14, అక్టోబర్ 2020, బుధవారం

అరుణాసురుడు

 పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు.వుండేవాడు.అతడు మహా బలవంతుడు,అతడి ముక్కు,చెవులు,ముక్కు రంధ్రాలు,కళ్ళు అన్నీ చాలా భయంకరంగా కొండ గుహల్లా వుండేవి.అతడి బాహువులుమద్ది చెట్టు కొమ్మల్లాగా,జుట్టు పెద్ద పొదరిల్లు లాగ వుండి,శిరస్సు పర్వత శిఖరం లా ఎత్తుగా వుండేది.తనకు ఎవరితోనూ చావు లేకుండా వరం పొందటానికి అతడు బ్రహ్మను గూర్చి ఒక ఏకాంత ప్రదేశంలో తపస్సు చేయ నారంభించాడు.ఎండనూ,,వాననూ లెక్క చేయకుండా కనుబొమల నడుమ జ్యోతిని దర్శిస్తూ 

బాహ్య లోకాన్ని మరిచి,ఏకాగ్ర చిత్తం తో కాలి బొటన వేలిమీద నిలబడి రెండు చేతులూ పైకెత్తి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు.దానితో లోకాలు తల్లడిల్లి పోయాయి.అతడి తపాగ్ని జ్వాలలకు జగాలు దగ్ధమై పోతున్నాయి.దానితో బ్రహ్మ ప్రత్యక్ష మై వరం కోరుకోమన్నాడు.అరుణుడు ఆనంద పరవశుడై నాకు దేవతల చేత గానీ,రెండు కాళ్ళ జీవాలతో గానీ,నాలుగు కాళ్ళ జీవులతో గానీ.నరులచేత గానీ,మరణం లేకుండా వుండేటట్టు వరం ప్రసాదించు అని వేడుకున్నాడు.తధాస్తు అన్నాడు బ్రహ్మ.

వరగర్వం తో కన్నూ మిన్నూ గానకుండా సంచరించ సాగాడు అరుణుడు.శత్రువులైన దేవతల మీదికి దండెత్తి ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు.దిక్పాలకులందరినీ జయించి ముల్లోకాలకూ అధిపతి అయ్యాడు.అతడి దుష్కృత్యాలకు తాళలేక దేవతఃలందరూ జగజ్జనని ప్రార్థించారు.నీవుతప్ప మాకు ఎవరూ దిక్కులేరు అమ్మా నేవే మమ్మల్ని కాపాడాలి అని విధవిధాలుగా ఆమెను స్తోత్రం చేశారు.

వారిమీద దయ కలిగి అంబిక ప్రత్యక్ష మైంది.ఆమె కోటిసూర్యుల ప్రకాశం తో చూడ నలవికాని తేజస్సు తో 

ప్రకాశిస్తూ వుంది.ఆమె వారి కోరిక విని అరుణుడిని అంతం చేస్తానని అభయం యిచ్చింది.

వెంటనే అంబిక యుద్ధ సన్నాహం గావించింది.భూమ్యాకాశాలు దద్దరిల్లేలా వికటాట్టహాసం చేసింది.

ఆ ధ్వనులకు సముద్రాలు అల్లకల్లోల మయ్యాయి,రాక్షసుల హృదయాలు బ్రద్దలయ్యాయి.ప్రళయ కాలం లోని వైపరీత్యాలను తలపించే శబ్దాలు విని అరుణుడి మనస్సు వికలమైంది.ఆ ధ్వనులు వచ్చిన 

ప్రదేశానికి చతురంగ బలాలతో తరలి వచ్చాడు.ఉభయ సేనలు పోరు ప్రారంభించారు.పోరు ఘోరంగా సాగింది.రాక్షస బలాన్ని యెదిరించ లేక దేవతలు దీనావస్థ లో వుండటం చూసి పరాశక్తి సింహ నాదం చేస్తూ 

అసుర సైన్యాన్ని కుప్పలు కుప్పలుగా నరికివేసింది.రుద్రుడు అనేక రూపాలు దాల్చి వచ్చినట్లుగా అయి 

శత్రు మూకలను చెల్లాచెదరు చేసేసింది.అరుణుడు పంపిన అతని అమాత్యులనందరినీ తేజోమూర్తి యై ఎదుర్కొని అందరినీ నేల కూల్చింది.ఆమె చూడ శక్యం గాని తేజం తో విజ్రుభించడం చూసి అరుణుడు స్వయంగా ఆమెను ఎదుర్కొన్నాడు.ఒకరిపై ఒకరు ఎన్నో దివ్యాస్త్రాలను ప్రయోగించారు.జగదంబ వాడిని 

ఎన్ని మార్లు సంహరించినా అరుణుడు మరో రూపంతో వచ్చి యుద్ధం చేయసాగాడు.అది చూసి అంబిక ఆశ్చర్య పోయి వీడు అస్త్ర శస్త్రాల చేత చావడని తెలుసుకొని వెంటనే మహా భ్రామరీ రూపాన్ని ధరించి చూడనలవి కాని కాంతి పుంజాలను వెదజల్లుతూ పెద్ద గుహ వంటి నోటితో తన రెక్కలగాలికి పర్వత శ్రేణు లే కదిలేట్టు చేస్తూ చెవులు చిల్లులు పడేట్టు ఝంకారం చేస్తూ మహా వేగంగా అరుణు డిపై దాడి చేసింది.

దాంతో అరుణుడు నిశ్చేష్టు డయ్యాడు.వ్యాకులత చెందిన మనస్సుతో దిగ్భ్రాంతు డయ్యాడు.అదే సమయం లో దర్శన మాత్రం తోనే దీనావస్థ నొందిన ఆ దుష్ట రాక్షసుడిని భ్రమర రూపం లో నున్న అంబిక హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన నరసింహుని లాగ వాడి వక్ష స్థలం చీల్చి వేసింది.దాంతో వజ్రాయుధం తో 

రెక్కలు ముక్కలై నెల గూలిన పర్వతం లా భూమిపైకి ఒరిగాడు.

దేవతలు పూల వర్షం కురిపించారు.మహోగ్రమైన భ్రామరీ రూపానికి భయపడి బ్రహ్మాది దేవతలు రక్షించు తల్లీ ప్రసన్ను రాలివై సాక్షాత్కరించు నీ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించు అని వేడుకున్నారు.

వారి స్తుతికి ఆనందించి జగదంబ ఉగ్ర రూపాన్ని వదిలి జగన్మోహనాకార మైన దివ్య రూపంతో వారి ఎదుట ప్రత్యక్ష మైంది.వారు సంతోషించి తల్లీ!నీవు భూలోకం లో భక్తులను అనుగ్రహించడానికి ఎక్కడైనా ఒక 

చోట నిలువవలిసింది అని ప్రార్థించారు.అప్పుడా జగజ్జనని మీరు కోరిన విధంగా భూలోకం లో సర్వ తీర్థాలూ,నదీనదాలకూ నిలయమైన శ్రీశైల క్షేత్రం లో నివసిస్తాను.అని చెప్పింది.ఆమె అక్కడి శివుడిని మల్లికా పుష్పములతో పూజ చేసింది అందుకనీ ఆ స్వామికి మల్లికార్జునుడనే పేరు వచ్చింది.మామూలుగా కవులు మగవారిని తుమ్మెదలుగాను ఆడవారిని పువ్వులతోనూ పోలుస్తారు.కానీ యిక్కడ అమ్మవారు తుమ్మెద గానూ,అయ్యవారు మల్లికా పుష్పముల పేరు మీద మల్లికార్జునుడు గా ప్రసిద్ధులైనారు.

ఆవిధంగా శ్రీ మలికార్జున మహాదేవుడికి పడమర భాగాన చల్లని తల్లి భ్రమరాంబ గా వెలసి అనాదిగా భక్తుల కోరికలను తీరుస్తూ వారి కొంగు బంగారమై విలసిల్లింది.

అమ్మవారి ఆలయం వెనుక గోడల నుండి యిప్పటికీ భ్రమర ఝంకారం (తుమ్మెద నాదం)వినిపిస్తుందని భక్తుల నమ్మకం 

✍🏻 సుగుణ రూపునగుడి

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9985831828*

కామెంట్‌లు లేవు: