3, నవంబర్ 2020, మంగళవారం

*సౌందర్య లహరి

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


పన్నెండవవ శ్లోక ఉపోద్ఘాతం - రెండవ భాగం


సౌందర్యలహరిలో ఈ ప్రవాహం (లహరి) ఎక్కడ, ఎలా పుట్టి ఏ గతిన ప్రవహించిందో వివరించలేదు. తీపిగా ఉండే రసాలు మామిడిపండును ఆస్వాదించేటప్పుడు అది నూజివీడుదా, రాజమహేంద్రిదా అని అలోచిస్తామా ? ఆ తీపిని అనుభవించడంలోనే మనస్సు లగ్నమై ఉంటుంది. ఈ సౌందర్యలహరి అమృతంలో ఊరబెట్టిన రసాల పండు. 


రసంకాని వస్తువు లేని పండు. అంతా తానే అయి నిండి ఉన్న అంబిక సౌందర్యాన్ని వర్ణించే శ్లోకమే అంబికగా సాక్షాత్కరిస్తోంది. స్తోత్రం చేయబడే వస్తువైన అంబిక, స్తోత్రమైన సౌందర్యలహరి స్తోత్రం చేసే మనమూ కూడా అంబికతోనే అయిపోతుంది. ఈ సౌందర్యలహరిని లోతుగా ధ్యానమగ్నులై మునిగిపోతూ శ్రద్ధగా చదివితే తాను చదివే సౌందర్యలహరితో బాటు తాను స్తోత్రం చేస్తున్న అంబికలో లయమయిపోతాడు. తనకు తానే అన్నీ తానే అయినస్థితిని పొందుతాడు. పరమపదాన్ని పొందుతాడు.


ఒక అందమైన వస్తువు మనకు కొంతసేపు ఆనందాన్ని కల్గిస్తుంది. అంబిక సౌందర్యం ఏకంగా అద్వైతానందాన్నే కలిగిస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదా అని మీరనవచ్చు. అందమైన పద్మాన్ని చూశాం. పండు వెన్నెలలు కురిపించే పూర్ణచంద్రుని అవలోకిస్తున్నాం. నిశ్చయంగా మనకు ఆనందస్థితి కలుగుతోంది. కానీ ఇది ముక్తత్వ స్థితిలో మోక్ష స్థితిలో కలిగే ఆనందంతో పోల్చదగినదా అన్నది ప్రశ్న.


అసలు కవిత్వం వలన కలిగే అనుభూతి ఎటువంటిది ? మహా కవుల వర్ణనల నుండి, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించగలవారు, ఆ అందంతో భగవంతుని చూడగలుగుతున్నారని, ఆ సమయంలో వారికి బ్రహ్మానంద స్ఫురణ కలిగి ఉంటుందనీ మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ప్రఖ్యాత ఆలంకారికులైన అభినవ గుప్తులు, జగన్నాథ పండితులు కవితా సౌందర్యం వలన జనించే అనుభూతి శాస్వతమైనది కాకపోయినా, క్షణికమైన (తాత్కాలీనమైన) బ్రహ్మానందాన్ని ప్రసాదించగలదని సిద్ధాంతీకరించారు. అభినవ గుప్తులు కాశ్మీర శైవమునకు చెందినవారు. కాశ్మీర శైవము అద్వైత సిద్ధాంతాలకు చేరువగా ఉంటుంది. వారు తమ సిద్ధాంతాన్ని కాశ్మీర శైవము ఆధారంగా సమర్థిస్తే, జగన్నాథ పండితులు తమ సిద్ధాంతం సమర్థించుకోవడానికి అద్వైతాన్నే ఆశ్రయించారు.


అదే ప్రకృతి, అవే కొండలు, గుట్టలు, సెలయేళ్ళు, జంతువులు, మనుష్యులు. మనం రోజూ చూస్తూ ఉన్నవే కదా ఇవన్నీ. మరి అదే ప్రకృతిని కవులు వర్ణించినపుడు మనకు ఆనందం ఎందుకు జనిస్తోంది. కవులు మన సౌందర్య పిపాసని ఉత్తేజ పరచగలిగారన్నమాట. దీనిని బట్టి మనకు కవిత్వం ఆస్వాదించడం వలన కలిగే ఆనందం సౌందర్యాస్వాదన వలన కలిగిన ఆనందమేనని అర్థమవుతున్నది కదా! అలంకార శాస్త్రంలో నిష్ణాతులైన పై పెద్దలు అటువంటి సౌందర్యానుభూతి ముక్తికి కారణభూతమవగలదని చెప్పారు.


పాశ్చాత్య కవులు కూడా ప్రకృతి సౌందర్యంలోని దైవత్వాన్ని గుర్తించారు. భగవంతునికి ముఖాముఖిగా ఎదురుపడటం వంటిది సౌందర్యానుభూతి అంటారు రవీంద్రనాథ టాగోరు వారు. టాగోరు గారి సమర్ధన ఉన్న బ్రహ్మ సమాజం వారు కూడా *సత్యం శివం సుందరం* అన్న వాక్యము ప్రధానంగా తీసుకున్నారు. మనం సచ్చిదానందం అన్నపుడు (చిత్) జ్ఞాన ఆనందములు సత్యంతో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నయని అర్థం. అలాగే మంగళము, సౌందర్యము కూడా సత్యంలో కలిసిపోయి ఉన్నాయి. శివం అంటే కల్యాణం, మంగళం, శుభం అన్న అర్థాలున్నాయి. ఇక సుందరమంటే అందమైనది అని అర్థం. ఈ రకంగా ఆనందమనేది పరబ్రహ్మ సిద్ధాంతంలో ముఖ్య భాగం. అటువంటి అందాన్ని సరియైన రీతిలో ఆస్వాదించగలిగితే అది బ్రహ్మానందానుభూతియే! 


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: