3, నవంబర్ 2020, మంగళవారం

సౌందర్య లహరి*

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


పన్నెండవ శ్లోక ఉపోద్ఘాతం - నాలుగవ భాగం


అందంగా లేకపోయినా మనపై అపారమైన ప్రేమను, ఆదరాన్ని వ్యక్తపరిచే వారి వంక అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. దీనిని బట్టి ప్రేమ అందంగా మారుతున్న విషయం అవగతమవుతుంది. ఒక తల్లి నల్లగా ఎత్తుపళ్ళతో చూడటానికి వికారంగా ఉండవచ్చు. కానీ అందమైన పక్కింటి ఆమె మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించినా ఆమె బిడ్డ ఆమెనే హత్తుకుపోతుంది. పక్కింటి ఆమె అందం తల్లి నుండి ఆమెను ఆకర్షించడానికి సమర్ధం కాదు.


దీనికి కారణం ఏమయి ఉండాలి. ఆ బిడ్డ తన తల్లికి తనపై గల ప్రేమను గుర్తించింది. అష్టావక్రుడు ఎనిమిది వంకరలతో నడుస్తుంటే నవ్వు జనించేట్లుంటాడు. అయితే మునులు పండితులందరూ ఆయన చుట్టూ మూగుతూ వుంటారు. కొంతమంది మహాపురుషులు గడ్డాలు, మీసాలతో శరీర ధ్యాసే లేకుండ అందవికారంగా ఉండవచ్చు. కానీ ప్రజలందరికి వారి సన్నిధిలో అలానే ఉండిపోవాలనిపిస్తుంది. వారిని పదే పదే చూడాలనిపించడమే అందమనే నిర్వచనాన్ననుసరించి వీరిదే మరి నిజమైన అందం. వారి అంతరంగంలో కరుణా భావం వారి శరీరమంతా భాసిస్తు వారిని స్ఫురద్రూపులుగా చేస్తోంది.


మొత్తం మీద చూస్తే ప్రేమ లేక కరుణ ఒకరి అందాన్ని ఇనుమడింప చేస్తుంది. అటువంటి ప్రేమ ఒకస్థాయిని దాటినప్పుడు ఆ ఆకృతి అందం యొక్క ప్రాధాన్యత నష్టమై ప్రేమే అందంగా పరిణమిస్తుంది.

ఒక వస్తువును మనం మరల మరల చూస్తూన్నామంటే దాని మూలాన మనకు కలిగే ఆనందమే కారణం. ఆనందం కలిగించే వాటిలో ప్రధానమైనది ప్రేమ. ప్రేమ వలన కలిగే ఆనందానికి సమమైనది ఏదీ లేదు. కాబట్టి ఆనందాన్ని ప్రసాదించే ప్రేమే అందం అవుతుంది. అందమైన వారిని వారిలోనున్న ప్రేమించే ప్రకృతి మనచే తిరిగి తిరిగి చూసేలా చేస్తుంది. 


అంబిక మూర్తీభవించిన సౌందర్యం. మూర్తీభవించిన ప్రేమ. అందమే తానయిన ప్రేమ. పంచదార అన్ని వంటకాలను తీపిని ఇస్తుంది. అలగే ఎక్కడెక్కడ అందమైన వస్తువులను చూస్తామో ఆ వస్తువులు ఆ అందాన్ని పొందింది అంబిక నుండే! ఆమె అందములన్నిటికీ మాతృక. పరబ్రహ్మ శక్తి అయిన ఆమె ఇక్కడ మొత్తమైన సంపూర్ణమైన అందం. అంబిక సౌందర్య ప్రవాహం. ఆ ప్రవాహము నుండి చిందిన బిందువులంటిన వస్తువులు ఎంతో సౌందర్యమైనవిగా భాసిస్తున్నాయి. అంబిక యొక్క అంతరంగికమైన కరుణ సౌందర్య ప్రవాహంగా రూపుదిద్దుకొంది.


ప్రేమకు రూపం లేదు. బయట చూపులకు అనాహ్లాదంగా కనిపించేవారు ఎంతో ఆపేక్ష కలిగి ఉండటం లోకంలో మనం చూస్తాము. అందమైన వారికి ఆపేక్షే లేకపోయి వుండవచ్చు. అయితే భౌతికమైన లక్షణాల మీద విజయం సాధించే ప్రేమ ఒక వ్యక్తిలో అందంగా మెరిసిపోతుంది. అంటే రూపంలేని ప్రేమలో ఎలాగోలా ఆ వ్యక్తిపై రూపిస్తుందన్నమాట. అంబికపై అటువంటి ప్రేమ ప్రతిస్పందించడం కాదు – ఆమె మొత్తంగా ప్రేమైకమూర్తి. రూపం లేని ప్రేమ ఆమె అందంగా అవుతుందన్నమాట. సంపూర్ణమైన ఆమె ప్రేమ సంపూర్ణమైన అందంగా మారుతుంది.


రూపంలేని పరబ్రహ్మ శక్తి తనను గుర్తించలేని పిల్లల (మానవాళి) కోసం అంబికగా రూపం ధరించింది కదా! కరుణ చేత ప్రేమ వలన ధరించిన రూపం మరి మూర్తీభవించిన ప్రేమే కదా! అంబిక ఇంత అందమైన రూపమును ధరించడానికి కారణం ఏమిటి ? వివేకం లేని పరిణితి చెందనివారితో సహా తన పిల్లలందరూ అల్పమైన అందాల జోలికి పోకుండా తనవైపు తిరుగుతారని కాదూ!!


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: