆత్మస్థైర్యంతో వున్నారు. శక్తి కుదరనప్పుడు, యుక్తి ప్రయోగించాలి. ధర్మరాజు జూదప్రియుడు. ఆడాలనే కుతూహలమే కానీ, ఆటలో మెళుకువలు తెలియవు ధర్మరాజుకు. అతడు జూదంలో గెలువలేడు. జూదగాడి సహజ లక్షణమైన, మొండి తనం వుంటుంది, అతనికి. ఓడినకొద్దీ, యింకా ఆడతాడు. సర్వం పోగొట్టుకుంటాడు. అదే మనకు విజయసోపానం. జూదంలో నన్ను ఓడించలేడు. ' అని విజయం కళ్ళకు కట్టినట్లు చెప్పాడు.  


ఈమాటలు చెబుతూ, తండ్రి అనుమతి తీసుకుని వారిని జూదానికి పిలవమని చెప్పాడు శకుని, దుర్యోధనునితో. దుర్యోధనుడు తాను తండ్రిని ఒప్పించలేనని, ఆకార్యభారం కూడా, శకునిమీదనే పెట్టాడు. కాదనలేక, యెలాగైనా పాండవ పతనం, మేనల్లుడి విజయం కాంక్షించి, ఆ భారం కూడా నెత్తిన వేసుకుని శకుని, ధృతరాష్ట్రుని వద్దకు, దుర్యోధనునితో సహా వెళ్ళాడు.   


స్వ స్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం .👏👏


తీర్థాల రవి శర్మ 

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం. హిందూపురం.

9989692844

కామెంట్‌లు లేవు: