3, నవంబర్ 2020, మంగళవారం

శ్రీమన్నారాయణీయం

 **దశిక రాము**


*శ్రీమన్నారాయణీయం**


1-10-శ్లో.


ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం, విశ్వతేజో హరాణాం

తేజస్సంహారి వీర్యం, విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం।

అంగాసంగా సదా శ్రీరఖిలవిదసి, న క్వాపి తే సంగవార్తాతద్వాతాగారవాసిన్! మురహర! భగవచ్ఛబ్ద ముఖ్యాశ్రయో౾సి||


భావము - మురాసురుని సంహరించినవాడా! సంపూర్ణ ఐశ్వర్యం, శంకరుడు మున్నగు సకల దేవతల నియామకత్వం, బ్రహ్మాదులతోసహా విశ్వంలోని సకల తేజస్సులను హరించగల తేజస్సు, వీర్యం, నిస్పృహులైన మహానుభావులచే కీర్తింపబడు నిర్మలమైన కీర్తి, సర్వదా ఆశ్రయుంచి ఉండు లక్ష్మీదేవి, సర్వజ్ఞతతో విరాజిల్లేవాడవు . నీవు సర్వసంగ పరిత్యక్తవు, వైరాగ్య శోభితుడవు. భగవంతుడు అను శబ్దమునకు పూర్తిగా తగినవాడవు.


వ్యాఖ్య - భట్టతిరి వ్యక్తీకరిఃచిన ఈ శ్లోకంలోని విభూతుల్ని మనదైన పోతనభాగవతంలో  మరింత మధురంగా మనకి అందించాడు పోతన.  మచ్చుకు కొన్ని చూద్దాం.


4-920 

కమలనాభా! నీవు సంసార దుఃఖాన్ని హరిస్తావు. నీవు పరానికి నాథుడవు. తమ్మి పుప్పొడి వలె పసుపు పచ్చని రంగు కల వస్త్రాన్ని ధరిస్తావు. పద్మమాలికలను ధరిస్తావు. నీవు సుగుణవంతుడవు. నీవు సృష్టికర్తవు. నీవు రాక్షసులను సంహరిస్తావు. 


6-336

యోగుల సమూహం చేత స్తుతింపబడే నీకు వందనం; శార్ఙ్గమనే ధనుస్సును ధరించినవానికి వందనం; ప్రకాశించే రెండు కుండలాలు గలవానికి వందనం; కఠినమైన కవచం కలవానికి వందనం; మదగజాన్ని రక్షించినవానికి వందనం; రాక్షసులను శిక్షించినవానికి వందనం; నిండు చంద్రుని వంటి ముఖం కలవానిని వందనం; గొప్ప తేజస్సు కలవానికి వందనం; అద్భుతమైన పుణ్యాల నిచ్చేవానికి వందనం; ఉత్తమమైన వైకుంఠంలో నివసించేవానికి వందనం; ఆశ్రయించిన వారిని రక్షించేవానికి వందనం; శేషతల్పునకు వందనం.


3-922

అప్పుడే వికసిస్తున్న పద్మాలవంటి అందమైన కన్నులు కలవాడు, వక్షస్థలంపై అందమైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కలవాడు, నల్లని మేఘంలా, నల్లకలువలా శ్యామలవర్ణం కలవాడు, తుమ్మెదలకు విందుచేసే వైజయంతీ మాలికతో విరాజిల్లేవాడు, కౌస్తుభమణితో శోభించే ముత్యాలహారం కంఠమందు ధరించినవాడు, యోగిజనుల హృదయ కమలాలకు దగ్గరైనవాడు, ఎప్పుడును ప్రసన్నమైన చిరునవ్వు చిందులాడే ముఖపద్మం కలవాడు, కోటి సూర్యుల తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశించేవాడు, విలువైన రమణీయ రత్నకుండలాలు, కిరీటం, హారాలు, కంకణాలు, కటకాలు, భుజకీర్తులు, అంగుళీయకాలు, అందెలు మొదలైన అలంకారాలతో విలసిల్లేవాడు, కటి ప్రదేశమందు ఘల్లు ఘల్లుమనే గజ్జెల మొలనూలు అలంకరించుకొన్నవాడు, భక్తులను లాలించి పాలించేవాడు అయిన శ్రీమన్నారాయణుని (ధ్యానం చేయాలి).


7-265

ఈ దేశకాలాదుల ఎల్లలు అవధులు సమస్తము ఆ స్వామి యందే లీనమై పోతుంటాయి. అతని యందే పుట్టుతూ ఉంటాయి. అతని యందే వీటన్నిటికి ఆధారం కలుగుతూ ఉంటుంది. అండదండలు గలవారికి లేనివారికి అందరికి అతని యందే రక్షణ లభించుతు ఉంటుంది. ఆ స్వామే నయ్యా నాకు రక్షకుడు.


అన్ని దిక్కులలోను తిరుగులేని నన్ను కాదని నీకు దిక్కు అయ్యేవాడు ఎవడురా అని తర్జిస్తున్న తండ్రి హిరణ్యకశిపునకు, భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు సమాధానం చెప్తూ సృష్టితత్వాన్ని సూచిస్తున్నాడు. 


3-1054

దేవతలకు ఆశ్రయమైనవాడా! అనంత పుణ్యాలతో ప్రకాశించేవాడా! సుగుణాలు కలవాడా! భక్తులను కాపాడేవాడా! సంసారమనే అంధకారానికి సూర్యుని వంటివాడా! కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేవాడా!భూమికి మేలు చేకూర్చేవాడా! దుష్టులైన రాక్షసులను నాశనం చేసేవాడు 


8-133

ఓ దేవాధిదేవ! ఓ మహాప్రభూ! దీనుల మొరలను దయతో వినటానికైనా, వారిని కాపాడటానికైనా, మంచి మంచి దీవెనకోలు అందుకోటానికైనా, దీనబంధు! దీనరక్షక! నీకే తగు నయ్యా.


 10.1-1705

ముకుందా! రాజులనే మత్తేభాల పాలిటి సింహమా! నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించే వాడువు. కులం, రూపం, యౌవనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు. మోహించకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీదేవి నిన్ను వరించ లేదా. 


7-481 

భూదేవి పుత్రిక సీతాదేవితో క్రీడించువాడా! ధర్మమార్గమునందే చరించువాడా! సాటిలేని నీతిగలవాడా! దేవతలకు శత్రువులైన రాక్షసుల సంహరించినవాడా! గురువులకు పెద్దలకు జ్ఞానులకు సాధువులకు సుఖసౌఖ్యములను సమకూర్చువాడా! భూమండలము నంతను ఏలిన చక్రవర్తి! దేవతల భీతిని తొలగించువాడా! పరమ జ్ఞానుల చిత్తములలో విహరించువాడా! శ్రీరామచంద్ర ప్రభో! కరుణించుము.


1-221

ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తు, పగవారి కళ్ళెదురుగానే రథాన్ని తీసుకు వెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో; చిరునవ్వులు చిందిస్తూనే కౌరవపక్ష రాజు లందరిని పేరుపేరునా చూపిస్తు ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో; ఆ శ్రీకృష్ణపరమాత్మ నా హృదయపద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక.


10.1-1012 

నల్లని దేహము వాడు, కమలములవంటి కన్నులు గల వాడు, కరుణా రసము కురిపించే వాడు, సిగపై నెరపిన నెమలి పింఛము కల వాడు, చిరునవ్వు చెలువారే చక్కని మోము కల వాడు నైన ఓ కుర్రవాడు మా మానినీమణుల మానధనం దోచి తెచ్చాడు. ఓ మల్లెలార! మీ మల్లె పొదల మాటున కాని ఉన్నా


డేమో కొంచం చెప్పండమ్మా.


1-141

జ్ఞానవంతుడా! వేలకొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్షసంపదలు అందుకోడం అంత సుళువు కాదు. అదే భాగవతము, అనే వేదాన్ని పఠిచటం ద్వారా అయితే మోక్షం అతి సుళువుగా దొరుకుతుంది."


ఇది మన పోతనవారి పద మాధుర్యం.


ఈరోజు 10 వ శ్లోకంతో నారాయణీయం ప్రథమ దశకం పూర్తవుతోంది. స్వస్తి.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: