14, అక్టోబర్ 2020, బుధవారం

జ్ఞానం- వివేకం*

 *జ్ఞానం- వివేకం*


సహజసిద్ధమైన మేధతో కొన్ని విషయాల్లోనో, అనేక అంశాల్లోనో గట్టి పట్టు సాధించడం జ్ఞానం. విద్య, తల్లిదండ్రులు, గురువులు, లోకపరిశీలన వల్ల జ్ఞానం సమకూరుతుంది. శాస్త్రాలను క్షుణ్నంగా, లోతుగా విస్తృతంగా చదివి ఆకళింపు చేసుకున్నప్పుడే ఏ అంశమైనా కరతలామలకం అవుతుంది. ఈ జ్ఞానధారను ఎంత నిష్పత్తిలో, ఎప్పుడు, ఎక్కడ జీవితంలో ప్రవహింపజేయాలో ఎరుక కలిగి విచక్షణతో మసలుకోవడమే వివేకం. వివేకం లేని జ్ఞానం వృథా.

తెలివితేటలు పుట్టుకతో వస్తాయి. వివేకం అలవరచుకోవాలి. వివేకం పుస్తకాల్లో లభ్యం కాదు. 


నలుగురు విద్యార్థులు విద్యాభ్యాసం ముగించుకుని గురుకులాన్ని వీడారు. వారికి మార్గమధ్యంలో ఓ పులి కళేబరం కనిపించింది. మృతి చెందిన వాటికి ప్రాణం పోయగల విద్య వారికి తెలుసు. ప్రాణం పోసి దాని చేతిలో ముగ్గురు తమ ప్రాణాలు కోల్పోయారు. ఒకడు మాత్రం వివేకంతో వ్యవహరించి తనను తాను రక్షించుకోగలిగాడు. జ్ఞానాన్ని ప్రదర్శించడంలో యుక్తా యుక్త విచక్షణ చూపాలి. అదే వివేకంతో ప్రవర్తించడమంటే!


మహాభారతంలోని విదురుడు వివేకజ్ఞుడు. ధర్మసూక్ష్మాంశాలను అర్థం చేసుకున్నవాడు. అంతటి కురుసభలో భీష్మ, ద్రోణ, కృపాదులున్నా- అక్కడివారు మాట్లాడిన మాటల అంతరార్థాన్ని వివేకమనే నేత్రంతో చూసి విడమరచి చెప్పగల నేర్పరి. భీష్ముడంతటివాడే విదురుడి వివేకంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. పాండవులందర్నీ లక్క ఇంటిలో తుదముట్టించాలన్న దుర్యోధనుడి దుర్మార్గం నుంచి వారిని రక్షించి, తరవాతి కాలంలో వారికి ప్రాప్తించిన అరణ్యవాసం లోను, అజ్ఞాత వాసంలోను పాండవులను నడిపించింది విదురుడి వివేకనేత్రమే. ఇంతటి మహత్తర నయనాన్ని ధృతరాష్ట్రుడు తన పుత్రప్రేమ చేత చూడలేకపోయాడు. దాని ఫలితమే కురురాజ్యపతనం, వంశనాశనం.


వివేకవంతుడికి మంచి పట్ల, ధర్మం పట్ల అనురక్తి ఉండాలి. ప్రేమ, కరుణ, ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోగల మనసు కావాలి. న్యాయ కోసం పోరాడే ధైర్యం ఉండాలి. తనకెంతటి జ్ఞానమున్నా మిడిసిపడక, వినయంతో మెలగాలి. తాను చదివిన శాస్త్రాల సారాంశాన్ని త్రుటిలో స్ఫురణకు తెచ్చుకొని సందర్భానుసారంగా అన్వయించుకోగల శక్తి ఉండాలి. మంచి చెడులను నిశితంగా పరిశీలించి విశ్లేషించగలిగే నేర్పు, ఒడుపు ఉండాలి. ఈ లక్షణాల సమ్మేళనమే వివేకం.


‘జ్ఞానోదయాన్ని ఏడురోజుల్లో పొందవచ్చు’ అన్నాడు బుద్ధుడు ఒకసారి తన శిష్యులతో. వారిలో ఒకడు దానికేమి చేయాలని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ‘ఏకాగ్రత’ అని సమాధానమిచ్చాడు. ఆ శిష్యుడు సాధన ప్రారంభించాడు. కాని, ఆ సాధన విచ్ఛిన్నమవుతూ, పెడదార్లు పట్టసాగింది. అనవసర విషయాల పట్ల ఆలోచనలు మళ్ళసాగాయి. సమయం వృథాచేయక, సక్రమంగా సరిగ్గా ఉపయోగిస్తున్నాననుకుంటూ ముందుకు సాగాడు. ఏడు రోజుల్లో జ్ఞానోదయం కలగాలన్న ఆలోచనే మరచిపోయాడు. తాను వెళుతున్న మార్గం అతడికి అనేక విషయాలను బోధించసాగింది.


ఏకాగ్రత ఉన్నవ్యక్తి జ్ఞానిగా మారడానికి ఎక్కువ సమయం పట్టదన్నది బుద్ధుడి మాటల సారాంశం. వాటిలోని లోతును చూడటానికి శిష్యుడికి వివేకం చాలలేదు. బుద్ధుడి వివేకపూరితమైన మాటలు అర్థం కావడానికి అంత సమయం పట్టింది. శిష్యులకు జ్ఞానానికి వివేకం తోడు తప్పనిసరి. అప్పుడే అది రాణిస్తుంది!

(ఈనాడు అంతర్యామి)

✍🏻బొడ్డపాటి చంద్రశేఖర్‌

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9985831828*

కామెంట్‌లు లేవు: