3, నవంబర్ 2020, మంగళవారం

శ్రీ విఘ్నేశ్వర విశిష్టత

 **దశిక రాము**


శ్రీ విఘ్నేశ్వర విశిష్టత


 (10వ భాగం)


అందరూ శివపార్వతులపై పుష్పాక్షతలు చల్లివెళ్ళిన తర్వాత కొత్త దంపతులిద్దరూ పట్టుదిళ్ళు అమర్చిన తూగుటుయ్యాలపై కూర్చున్నారు. వారికెదురుగా విశాలమైన గోడమీద మనోహరమైన పెద్ద చిత్తరువు చిత్రింపబడి ఉన్నది. చిత్రం మధ్యలో అందమైన ఒక ఏనుగుల జంట నాట్యం చేస్తున్నట్లుగా ముందరికాళ్ళు ఎత్తి ఎదురెదురుగా ఎత్తిన తొండాలను పెనవేసుకొని ఉన్నవి. తోరణం కట్టినట్టు ఉన్న ఆ రెండు ఏనుగుల మధ్య నుంచి కనిపిస్తున్న సరోవరంలో పెద్ద పద్మము వికసిస్తూన్నది. ఆ చిత్రంలో చిత్రింపబడిన ఏనుగుల జంటపై శివపార్వతుల చూపులు నిలిచాయి. అంతలో పద్మ చిత్రమున్నచోట వెన్నెలవంటి జ్యోతి వెలిగింది.


ఆ వెలుగు క్రమక్రమంగా పెద్దదై వ్యాపించింది. ఆ వెలు గులో శశివర్ణంతో మెరిసిపోతూన్న విఘ్నేశ్వ రుడు వారికి కనిపించాడు. విఘ్నేశ్వరుడ ముఖము ఏనుగు ముఖమే అయినప్పటికీ, ఆ ముఖంలో దివ్యత్వం నిండి ఉన్నది. ప్రసన్నత వెల్లివిరుస్తూన్నది. అతని చూపులు శాంతంగా మేధస్సునూ, శక్తినీ చాటుతున్నాయి.


అతని దోరపుబొజ్జ నిండుగా తళతళలాడుతున్నది. అభయహస్తంతో అందంగా నిల్చొనిఉన్న విఘ్నేశ్వరుడు పార్వ తికి ముద్దుల మూటలాగ కనిపించాడు. విఘ్నేశ్వరుడిని చూస్తూంటే శివుడికీ, పార్వతికీ ఎన్నడూ ఎరగని అనిర్వచనీయమైన ఆనందమేదో తమలో ఉప్పొంగుతున్నట్లు అనిపించింది.ఆ ఆనందపారవశ్యంలో నోట మాట రాక విఘ్నేశ్వరుణ్ణి రెప్పవాల్చకుండా చూస్తున్నారు.


విఘ్నేశ్వరుడు ఎడమ పక్కకు సొంపుగా వంపుపెట్టి ఉన్న చిన్నారి తొండాన్ని సవరించుకుని ఊపుతూ, ముద్దు ముద్దు మాటలతో, ‘‘నేను విఘ్నేశ్వరుణ్ణి! విఘ్నాలను అరికటే్ట వినాయకుడిని! పంచ భూతగణా లకు అధిపతిని! గణపతిని! చిత్రవిచిత్రమైన రూపం గల చిత్రగణపతిని! మీ ఇరువురి అను రాగ ఫలితంగా శివుడి తేజస్సుతో కుమార స్వామి పుట్టి తారకాసురుణ్ణి అంతమొంది స్తాడు.

కుమారస్వామికి ముందుగా నేను అవతరించి మీకు పుత్రుడిగా ఉంటాను. పుత్రగణపతినై అవతరించబోతున్నాను!'' అని చెపుతూంటే పార్వతి అతణ్ణి అందుకొని ఎత్తుకోవాలని చేతులు చాచింది. విఘ్నేశ్వరుడు వెలుగుతోసహా అంతర్థానమయ్యాడు. శివుడు, పార్వతి ఆ మందిరంలో ఆనంద సముద్రంలో మునిగి సంసారం సాగిస్తున్నారు. ఆ సమయలోనే జగత్తుకు కనీవినీ ఎరగని ఉపద్రవం ముంచుకొచ్చింది.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: