14, అక్టోబర్ 2020, బుధవారం

విలువలు

 విలువలు 

బండి నడుపుతున్నా అన్న మాటే గాని నా ఆలోచన అంతా పై నెలలో పెట్టుకున్నఒక్కగానొక్క అమ్మాయి పెళ్లి మీదే ఉంది. అంతా సెట్ చేసి పెట్టుకున్నా, ఎదో తెలియని ఆందోళన. అంతా సజావుగా సాగాలని ఆ వెంకటేశ్వర స్వామిని పదే పదే వేడుకుంటున్నా.

 

డబ్బులు అంతా ఏర్పాటు చేసుకున్నాను. శంకర్ సార్ కి ఇచ్చిన లక్ష రూపాయల హ్యాండ్ లోన్ ఆయన ఈ నెలలో వాపసు ఇస్తా అని చెప్పి ఉన్నారు.ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్లి నిమిత్తం నా దగ్గర ఆరు నెలల కింద కొంచెం హ్యాండ్ లోన్ తీసుకున్నారు. అనుకున్నట్టు అమౌంట్ సార్ ఇస్తే అమ్మాయి పెళ్ళికి అంతా ఓకే . 


అయ్యో రామ, నా పరిచయం చేసుకోలేదు కదా! 

నా పేరు రమేష్. నేను ఎల్ ఐ సి లోకల్ బ్రాంచ్ లో డెవెలెప్మెంట్ ఆఫీసర్ గా ఉన్నాను. ఇంకా నాలుగు సంవత్సరాలు సర్వీస్ మిగిలి ఉంది. నేను అదే ఆఫీసు లో గత నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నా. నాతోపాటు ట్రాన్స్ఫర్ మీద శంకర్ గారు కూడా వచ్చారు. శంకర్ సర్ చాలా రిసర్వ్డ్. ఆయన పని ఆయన చేసుకుంటారు. చాలా హార్డవర్కర్ అని ఆఫీసులో పేరు.  

ఇంకా నా పరిచయం ఆపుతా. మా ఆఫీస్ వచ్చేసింది.

బండి పార్కింగ్ షెడ్లో పెట్టి నేను మొదటి అంతస్థులో ఉన్న మా ఆఫీసులో అడుగు పెట్టా. 

మెల్లగా నా సీట్ దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్నా. ఆఫీసులో అందరు అప్పుడే ఒక్కక్కరు వస్తున్నారు.

ఇంతలో శంకర్ సార్ ఇంటి దగ్గర ఉండే శ్రీనివాస్ వచ్చాడు హడావిడిగా. శంకర్ సర్ రోజు శ్రీనివాస్ బండిమీదే ఇంటికి వెళతారు. 

శ్రీనివాస్ నా దగ్గరికి వచ్చి " సార్ మీకు తెలుసా శంకర్ గారికి నిన్న రాత్రి గుండె పోటు వచ్చింది . హాస్పిటల్కి తీసుకెళ్లే లోపలే ప్రాణం పోయింది. నేను అక్కడికే వెళుతున్నా . ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి ఇచ్చి వెళదాం అని వచ్చా" అని అందరికి వినబడేటట్టు బిగ్గరగా అన్నాడు. అందరూ లేచి శ్రీనివాస్ దగ్గరికి వస్తున్నారు విషయం కనుక్కుందాం అని .

నాకు ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయ్యింది. అర్రే నిన్న బాగానే ఉన్నారు. అంతలో ఎలా అయ్యింది. 

ఇప్పుడు ఫస్ట్ శంకర్ గారి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ కుటుంబీకుల్ని ఓదార్చాలి అనుకుంటూ మా మేనేజర్ గారి దగ్గరికి వెళ్లి "సర్ నాకు ఇవాళ్టికి లీవ్ ఇవ్వండి " అని అడిగాను. సర్ కూడా లీవ్ లెటర్ ఇచ్చి వెళ్ళ మని అన్నారు.

నేను, ఇంకొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళం కలిసి శ్రీనివాస్ సహాయంతో శంకర్ సర్ ఇంటికి చేరుకున్నాము. అక్కడ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్లి సార్ మృతిపై సంతాపం తెలిపాము. నాకు ఆ అబ్బాయితో మాట్లాడుతున్నా అన్న మాటే గాని మైండ్ అంతా దిగులుగా ఉంది. అక్కడ మధ్యాహ్నం వరకు ఉండి మెల్లగా ఇల్లు చేరుకున్నాను.

స్నానం చేసి వచ్చి హాల్ లో కూర్చుని కాఫీ తాగుతున్నాగాని నా ఆలోచనలన్నీ శంకర్ సర్ ఇవ్వవలసిన డబ్బుల గురించే . మా ఆవిడ వచ్చి పక్కన కూర్చుని అడిగింది " ఏమైయింది అంత దిగాలుగా ఉన్నారు " 

నేను " ఏమి లేదు, శంకర్ గారు నిన్న రాత్రి అకస్మాత్తుగా గుండె పోటుతో చనిపోయారు. మన డబ్బులు లక్ష రూపాయలు ఆయన మనకు ఈ నెలలో సర్దుతా అని అన్నారు. ఇప్పుడు ఇలా అయ్యింది. మరి ఆ డబ్బులు ఎక్కడినుంచి సర్దుబాటు చెయ్యాలా అని ఆలోచిస్తున్నా" అని అన్నా.

మా ఆవిడ "అయ్యో ఇలా అయ్యిందే . సరే దిగులు పడకండి ఏదో ఒకటి చేద్దాంలెండి. అయినా శంకర్ గారు చనిపోయిన దుఃఖం లో వాళ్ళ కుటుంబం ఉంది. మీరు వెళ్లి వాళ్ళని డబ్బుల గురించి అడగకండి. బాగుండదు" అని అన్నది . నాకు అది కరెక్ట్ గానే తోచింది. " భగవంతుడా ఈ గండం నుండి నువ్వే గట్టెకించాలి " అని మనసులో అనుకున్నా .

మర్నాడు యథావిధిగా ఆఫీసుకి వెళ్ళాను. అక్కడ వాతావరణం అంతా కొంచెం దిగాలుగా ఉంది. అసలు పని చెయ్యాలి అని మనసు రావటం లేదు. ఎదో చేసుకుంటూ వెళుతున్నా. 

ఇంతలో ఎప్పుడు అయ్యిందో తెలీదు లంచ్ టైం అయ్యింది. నా సీట్ దగ్గర ఉండే మనోజ్ వచ్చాడు నా దగ్గరికి "సర్" అని పిలిచాడు .

నేను సమాధానం చెప్పేలోపలే తనే మాట్లాడటం మొదలు పెట్టాడు " సార్, శంకర్ గారు నాకు యాభయ్ వేలు బాకీ ఉన్నారు సర్ . ప్రో నోట్ కూడా రాసుకోలేదు , ఇప్పుడు ఆ డబ్బులు పోయినట్టే సర్ . మన మానస మేడం కూడా ఇలానే యాభయ్ వేలు హ్యాండ్ లోన్ ఇచ్చారంట , శంకర్ గారికి. ప్రోనోటు రాసుకొని ఉన్నా బాగుండేది. ఇప్పుడు ఎలా."


ఆ తరువాత పది రోజులు ఆఫీస్ లో అంతా ఇదే చర్చ. డబ్బుల విషయంలో జాగ్రత్త లేకపోతే ఎలా అని ఒకరు, అసలు ప్రోనోటు లేకుండా ఎలా ఇచ్చారు అని ఒకరు . మొత్తానికి ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇచ్చారు. కానీ నా మనసుకి తెలుసు శంకర్ సర్ డబ్బుల దగ్గర కచ్చితం అని. ఇంతకు ముందు నా దగ్గర తీసుకున్న హ్యాండ్ లోన్ కరెక్ట్ గా అనుకున్న టైం లోపల వాపసు ఇచ్చేసారు . ఈసారి ఇలా అనుకోకుండా ఘోరం జరిగిపోయింది . ఎం చేస్తాం అంతా భగవంతుని లీలా విలాసం. అమ్మాయి పెళ్లి కోసం కోసం పర్సనల్ లోన్ తీసుకోవాలి అని అనుకున్నా. 


ఇలా ఇంకో పది రోజులు గడిచాయి . ఆ రోజు ఆఫీస్ లో కూర్చొని ఉన్నా. ఇంతలో ఎవరో ముందర నుంచుని ఉన్నారు. మెల్లగా చేస్తున్న పని ఆపి తల ఎత్తి చూసా . శంకర్ సర్ వాళ్ళ అబ్బాయి ప్రణవ్ నుంచొని ఉన్నాడు. 

నేను " రామ్మా, ఇలా కూర్చో " అన్నాను. 

నా పక్కన చైర్లో కూర్చున్నాడు. 

నేను " అమ్మ, అక్క బాగున్నారా బాబు. ఇలా ఐపాయింది . జాగ్రత్తగా చూసుకో వాళ్ళని. ఇంకా నువ్వే అంతా చక్క పెట్టుకోవాలి " అని అన్నా ప్రణవ్ తో .

ప్రణవ్ మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టాడు " అంకుల్ , నాన్న కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత బీరువా లో తన డైరీ అమ్మ నాకు ఇచ్చింది . అందులో నాన్న మాకు, ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు రాస్తారు. అందులో మీకు, మనోజ్ సార్ కి ఇంకా మానస మేడం కు ఇవ్వాల్సిన అమౌంట్ వివరాలు రాసి ఉన్నాయి. నాన్నకు రావాల్సిన సెటిల్మెంట్ అమౌంట్ కొంచెం రిలీజ్ అయ్యింది.అందులో నుంచి మీకు బాకీ ఉన్న డబ్బులు అమ్మ ఇమ్మంటే ఇలా వచ్చా. కొంచెం మనోజ్ గారి దగ్గరికి , మానస మేడం దగ్గరికి కూడా తీసుకు వెళ్ళండి నన్ను, వాళ్ళ అమౌంట్ కూడా తెచ్చాను ఇవ్వడానికి ."

నేను వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ, శంకర్ సార్ ఔన్నత్యానికి మనసులోనే మెచ్చుకుంటూ ప్రణవ్ ని ఒక్కసారి దగ్గరికి తీసుకొని " బాబు మీ నాన్నచాలా గొప్ప వాడయ్యా , ఈ రోజులలో అంతా ప్రూఫ్ ఉన్నా తీసుకున్న డబ్బులు ఇవ్వడానికి ఎంతో సతాయించే వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు నువ్వు చేసిన పనితో నాకు అర్థం అయ్యింది మీ నాన్న, అమ్మ మిమ్మల్ని ఎంత మంచి విలువలతో పెంచారో . థాంక్స్ బాబు ఇంకా ఈ లోకంలో కొంచెం విలువలతో కూడిన మనుషులు ఉన్నారు అని మీరు ప్రూవ్ చేసారు." అని కళ్ళు తుడుచుకుంటూ ప్రణవ్ ని మనోజ్ మరియు మానస మేడం దగ్గరికి చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్ళా. 

పైనుంచి ఎందుకో శంకర్ సార్ గర్వంగా తల ఎత్తుకుని చూస్తున్నట్టు అనిపించింది .

కామెంట్‌లు లేవు: