6, అక్టోబర్ 2020, మంగళవారం

*ధార్మికగీత - 41*


              *శ్లో:- గంగా పాపం శశీ తాపం ౹*

                     *దైన్యం కల్పతరు స్తథా ౹*

                     *పాపం తాపంచ దైన్యంచ ౹*

                     *హన్తి సజ్జన దర్శనమ్ ౹౹*

                                        *****

*భా:- సకల నదులలో గంగానది అతి పవిత్ర మైనది. మూడు దిశలలో పారుతూ, "త్రిపథగ" అని కీర్తి కెక్కింది. భగీరథునిచే దివి నుండి భువికి దిగివచ్చింది. అలాంటి గంగలో ఒక్కసారి మునిగితే పాపాలు, పాతకాలు, మహా పాతకాలు హరించుకు పోతాయి. రాకా సుధాకరుడు తన చల్లని మృదువైన శీతల కిరణ స్పర్శచే జీవకోటి యొక్క కాయిక,మానసిక తాపాన్ని ఇట్టే పోగొడుతున్నాడు. కల్పవృక్షము మన కోరికల నీడేర్చి, మన దైన్యాన్ని, హైన్యాన్ని సమూలంగా తొలగిస్తుంది. పై మూడు కేవలం ఒక్కొకటి ఒక్కోదాన్ని మాత్రమే హరిస్తున్నాయి. వీటన్నిటి కంటె " సజ్జన సంగతి" మిక్కిలి విశిష్టమైనది. సజ్జన దర్శన, స్పర్శన, భాషణములు మన పాపాలను, తాపాలను, హీన, దీన పరిస్థితులను చక్క దిద్దుతాయి. సర్వ శ్రేయములను ఫలింపజేస్తున్నాయి. శ్రీకృష్ణ "దర్శనం" కుచేలుని కుబేరునిగా మార్చింది. పరమాత్మ గీతా "భాషణం" కిరీటిని ధన్యుణ్ణి చేసింది. శ్రీరామ పాద "స్పర్శనం" అహల్యను పునీతను చేసింది. అందుకే "త్రిజగతి సజ్జన సంగతి రేకా- భవతి భవార్ణవ తరణే నౌకా" అన్నారు శంకరా చార్యులు. "సాధు సంగంబు సకలార్థ సాధనంబు " అన్నారు కరుణశ్రీ. సత్పురుష సమాశ్రయము ఇహ-పర సాధకమై, మన జీవితానికి సాఫల్యము, సార్ధక్యము చేకూర్చగలదని సారాంశము.*

                                    *****

                       *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: