3, నవంబర్ 2020, మంగళవారం

రామాయణమ్ 187

 రామాయణమ్ 187

కిష్కింధాకాండ ప్రారంభము

.....................................

అది చైత్రము,

 వసంతుడు కుసుమాంజలి ఘటించి పంపాసరోవర తీరములో రామలక్ష్మణులకు స్వాగతము పలుకుతున్నాడు .

.

 ఆ ప్రాంతమంతా ఎటుచూసినా కుసుమించిన తరువులే ,వికసించిన పూవులే 

.

.పంచశరుడు విజ్రుంభించి తన శరాలను సంధిస్తున్నాడు

.

 ,రణరంగములో శత్రుభీకరుడైన రాముడు ఈ మదనకదన రంగములో మాత్రము భీరువైపోయాడు ,

.

హృదయములో విషాదము ఆవరించింది .ఆయనకు ఎటుచూసినా సీతే కనపడుతున్నది.

.

 అడుగడుగునా సీత అణువణువునా సీత 

.

నెమళ్ళక్రేంకారము వింటే సీత ! 

తుమ్మెదల ఝుంకారము వింటే సీత .

వికసించిన పూవు చూస్తే సీత 

కుసుమించిన తరువుచూస్తే సీత 

.

లేడిపిల్ల కన్నులు  చూస్తే సీత కన్నులు గుర్తుకు వస్తున్నాయి 

.

 కోకిల కూత వింటే సీత పలుకులు చెవులలో రింగుమంటున్నాయి

.

తుమ్మెద రెక్కలు చూస్తే సీత ముంగురులే జ్ఞాపకము వస్తున్నాయి 

.

సెలయేటి గలగలలు వింటే కిలకిలమని నవ్వె తన పడతి మోము గుర్తుకు వస్తున్నది 

.

కలహంస నడకల కలికి గుర్తుకువస్తున్నది హంసల గుంపు చూస్తే !

.

సరోవరాలలో వికసించిన పద్మాలు చూస్తే పద్మిని పద్మగంధి మదినిండా మెదులుతున్నది ఆయనకు .

.

అడుగడుగునా సీత అణువణువునా సీత !

.

ఆయనకు జగమంతా సీత తో నిండి పోయింది .

.

విరహము వలన కలిగిన దుఃఖాన్నితట్టుకోలేక తన మనస్సును సోదరుడిముందు పరచి పసిపిల్లవాడిలా రోదించాడు రాఘవుడు.

.

రామాయణమ్ 188

....

రాముని వేదన అంతా విన్న లక్ష్మణుడు ,

అన్నా! ధైర్యం వహించు, నీ వంటి నిర్మలమైన బుద్దికలవాడి బుద్ది  ఇంత మందము కాకూడదు . 

ఆ రావణుడు ముల్లోకాలలో ఎచట దాగినా వానిని హతమార్చుట తధ్యము .వాడు సాక్షాత్తూ సీతతో దితి గర్భములో దాగుకొన్నప్పటికీ వాడికి చావు తప్పదు .

.

ఒక ప్రయోజనమును పోగొట్టుకున్నవాడు దానిని ప్రయత్నము లేకుండగా తిరిగి పొందజాలడు కదా !

.

ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహ త్పరం బలం 

సోత్సాహస్య హి లోకేషు న కించిదపి దుర్లభమ్ 

.

ఉత్సాహము చాలా బలము గలది ,

ఉత్సాహమును మించిన బలము వేరొకటి ప్రపంచమున లేదు 

,ఉత్సాహవంతునకు లభించనిది ఈ లోకములో ఏదీ లేదు .

ఉత్సాహవంతునకు ఓటమి అనేదే లేదు ,

అందుచేత ఉత్సాహము పెంచుకొని సీతాదేవిని వేదుక ప్రయత్నము చేద్దాము .

.

అన్నా ! శోకమును వెనుకకు నెట్టి వేయుము ,

కామ పరాధీనత్వమును విడిచి వేయుము .

నీవు ఎంతగొప్ప వాడవో నీవు గ్రహించలేకున్నావు .

.

లక్ష్మణుడి ధైర్య వచనాలు విని రామునిలో శోకము ,మోహము పోయి ధైర్యము కలిగి ఉత్సాహముగా ముందడుగు వేసాడు .

.

మహా బలవంతులైన రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు ,

.

ఒక్కసారిగా భయపడ్డాడు భ్రాంతితో నిశ్చేష్టుడయ్యాడు వాలి పంపిన వీరులేమో అని ఏవేవో ఊహిస్తూ ఉన్నాడు .

.

 వానరులలో కలకలము బయలుదేరి అరణ్య మధ్య భాగములోకి పారి పోయారు .

.

శ్రేష్టమైన ఆయుధములు ధరించిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడ్డాడు!

 ఒకచోట నిలవలేక పోయాడు ,

ఆయన మనస్సులో ధైర్యముకోల్పోయిన వాడయ్యాడు .

.

అదే భయము ముఖములో కనపడుతుండగా తన మంత్రులతో ,వారు వాలి పంపగా వచ్చిన వారే సందేహము లేదు ,

నారచీరలు ధరించి కపట వేషముతో సంచరిస్తున్నారు .

అని అన్నాడు .

.

వెంటనే అందరూ వేరొక కొండచరియను ఎక్కి సుగ్రీవునికి ధైర్యము చెపుతున్నట్లుగా ఆయన చుట్టూకూర్చున్నారు .

మరల అక్కడకూడా వారి భయము వారిని నిలువనీయలేదు ,

నిముషనిముషానికి కొండచరియల మీద దూకుతూ గాభరా పడుతూ పుష్పించిన తరువులను విరుస్తూ ఎక్కడా ఆగకుండా తిరుగుతూ ఉండగా!

.

 మాటలలో నేర్పరి అయిన హనుమంతుడు సుగ్రీవునితో ఇలా పలికాడు .

.

ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవమ్ వాక్య కోవిదః .....

.

.NB

ఇక్కడనుండి స్వామి పాత్ర ప్రారంభము . ఆయన పాత్రను ప్రవేశపెడుతూ మహర్షి వాల్మీకి చెప్పినది చూడండి ...

ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవమ్ వాక్య కోవిదః .....

.

మొట్టమొదట ప్రవేశపెడుతూనే ఆయన వాక్యకోవిదుడు అని మనకు తెలియ చేశారు మహర్షి .

.

వాక్య కోవిదుడట!.

స్వామికి శబ్దము మీద అంత సాధికారికమైన పట్టు ఉన్నది ....

అది ఎలా ఉంటుందో ,దానితో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో ,ముందు ముందు కధాగమనంలో మనకు అవగత మవుతుంది .

కామెంట్‌లు లేవు: