6, అక్టోబర్ 2020, మంగళవారం

రాముడు సీతనెందుకు వదిలేసాడు? 89

 


తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు బయటకు వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు. అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం(వేదం చదువుకున్న వారు మోసే పల్లకి) ఎక్కి శాస్త్రిగారి ఇంటికి వచ్చారు. వారింట్లో దిగి పరమాచార్య స్వామి వారు శాస్త్రిగారితో, “ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోదని బెంగ పెట్టుకుంటున్నావా? ఇవ్వాళ మీ ఆచరానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం. ఇక నీకు ఇబ్బంది కలగదని” శాలువా తీసి కప్పారు. 


పరమాచార్య స్వామి వారు శాలువా కప్పడము అంటే అంగరక్ష కట్టినట్టే. “ఇంక నీకు బెంగ లేదు. ఇప్పుడు బయటకు వచ్చినా ఏమి ఇబ్బంది కలగదు” అని అన్నారు. ఆ గురు శిష్యుల సంబధం అటువంటిది. 


పరమాచార్య స్వామి వారు కూర్చొని ఉండగా శాస్త్రిగారు వారి తండ్రిగారైన కీర్తి శేషులు తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రులు గారు ‘రామ కథామృతము’ అనే గ్రంథం రచించారు. దాన్ని స్వామి వారి ముందు చదువుదామని శాస్త్రి గారు వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు లోపలికి రమ్మన్నారు. శాస్త్రిగారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు. 


పరమాచార్య స్వామి వారు “పద్యాలు చాలా బాఉన్నాయి. చదువు చదువు” అని అంటున్నారు. ఇంతలో స్వామి వారి సేవకులొకరు వచ్చి “పెరియావ బెంగళూరు నుండి ఒకరు వచ్చారు. పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు. మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి వెడతాము అని అంటున్నారు” అని చెప్పాడు. స్వామి వారు అతనితో కాసేపాగమను అని నువ్వు చదువు అని శాస్త్రిగారిని అన్నారు.


సేవకుడు మరలా వచ్చి “వారికి ఏదో పని ఉన్నది కావున తొందరగా మీ దర్శనం చేసుకొని వెళ్ళలాట” అని చెప్పాడు. కాని స్వామి వారు ఏమి మాట్లాడక శాస్త్రి గారి వైపు తిరిగి చదువు అని అన్నారు. సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు. “ఆ బెంగళూరు ఆయనకు ఏదో పని ఉన్నదట. మీరు ఒక్కసారి దర్శనం ఇస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట. వారిని పంపమంటారా?”.


ఈ విషయాన్నంతా చూసి, శాస్త్రి గారు “అరే ఏమిటిది నేను ఇలా కూర్చుని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామి వారికి ఇబ్బంది కలుగుతున్నట్టు ఉంది” అని లోలోపల బాధపడుతున్నారు.


అప్పుడు పరమాచార్య స్వామి వారు ఆ సేవకులతో, “అతను డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా? లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్ప అని అనుకుంటున్నాడా? నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తరువాత రమ్మను లేదా వేచి ఉండమను. నాకు ఈ రామాయణమే గొప్పది” అని అన్నారు.


శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామి వారు. శాస్త్రిగారిని ఇలా అడిగారు.


”ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చెయ్యంచాడు కదా. సీత అగ్నిపునీత అని తెలుసు కదా! ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేసాడని సీతని పరిత్యజించడం న్యాయమా? సరే రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను ఎనభై రామాయణాలు (వాల్మీకి రామాయణం , కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమద్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం మొ||) చెదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్కరకంగా చెప్పారు. మరి మీ నాన్న గారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు?” అని అడిగారు. 


శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి, ఇలా వివరణ ఇచ్చారు “రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడి రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతలో ఉండగా, 


“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భర్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు. 


“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు” అని చెప్పారండి మా నాన్న గారు అని అన్నారు. 


ఈ మాటలు విని పరమాచార్య స్వామి వారు పరవశించిపోయారు. ఇన్ని రామాయణాలు విన్నాను గాని ఇలా సమర్థించిన వాణ్ణి వినలేదు అని “ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో” అన్నారు. ”తమకు నాగర లిపి వచ్చు. అరవ లిపి వచ్చు. మరి తెలుగు లిపి పరిచయమేనా?” అని శాస్త్రి గారు అడిగారు. ”నాకు అక్షరాలు వస్తేనేమి, రాకపోతేనేమి? పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను. ఒక సెట్టు ఇవ్వు” అన్నారు. తరువాత కొంత కాలానికి శాస్త్రి గారు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. స్వామి వారు ఒకగంటసేపు పురాణం చేసారు. తరువాత స్వామి వారు ఈ కింది పద్యం చదివారు. 


కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ ల

జ్జెనెట్టగ మున్మున్న మునింగి కొండచరిబాటం జారె రేరేడటం 

చనుమోదించుట బద్మినీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసా 

ర నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్, రామా! జగన్మోహనా!!


ఇది శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ‘రామ కథామృతము’లో బాలకాండ, నవమాశ్వాసములోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం. మహాస్వామి వారు పై పద్యం చదివి, “మీ నాన్నగారు దారినపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా?” అని శాస్త్రి గారిని అడిగారు. 


ఏనాడో గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివే వారో అలాగే స్వామి వారు ఎట్లా చదవగలిగారు!

కామెంట్‌లు లేవు: