14, అక్టోబర్ 2020, బుధవారం

3.3 వర్ణ ఎంపిక

 **అద్వైత వేదాంత పరిచయం**


3.3 వర్ణ ఎంపిక :


  మన వర్ణాన్ని మనం ఎన్నుకునే అధికారం ఉందా? దానికి జవాబు ముందు ఏ వర్ణం అని ప్రశ్న.

3.3.1 జాతివర్ణం :` జాతిపరంగా చూస్తే మనకి పుట్టుక విషయంలో మన ప్రమేయం లేదు. తల్లిదండ్రులను మార్చుకోలేము. దాని గురించి బెంగపడటం కూడా అనవసరం. ఎందుకంటే జాతిపరంగా అందరూ సమానమే.

3.3.2 గుణ వర్ణం :` గుణపరంగా చూస్తే మనకి అధమ స్థాయి నుంచి ఉత్తమ స్థాయికి ఎదిగే అవకాశముందని చెప్తుంది శాస్త్రం. ఒక వ్యక్తి గుణశూద్రునిగా ఉన్నాడనుకుందాం. అంటే పుట్టుకతోనే బద్ధకంగా, యాంత్రిక జీవనం గడుపుతున్నాడనుకుందాం. శాస్త్రం అటువంటి వ్యక్తి స్వార్థపరమైన కర్మలు చేయాలని సూచిస్తుంది. ఈ స్థాయిలో నిస్వార్థసేవ గురించి ఆలోచించనఖ్ఖరలేదు. అతను డబ్బు, పేరు, కుటుంబంకోసం పనిచేస్తాడు. చాలామంది గుడికి వెళ్ళేది స్వార్థచింతనతోనే కదా. తన లాభంలో పదిశాతం దేవునికి యిస్తామని కూడా అంటారు. కొంతమంది అలాగుణశూద్రుడు స్థాయి నుంచి గుణవైశ్యుడు అవుతారు. 

  శాస్త్రం యింకొంచెం పనిచేయి, నిస్వార్థంగా చేయి అంటుంది. అలా చేస్తే అతను గుణ క్షత్రియుడవుతాడు. చివరగా అతను గుణ బ్రాహ్మణుడవుతాడు. నిజానికి వేదం బోధించే సాధన లక్ష్యం ఈ గుణశూద్రుని స్థాయి నుంచి గుణబ్రాహ్మణుని స్థాయికి ఎదగటానికే. గుణబ్రాహ్మణుడు మోక్షానికి సంసిద్ధుడవుతాడు. అందుకని ఆ స్థాయికి ఎదిగే విషయంలో మన ప్రమేయం ఉంది.

3.3.3 కర్మ వర్ణం :` కర్మ పరంగా చూస్తే మనకి ఎన్నుకునే అవకాశం ఉంది. మనం జాతిపరంగా ఉన్న వృత్తిలో కొనసాగవచ్చు లేదా మన అభిరుచిని బట్టి ఎన్నుకోవచ్చు.జాతిపరంగా అయితే కొంత లాభంఉంది. చిన్నవయసునుంచే ఆ వృత్తి చేపట్టవచ్చు. దానికి సంబంధించిన అవగాహన బాగా ఉంటుంది. పెద్దవాళ్ళ నిరంతర తోడు ఉంటుంది గురుకులవాసం లాగా. అలాగే కొనసాగింది చాలా కాలం వరకూ. 

  రెండో పద్ధతి, మన యిష్టాన్ని బట్టి ఎన్నుకోవడం. అలా విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు అయ్యాడు. కాని మన యిష్టం ఏదో తెలుసుకోవటం ఎలా? ఇవాళ బ్రాహ్మణ గుణం ఉండవచ్చు. రేపు వైశ్యగుణం ఉండవచ్చు. ఇది తేల్చుకోలేకపోతే వంశపారంపర్యంగా వస్తున్నది ఉంటూనే ఉంది. అలా రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి, వ్యాపారవేత్తల పిల్లలు వ్యాపారాల్లోకి వచ్చారు.

  ఏదైనావృత్తి ఎన్నుకునేటప్పుడు మనం మనని కించపరచుకోనక్కర్లేదు. ఎందుకంటే అన్నీమంచివే. కాని, శాస్త్రం ఒకటే చెప్తుంది. ఏ వృత్తిని ఎన్నుకున్నా దాన్ని డబ్బుపరంగా ఎన్నుకోవద్దని. డబ్బుపరంగా ఎన్నుకుంటే పోటీ తత్త్వం పెరుగుతుంది. కొన్ని వృత్తుల జోలికి ఎవరూ పోరు.

  ఇప్పుడు, ఆధునిక యుగంలో శాస్త్ర అధ్యయనం చేసి, దాన్ని నలుగురికీ చాటి చెప్పాలనే తత్వమే అంతరించి పోతోంది. శాస్త్రాలు కేవలం గ్రంధాలయాలకే పరిమితమైపోతున్నాయి. ఆఖరికి పురోహితుడు కూడా తన కొడుకుని వేదపాఠశాలకి పంపటానికి ఇష్టపడటం లేదు. ముందు ముందు వేదాధ్యయనం చేసిన వ్యక్తి దొరకటం దుర్లభమవుతుందేమో.

జాతి బ్రాహ్మణులు :` బ్రాహ్మణులకు పుట్టినవారు.

గుణ బ్రాహ్మణులు : సత్వగుణ ప్రధానమైనవారు. వీరే జాతికి చెందినా సత్వగుణ ప్రధానులైతే గుణ బ్రాహ్మణులే. కర్మ బ్రాహ్మణులు : ఆధ్యాత్మిక చింతన కలిగి అధ్యయనం, అధ్యాపనం మరియు పూజాదిక కార్యములు చేయువారు.

జాతి క్షత్రియులు :` క్షత్రియులకు పుట్టినవారు.

గుణ క్షత్రియులు :` రాజసగుణ ప్రధానులు. వీరే జాతికి చెందినా రాజసగుణ ప్రధానులైతే గుణ క్షత్రియులే.

కర్మ క్షత్రియులు :` పరిపాలన, ప్రజారక్షణ మరియు సంఘసేవవంటి కార్యములు చేయువారు.


జాతి వైశ్యులు :` వైశ్యులకు పుట్టినవారు.

గుణ వైశ్యులు :` రాజస తామస గుణ ప్రధానులు. వీరే జాతికి చెందినా రాజస తామస ప్రధానులైతే గుణ వైశ్యులే.

కర్మ వైశ్యులు :` వ్యాపారము, వ్యవసాయము, గోరక్షణ, గోపోషణ చేయువారు.


జాతి శూద్రులు :` శూద్రులకు పుట్టినవారు.  

గుణ శూద్రులు :` తామస గుణ ప్రధానులు. వీరే జాతికి చెందినా తామసగుణ ప్రధానులైతే గుణ శూద్రులే.

కర్మ శూద్రులు :` పై మూడు వర్గాలకు సేవలు అందించే వారు.

  

  దీనికంతటికీ కారణం వృత్తిని డబ్బే ప్రధానంగా చేసి ఎన్నుకోవటమే. అందుకని అలా కాకుండా ఏ వృత్తిని ఎన్నుకున్నా, మన లక్ష్యం, మన గుణం మార్చుకుంటూ వచ్చి, గుణశూద్రునిస్థాయి నుంచి గుణబ్రాహ్మణుని స్థాయికి ఎదగాలి. దీన్ని వర్ణ వ్యవస్థ అంటారు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: