3, నవంబర్ 2020, మంగళవారం

అల్లసాని పెద్దన కవితా వైభవం

 అల్లసాని పెద్దన కవితా వైభవం చాలా గొప్పది. ఆశువుగా తెలుగు సంస్కృతంలో ఏకధాటిగా కవిత్వం చెప్పగల ధీశాలి అల్లసాని పెద్దన. పెద్దన కవిత్వం చాలా ప్రౌఢమే కాదు అప్పటికప్పుడు ఆశువుగా సుదీర్ఘమైన పద్య మాలిక. ( పద్యం అనేది కేవలం నాలుగు పాదాలు కలిగి ఉంటుంది. అదే పద్యపాదాలతో నాలుగు కన్నా ఎన్నో పాదాలు కలిగి వున్న దానిని పద్య మాలిక అని అంటారు. పెద్దన గారు ఉత్పల మాలిక ఆశువుగా చెప్పి అటు పండిత సభను ఇటు కవి రాజయిన రాయల వారిని మెప్పించి స్వయంగా రాయల వారిచేతుల మీదుగా గండపెండేరం తన కాలికి తొడిగించుకున్న కవి సార్వభౌముడు అల్లసాని పెద్దన గారు. 

ఈ రోజు మనలో అంతటి కవులు లేకపోవటం ఒకయెత్తు ఆవగా అటువంటి పద్య ప్రయోగాల గూర్చిన విశేషాలు కూడా తెలియని వారు మనకు కవులుగా కనపడటం మన దురదృష్టం. 

ఆ పద్య మాలిక ను  ఆస్వాదించండి. 

 ఉ:   పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా

కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్

రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలి యారజంపు ని

ద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్

బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ

కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్

జేతికొలంది గౌగిటనుజేర్చినకన్నియ చిన్నిపొన్ని మే

ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్

డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ

వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్

గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు

న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బపొం

బూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం

గాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా

సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్

మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ

రీతిగ, సంస్కృతంబు పచరించెడుపట్టున భారతీవధూ

టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ

భౌతికనాటక ప్రకరభారతభారతసమ్మతప్రభా

శీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా

పాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ

జాతకతాళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం

గాతతతేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి

వ్రాతనయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ

నూతన ఘల్ఘలాచరణనూపురఝాళఝళీమరందసం

ఘాతవియధ్ధునీ చకచకద్వికచోత్పలసారసంగ్రహా

యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై

చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర

ద్యోతకగోస్తనీఫలమధుద్రవగోఘృతపాయస ప్రసా

రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్


ఆ ముప్పది పాదాల ఉత్పలమాలిక తాత్పర్యాన్ని కూడా ఆస్వాదించండి.


పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా


కైతలు ? జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్ (1-2)


అలోచనామృత ధారా వాహినులైన ఉత్కృష్ట కవితా విలాసములు కేవలము పైపై చూపుల నలరించు క్రొంబూతల శబ్ద వికసనములతో లేత పిందెల (కసుగాయ ) వంటి సామాన్య భావములతో సహృదయ హృద్యంగమములు కాలేవు కదా ! అవి శ్రుతి పక్వములైన లలిత కోమల కాంతా వదావళులు , ఉదాత్త గాంభీర్యముల మేలు కలయికలై పఠితుల మదిలో ప్రవేశించి హృదయమునకు హత్తుకొనవలెను . ఆ పద లాలిత్యము భావౌన్నత్యముతో మేళవించి వినువారి మానసమును కమ్మని పరిమళములో ముంచెత్తవలెను .


రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని


ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్ (3-4)


ఆ కవితా సౌరభములు మదిని స్పృశించుచున్నంత వరకూ తన డెందమును కొల్లగొనిన ప్రేయసి అమందానంద సందోహ భరితమైన చేతల లీలావిలాసములవలె మదన మాధుర్యములై రేయింబవళ్ళు మరపురాని అనుభూతిని లోలోన కలిగించవలెను


బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ


కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్ (5-6)


ఆపరాని ఆనంద పారవశ్యమున ఎగసి పలికెడి మిక్కిలి మక్కువగల యవ్వన వతి కలగీతికల వలె వలపు వెల్లువలై పల్లవాపవలెను . ఆలాపనలు ఆలకించగనే ఉల్లము రంజిల్లి జిలిబిలి యూహలు తీయని కోర్కెల రూపును సంతరించుకోవలెను .


జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే


ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్ (7-8)


ఆ కైతలను మనసుకు పట్టించగా మదినిలోగొని ప్రియమార బిగి కౌగిలి జేర్చిన ముగ్ద మనోహరి సన్నని పై యెదలోనున్న అందీ అందని స్నిగ్ద సుకుమారపు చనుగవ వలె స్పర్శా సుఖానుభూతినందించి ఉద్వేగమును పెంచవలెను .


డాతొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ


వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్ (9-10)


తన రూప లావణ్య విభవాతిశయములచే విభ్రమము కలిగించి వామాంకము నధిష్టించిన మోహనాంగిని మునిపంట నొక్కినప్పుడు దొండపండు వంటి పెదవులనుండి చిప్పిల్లు అధరామృత ధార వలె కవితా రసము లోనికి పరవళ్ళు దొక్కవలెను .


గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు


న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం


బూఁతల నున్న కాయ సరిపోఁడిమి కిన్నెర మెట్లబంతి సం (11-13)


మనసు దరిజేర పరమేష్టి ప్రియురాలి స్వచ్చమైన దేహకాంతి కి సమమై   సంభ్రమము కలిగించి   ఉధృద్ధ్యాతిశయముచే  పిడికిలినింతగా పైకి పొంగిన పయోధరముల రాపిడి చే హస్తమందు కలిగిన మృదువైన కాయవలె శోభించవలెను .


గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా


సాతత తానతానలపసన్ దివుటాడెడు గోటమీటు బల్


మ్రోతలునుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ (14-16)


కవితలు మదిని తడుముచుండగా కన్నడ , గౌళ రాగమున స్వర సప్తక యుతమై ఎడతెగని రాగ   ప్రస్తార ప్రాచుర్యము సన్నని మెట్ల వరుసపై కిన్నెర వీణియ గొట మీటుంచుండగా మృదువుగా నర్తించుచుండగా వెలువడు సవ్వడులు నవయవ్వనమున వికసించు శృంగార చేష్టలు విలాస సాంద్రతలై అచ్చ తెనుగు భాష కైతలీ రీతిగా మనోజ్ఞముగా నుండవలెను


ఇక అమర భాష యైన సంస్కృతము లో కవిత్వము గురించిన విశేషము చెప్పెద !


రీతిగ సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ


టీ తపనీయగర్భనికటీ భవ దాననపర్వసాహితీ


భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మతప్రభా (17-19)


శారదా దేవి బంగారు రంగారు గర్భ సంభవమై పరా , పశ్యంతి , మధ్యమ , వైఖరి కలిత వాగ్వైభవ రూపమై శబ్దార్ధ జ్ఞాన సంపన్న మైన వాఙ్మయముతో ముత్యాల లావణ్య   శ్రేష్టలలితములైన భరతముని నాట్య శాస్త్ర సమ్మతమైన దశవిధ రూపకములను అనర్ఘమైన పంచ కావ్యములను దీపించుచూ


శీతనగాత్మజా గిరిశశేఖర శీత మయూఖరేఖికా


పాతసుధాప్రపూర్ణ బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ (20-21)


చలిమల కూతురైన పార్వతీ దేవి సిగబాటియైన చంద్ర కళలనుండి నిరంతరము జాల్వారు రసామృత వృష్టి పుష్టితో నానా విధములైన ఘమం ఘమ ఘం ఘమల ప్రౌఢిమ నుండి వెలార్చిన ….


జాతక తాళయుగ్మ లయసంగతి చుంచు విపంచికా మృదం


గాతత తేహితత్తహిత హాధితధంధణుధాణుధింధిమి


వ్రాతనయానుకూల పదవారకుహూద్వహ హారికింకిణీ (22-24)


లయ తాళముల మేలికూర్పును చేకూర్చుకొన్నవై వీణా నిక్వణము , మృదంగ స్వనముల సమాగమములౌ తేహి , తద్తహి ,తహాధిత , ధాణు ధింధిమల సమూహముల కనుకూలములైన కోకిలల కలస్వనములతో .. గమకితములైన మనోహరములౌ చిరుమువ్వల సవ్వడులు కలిగిన ….


నూతనఘల్ఘలా చరణనూపుర ఝూళఝుళీ మరందసం


ఘాతవియద్ధునీ చకచక ద్వికచోత్పలసారసంగ్రహా (25-26)


నవీనమైన గలగలలు కల్గిన కాలి అందెల రవళులనెడు మరంద మాధుర్యమువలె చక్కగా శొభించిన నీలోత్పలముల కుసుమరాగ పరాగ ధూసరములై ..


యాత కుమారగంధవహహారి సుగంధ విలాసయుక్తమై


చేతము చల్లఁజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర (27-28)


పెంపెక్కిన మలయ మారుతపు పిల్ల తెమ్మెరలవలె మనోహర సువాసనా విలాసములీను మదిని అనుపమానమైన ఆనందమును రేకెత్తించవలెను


ద్యోతకగోస్తనీఫలమధుద్రవ గోఘృతపాయసప్రసా


రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారె సారెకున్ । (29-30)


తీయని సరసమొలికించి హృదయమును రాగ రంజితము జేయు ద్రాక్షా రసము , తేనె , గోఘృతము పాయసములతో .. మేళవించిన విశిష్టమైన అతిరసమను పదార్ధము వలె ఆనందామృతము వెల్లి విరియగా మాటి మాటికీ రసానుభూతి తో ముంచెత్తుతూ పఠితలను మురిపించి మరపించవలెను .



కామెంట్‌లు లేవు: