6, అక్టోబర్ 2020, మంగళవారం

**శ్రీమద్భాగవతము**

 **దశిక రాము**




 తృతీయ స్కంధం -39


సాంఖ్యయోగంబు 


ఈవిధంగా నిష్కళంకజీవనుడైన మహాత్ముడు సర్వేశ్వరునిపై నిలిపిన భావసంపద కలవాడై సమధిక సద్భక్తితో మిక్కిలి మోదంతో పులకించిన శరీరం కలవాడై ఎంతో కుతూహలంతో సంతోషబాష్పాలు పొంగిపొరలగా ఆనందం అనే సముద్రంలో మునిగి విషయ బంధాల నుండి విముక్తి కలిగించే నా స్వరూప సంబంధాన్ని చేకూర్చుకొని ఉత్తమ ధ్యానంతో అన్నింటిని మించిన వెలుగునందు మనస్సును నిల్పగలుగుతాడు. హృదయ పూర్వకంగా మోక్షాన్ని అపేక్షిస్తాడు.అందువల్ల మోక్షాన్ని అపేక్షించే మహానుభావుని మనస్సు సంసార బంధాలనుండి విముక్తమవుతుంది. దానిలో భగవంతునికంటె వ్యతిరిక్తమైన భాగానికి తావు లేదు. భగవంతునికంటె అన్యం కన్పించదు. ఇటువంటి వైరాగ్యం వల్ల పురుషునకు అనన్యస్థితి ప్రాప్తిస్తుంది. చిన్న వెలుగు తనకంటే పెద్దదైన వెలుగుతో కలిసినప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అదే విధంగా జీవుడు తన శరీరం, మనస్సు మొదలైన వానియందు వేరే భావన లేక సర్వం భగవన్మయంగా సంభావిస్తాడు. ఆ అనన్యభావమే మోక్షం.ఏ పురుషుడు తన జీవితానికి అంతిమ గమ్యాన్ని భావిస్తూ అన్య విషయాలనుండి నివృత్తమైన చిత్తంతో ఆత్మజ్ఞానమందు నిశ్చలమైన నిష్ఠ కలవాడై సుఖ దుఃఖాలను లక్ష్యపెట్టక అవి అహంకార ధర్మాలని గుర్తించి వర్తిస్తాడో ఆ పురుషునికి ఆత్మతత్త్వం సాక్షాత్కరిస్తుంది. అటువంటి వానినే జీవన్ముక్తుడని ప్రాజ్ఞులంటారు. అటువంటివాడు తన శరీరం నిలుచుండటం, కూర్చుండటం, తిరగడం మొదలైనవి ఏవీ తెలియకుండా ఉంటాడు. తల్లీ! ఇంకా విను.మద్యపానం చేసి మైకంలో ఉన్న మనుష్యుడు పైబట్టను మరచిపోయి ప్రవర్తించిన విధంగా జీవన్ముక్తుడైనవాడు తన శరీరం దైవాధీనమనీ, అది ఎప్పుడో నశించిపోయేదనీ భావించి ఆత్మతత్త్వాన్ని అవగతం చేసుకొని ఉపేక్షాభావంతో ఉంటాడు. అంతేకాకుండా ఏకాగ్రభావంతో ఆత్మ సాక్షాత్కారం పొందినవాడై కర్మఫలం అనుభవింప వలసినంత వరకు భార్యాపుత్రులతో కూడిన ఈ సంసారాన్ని స్వప్నంలో లాగా అనుభవిస్తాడు. తర్వాత కలనుండి మేల్కొన్నవానిలాగా ఈ సంసార బంధాలన్నీ వదలిపెట్టి వర్తిస్తాడు.పుత్ర మిత్ర కళత్రాదులకంటె మానవుడు వేరైనట్లు, మిణుగురుల కంటే, కొరవుల కంటే, పొగ కంటే అగ్ని వేరైనట్లు దేహం కంటే జీవాత్మ వేరై ఉంటుంది. పంచభూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణము, వీటితో భాసించే ఈ ప్రకృతి రూప పరమాత్మ కంటే ఆత్మ వేరుగా ఉంటుంది. ఆ ఆత్మ బ్రహ్మ సంజ్ఞతో ద్రష్టయై ఒప్పుతూ అఖిల భూతాలలో తననూ, తనలో అఖిల భూతాలను

కనుగొంటుంది. ఇంకా సర్వ భూతాలలోను అనన్య భావంతో, సర్వత్ర ఆత్మగా వెలుగుతూ ఉంటుంది. ఆ దివ్యజ్యోతి ఒక్కటే అయినా పెక్కింటివలె కనిపిస్తుంది. ప్రకృతిగతమైన ఆ ఆత్మ దేవతలు, మనుష్యులు, జంతువులు, స్థావరాలు మొదలైన వేరువేరు యోనులలో వేరువేరు భావాన్ని పొందుతూ భిన్న గుణాలతో భిన్నంగా వెలుగుతూ ఉంటుంది. నిజానికి దేహాలు మాత్రమే వేరు కాని వెలుగు ఒక్కటే.ఆత్మ సదసదాత్మకమై, భావాతీతమై, ఆత్మీయ భావంతో వర్తిస్తూ తన ఉజ్జ్వల తేజస్సుతో ప్రకృతిని తిరస్కరించి లోబరచుకుంటుంది.

ఈ ఆత్మ నిజస్వరూపంతో విరాజిల్లుతుంటుంది” అని కపిలుడు తెలియజెప్పగా విని దేవహూతి మళ్ళీ ఇలా అన్నది. “అసత్యమైన దేహంపై ఆత్మాభిమానం పెంచుకొని మూర్ఖుడై, కర్మలపై ఆసక్తి కలిగిన బుద్ధితో భ్రమించి, సంసారమనే పెనుచీకటిలో చాలాకాలం నిద్రామత్తుడైన జనుని మేల్కొల్పడం కోసం యోగభాస్కరుడవై పుట్టిన పుణ్యాత్ముడవు నీవు. కాబట్టి ఓ మహాత్మా! మహదాది భూతాలకు, ప్రకృతి పురుషులకు ఉన్న వేరువేరు లక్షణాలను చెప్పావు. వాటి వాటి స్వరూపాలను వివరించావు. ఆ విధంగానే సాంఖ్యయోగాన్ని అనుసరించి భక్తియోగ మహత్త్వాన్ని వెల్లడించు. పురుషుడు భక్తియోగం ద్వారా సమస్త ప్రపంచంనుండి విరక్తుడయ్యే విధం వివరించు. ప్రాణిలోకానికి అనేక విధాలుగా ఉండే సంసారానికి పరాపరుడవై కాలస్వరూపుడవై ఉన్న నీ స్వరూపాన్ని ఎరిగించు. కాలస్వరూపుడవైన ఏ నీ భయంవల్ల మానవులు పుణ్యకర్మలు చేస్తారో వానిని సవిస్తరంగా తెలిసేలా చెప్పు” అని అడుగగా దేవహూతితో కపిలుడు ఇలా అన్నాడు.

 


భక్తియోగంబు 


పద్మాలవంటి విశాలమైన కన్నులుగల తల్లీ! విను. ప్రజల సంకల్పాలను బట్టి ఆశయాలను బట్టి భక్తియోగం సిద్ధిస్తుంది. అదికూడ అనేకవిధాలుగా ఉంటుంది.వానిని వివరిస్తాను. భక్తి తామసం, రాజసం, సాత్త్వికం అని మూడు విధాలు. వానిలో తామసభక్తి ఎలాంటిదంటే…ఇతరులను హింసిస్తూ ఆడంబరం, అసూయ, రోషం, అజ్ఞానం, భేదబుద్ధి కలిగి నన్ను భజించేవాడు తామసుడు. అట్టి వానిది తామసభక్తి.సౌజన్యఖనీ! ఆడంబరంతో కూడిన పూజాద్రవ్యాలతో అష్టైశ్వర్యాలకోసం, పేరుప్రతిష్ఠలకోసం పూజనీయుడనైన నన్ను పూజించడం రాజసభక్తి అవుతుంది.సాటిలేని పాపాలను పరిహారం చేసేది భగవద్భక్తి ఒక్కటే అనే విశ్వాసంతో, భజింపదగిన పవిత్ర చరిత్రుడు భగవంతుడే అని మనస్సులో భావిస్తూ, సమస్త కార్యాలను భగవదంకితంగా ఆచరిస్తూ, లోకులకు మేలు చేకూర్చే పనులు చేస్తూ ఉండటం సాత్త్వికభక్తి.మనుపుత్రికవైన ఓ తల్లీ! నా గుణాలను ఆలకించిన మాత్రాన ప్రాప్తమైన భక్తితో ఉదాత్తచిత్తులైన కొందరు పాపరహితుడనూ, అనంత కళ్యాణగుణ సహితుడనూ, పరమేశ్వరుడనూ అయిన నన్ను ఆశ్రయిస్తారు. అటువంటి ఉత్తముల మనోభావాలు సముద్రాన్ని సంగమించిన గంగానది మాదిరిగా చక్కగా సఫల మౌతాయి.నిందనీయాలైన గుణాలు లేనివాడనైన నాయందు నిలుపవలసిన భక్తి లక్షణాలను తెలిపాను. నన్ను వదలకుండా, హేతువులు వెదకకుండా చేసే వ్రతమే అచంచలమైన భక్తి అని భావించు.కోరికలు లేకుండా నన్ను భజించే నా భక్తులకు పైన చెప్పిన భక్తియోగం సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అనే ముక్తులకు సాధనమౌతుంది. అందువల్ల మహాత్ములైనవారు తమ కోర్కెలు తీర్చేవే అయినా నా ఆరాధనకు దూరమైన ఏ సాధనలనూ చేయరు. దీనినే ఆత్యంతిక భక్తియోగం అని అంటారు. సత్త్వరజస్తమోగుణాలకు అతీతమైన ప్రవర్తనగల మానవుడు నాతో సమానమైన రూపాన్ని పొందుతాడు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.స్నాన సంధ్యాది నిత్యకర్మలందు, జగత్కళ్యాణార్థం చేసే యజ్ఞయాగాది నైమిత్తిక కర్మలందు అత్యంత శ్రద్ధాసక్తులు కలిగి ఉండడం, గురువులను పెద్దలను గౌరవించడం, పాంచరాత్రాగమంలో చెప్పబడిన ప్రకారం శ్రీహరిని నిష్కామ బుద్ధితో ఆరాధించడం, ఉత్సాహంతో నా రూపాన్ని దర్శించడం, కీర్తించడం, పూజించడం, నమస్కరించడం, స్మరించడం, నా చరిత్రలు వినడం, కర్మలలో చిక్కుకోకుండా ఉండడం, గొప్పవారిపైన ఆదర గౌరవాలు, తనకన్న తక్కువ వారిపైన దయాదాక్షిణ్యాలు, తనతో సమానులపైన స్నేహానురాగాలు కలిగి ఉండడం, యమ నియమాలను పాటించడం మొదలైన సుగుణాలను అలవరచుకోవాలి. యోగాభ్యాసం చేయాలి. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలను తాను తెలుసుకొని ఇతరులకు తెలియజేస్తూ ఉండడం... (చేయాలి).ఇంకా...విష్ణువు యొక్క కళ్యాణ గుణాలను కీర్తించేవాడై, చిత్తశుద్ధితో అనురక్తితో భగవద్భక్తులను సేవించడం, అహంకారం లేకుండా నిశ్చల హృదయంతో జీవించడం... (చేయాలి).ఈ మొదలైన సుగుణాలతో భగవంతుని ఉద్దేశించి చెప్పిన ఇటువంటి ధర్మాలతో కూడి పవిత్రమైన మార్గంలో ఆసక్తమైన మనస్సు కలవాడైన పుణ్యాత్ముడు ఎల్లప్పుడు...(ఆ పుణ్యాత్ముడు) అనంత కళ్యాణగుణ సంపన్నుడనైన నన్ను పొందుతాడు. గాలి ద్వారా పువ్వుల సుగంధం ఘ్రాణేంద్రియాన్ని ఆశ్రయించిన విధంగా ఇతరమైన ఎటువంటి అండదండలు లేకుండానే అనాయాసంగా నన్ను చేరుకుంటాడు.ఎల్లప్పుడు అఖిల జీవుల హృదయ కమలాలలో అంతర్యామినై ఉండే నన్ను అలక్ష్యం చేసి కేవలం నా విగ్రహాలను మాత్రమే ఆడంబరంగా పూజిస్తూ లోకాన్ని మోసగించేవాడు మూర్ఖుడు. అచంచలమైన భక్తితో నన్ను ఆరాధింపని వాని పూజలు బూడిదలో పోసిన హోమద్రవ్యాలవలె నిరర్థకాలు. కమలాలవంటి కన్నులు గల తల్లీ! నేను సమస్త జీవులలో అంతర్యామినై ఉన్నాను. అటువంటి నాయందు, మిగిలిన జీవరాసుల యందు భేదదృష్టి కలిగి మాయావులై విరోధభావంతో మెలిగేవారికి మనశ్శాంతి దొరకదు. అటువంటి కుటిలాత్ములు ఎంతో ద్రవ్యం వెచ్చించి అట్టహాసంగా, ఆడంబరంగా నాకు పాదపూజలు చేసినా నేను తృప్తిపడను. సంతోషించను” అని చెప్పి సతీమతల్లియైన తల్లితో ఉత్తమగుణధుర్యుడైన కపిలుడు ఇలా అన్నాడు.తల్లీ! విను. చైతన్యం లేని రాళ్ళురప్పలకంటే చైతన్యంగల చెట్లుచేమలు శ్రేష్ఠమైనవి. స్పర్శజ్ఞానంగల చెట్లకంటె రసజ్ఞానం (రుచిచూచే శక్తి) గల క్రిమికీటకాలు శ్రేష్ఠమైనవి. వీనికంటె గంధజ్ఞానం (వాసన చూసే శక్తి) కలవి మరీ శ్రేష్ఠం. వీనికంటె శబ్దజ్ఞానం (వినగల శక్తి) కలవి గొప్పవి. ఇలాంటి శబ్దజ్ఞానం కలవాని కంటె కూడా రూపజ్ఞానం (చూడగల శక్తి) కల కాకులు మొదలైనవి ఎంతో శ్రేష్ఠమైనవి. వానికంటే కూడా అనేక పాదాలు కల జెఱ్ఱులు మొదలైనవి శ్రేష్ఠం. వానికంటె...బహుపాదుల కంటె) చతుష్పాత్తులు (నాలుగు పాదాలు కల ఆవులు మొదలైనవి) గొప్ప. వీనికంటె రెండుపాదాలు గల మానవులు గొప్ప. వీరిలో నాలుగు తెగలున్నాయి. ఆ తెగలలో...(ఆ నాల్గు తెగలలో) బ్రాహ్మణులు ఉత్తములు. వీరికంటే వేదవేత్తలు శ్రేష్ఠులు. వీరికంటె వేదార్థం తెలిసినవాళ్ళు గొప్పవారు. వీరికంటె శాస్త్ర సంబంధమైన సందేహాలను చక్కగా తీర్చగల మీమాంసకులు అధికులు. వీరికంటె స్వధర్మపరాయణులు ఉత్తములు. వీరికంటే దేనిపైనా ఆసక్తిలేని నిస్సంగులు గొప్పవారు. వీరికంటె సద్ధర్మం ఆచరించేవారు అధికులు. అటువంటి ధర్మికులకంటే సర్వధర్మాలనూ, సర్వసంపదలనూ, సర్వబాధ్యతలనూ నాకే అర్పించి, అనన్యభావంతో సర్వత్ర సమవర్తనుడై జీవితం గడిపే పుణ్యాత్ముడు

ఎంతో గొప్పవాడు అటువంటి వానిని ఆ పుణ్యాత్ముని సమస్త ప్రాణికోటి ఎంతో గౌరవభావంతో చూచి, ఎప్పుడూ అభినందిస్తూ సంతోష సముద్రంలో మునిగి తేలుతుంటారు.అప్పుడు దేవుడు జీవుని స్వరూపాన్ని ఏర్పరచుకొని అందులో ప్రవేశించి ఉంటాడు. అటువంటి జీవునిలో ఉన్న దేవుని యోగమార్గంతో కాని, భక్తిమార్గంతో కాని పురుషుడు పొందగలుగుతాడు. ఆ పరమాత్మ ప్రకృతి పురుషులతో కూడి కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ పరమాత్మయే ప్రకృతినుండి వేరై కర్మలు చేయనివాడై కూడా ఉంటాడు. ఇదే భగవంతుని రూపం. ఇది జీవులందుగల పరస్పర భేదాలకు ఆధారమై అత్యంత శక్తిమంతమై ఉంటుంది. అదే కాలం అనబడుతుంది. అటువంటి కాలం మహదాది తత్త్వాలకు, మహత్తత్త్వాభిమానులకు భీతి గొల్పుతుంది. అందుకనే అది అన్ని జీవులకు ఆశ్రయమై, ఆ జీవులలో ఉంటూ ఒక ప్రాణిచేత మరొక ప్రాణిని గ్రసింపజేస్తుంది. భగవంతుడైన విష్ణువు యజ్ఞఫల ప్రదాతయై, ఆ జీవులను స్వాధీనంలో ఉంచుకొని, వాటిని పాలించే మహారాజుగా ప్రకాశిస్తూ ఉంటాడు. అతనికి ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు బంధువు అంటూ ఎవరూ లేరు. అటువంటి విష్ణువు అందరిలోను ఆవేశించి అప్రమత్తుడై ఉంటాడు. ప్రమత్తులైన వారిని అణచివేస్తుంటాడు. ఆ పరమాత్ముని గురించిన భయం వల్లనే గాలి వీస్తుంది. సూర్యుడు ఎండ కాస్తాడు. ఇంద్రుడు వాన కురిపిస్తాడు. నక్షత్రాలు వెలుగుతాయి. చంద్రుడు వెన్నెలలు వెదజల్లుతాడు. ఆయా కాలాలలో చెట్లూ, తీగలూ మొదలైనవి ఓషధులతో కూడి పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. నదులు ప్రవహిస్తాయి. సముద్రాలు హద్దు మీరకుండా ఉంటాయి. అగ్ని మండుతుంది. భూమి కొండల బరువుకు క్రుంగకుండా ఉంటుంది. ఆకాశం అందరికీ చోటిస్తుంది. మహత్తత్త్వమే ఈ లోకానికి మూలభూతమైనది. ఏడు ఆవరణాలు గల ఈ లోకం అనే తన దేహాన్ని విస్తరింపచేస్తుంది. బ్రహ్మ మొదలైనవాళ్ళు సర్వేశ్వరుని ద్వారా ఈలోకసృష్టి నిమిత్తం నియమింపబడినవారై ప్రతిదినం ఆయా సృష్టికార్యక్రమాలలో జాగరూకులై ఉంటారు. తండ్రులు కుమారులకు జన్మనిస్తారు. కాలస్వరూపుడైన యముడు మృత్యుదేవత సాయంతో జీవులను చంపుతూ ఉంటాడు. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం అంతా భగవంతుని కట్టడిలో ఉంటుంది” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు. గాలిలో ఎగిరే మేఘానికి గాలిశక్తిని తెలుసుకొనే శక్తి ఉండదు. అదేవిధంగా సకల లోకేశ్వరుడైన భగవంతుని శక్తిని గుర్తించే శక్తి ఎవ్వరికీ ఉండదు.అమ్మా! విను. దేనివల్ల సుఖం దొరుకుతుందో అది దొరకకపోవడం వల్ల జనులు దుఃఖాలపాలు అవుతున్నారు. ఇదంతా భగవంతుని ఆజ్ఞానుసారం జరుగుతూ ఉంటుంది. ఇంకా...అశాశ్వతాలైన ఇల్లు, పొలం, పశువులు, ధనం, సంతానం, భార్య, బంధువులు మొదలైన వస్తువులే శాశ్వతం అని నమ్మి దుష్టబుద్ధియైన మానవుడు అనేకప్రాణుల శరీరాలను పొందుతూ వివిధ యోనుల్లో జన్మిస్తూ ఉంటాడు. వానిపట్ల విరక్తి చెందడు. నరకం అనుభవించిన తర్వాతకూడా దేహి తన దేహాన్ని వదలక అదే ఎంతో సుఖప్రద మైనదిగా భావించి దానినే అంటిపెట్టుకొని ఉంటాడు. అంతేకాక అతడు దేవుని మాయకు లొంగినవాడౌతాడు.కుమారులు, భార్య, పశువులు, ధనం, ఇల్లు మొదలైన వానిని రక్షించుకొనే ఆలోచనలతో దినదినమూ వేగిపోతూ క్రాగిపోయిన దేహంతో క్రుంగి కృశిస్తూ...తెలివిలేనివాడై పాపకార్యాలను ఆచరిస్తూ ఇల్లాలి సరస సల్లాపాలతోనూ, పిల్లల ముద్దుమాటలతోనూ మురిసిపోతూ (ఉంటాడు). ఇంకా...విను. ఇంద్రియాలకు లొంగి వాటి కుటిల గుణాలవల్ల కలిగే దుఃఖాన్నే పరమసుఖంగా భావించి, ఆ ఇంద్రియాలపై మరింత అభిమానాన్ని పెంచుకుంటూ.ఎప్పుడూ తాము సంపాదించుకొన్న ధనాన్ని చూచుకొని పొంగిపోతూ, కుటిలబుద్ధి కలవాడై ఇంతరులను హింసిస్తూ చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ, తనవాళ్ళను....పోషించుకుంటూ, వారు తినగా మిగిలినది తాను తింటూ, అప్పటికీ సంసారాన్ని ఈదలేక, బ్రతుకు బరువు భరించలేక స్వార్థపరుడై జవసత్త్వాలు కోల్పోయి, కుటుంబాన్ని పోషించడానికి...శక్తి చాలక, అదృష్టం సన్నగిల్లి, కుటిల బుద్ధితో ఏ విధమైన పనులూ చేయలేని సోమరిపోతై పనికిరాని ప్రయత్నాలు చేస్తూ, పరమ మూర్ఖుడై దీనంగా తిరుగుతూ ఉంటాడు. రైతు బక్కచిక్కిన ముసలి ఎద్దును అసహ్యించుకొన్నట్లు ఆ దరిద్రుణ్ణి చూచి అతని ఆలుబిడ్డలు ‘ఇతడు అశక్తుడు, ఈ పనికిమాలినవాడు మనలను పోషింపలేడు’ అని ఏవగించుకొంటారు. ఈవిధంగా అతడు ఎక్కడా ఏ విధంగానూ సుఖంలేక ఇన్నాళ్ళూ తాను ఎవరినైతే తిండిపెట్టి పోషించాడో వారు పెట్టే తిండి తింటూ, ముసలితనంతో మూలుగుతూ బాధగా బరువుగా బ్రతుకును ఈడుస్తూ (ఉంటాడు).రూపం మారిపోగా, బంధువులందరూ ఏవగిస్తుండగా, అంత్యకాలం సమీపించగా, గడప దాటి వెళ్ళలేక కుక్కలా తింటూ, శరీరంలో వణుకు పుట్టుకురాగా...నానావిధాలైన వ్యాధులు బాధించగా, జఠరాగ్ని మందగించగా, తిండి పడిపోయి, ఆయాసం అతిశయించి, మిడిగ్రుడ్లు పడి, కంఠనాళం మూసుకుపోయి, గొంతులో గురక పుట్టి, బంధువుల అందరిమధ్య పండుకొని, వారు తనను పలుకరిస్తూంటే బదులు పలకడానికి నోరు పెకలక, భయంకరాలైన యమపాశాలు శరీరానికి చుట్టుకోగా, భార్యను పిల్లలను ఎవరు పోషిస్తారా అనే దిగులుతో శిథిలమై పోయిన ఇంద్రియాలతో తెలివి కోల్పోయినవాడై గిలగిలలాడుతూ...అంతలో మృత్యువు ముంచుకురాగా మిక్కిలి భయంకరమైన రూపాలతో తీక్షణమైన చూపులతో ఇద్దరు యమదూతలు తనముందు వచ్చి నిలబడగా, వాళ్ళను చూచి గుండెలు పగిలి మలమూత్రాలను విడుస్తూ, యమపాశాలు కంఠాన్ని బంధించగా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి యాతనాశరీరంలో ప్రవేశించి, పొడవుగా ఉండి నడవడానికి వీలులేని మార్గంలో యమభటులు బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళుతుంటే, రాజభటులవెంట అపరాధిలా శిక్షలు అనుభవించడానికి సంసిద్ధుడై వెళ్తూ...అక్కడ కుక్కలు పీక్కుతింటుంటే మూర్ఛపోతాడు. యమభటులు భయంకరంగా అరుస్తూ చేసే అదలింపులకు, బెదరింపులకు మనస్సు కలత చెందగా, శరీరమంతా కంపించిపోగా, పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని పరితపిస్తూ...ఎడతెగని ఆకలి దప్పులతో లోలోపల వ్యాకులపడుతూ, సుడిగాలుల మధ్య సోలిపోతూ, భగభగమండే సూర్యకిరణాలకు వేడెక్కి మాడిపోతున్న ఇసుక ఎడారుల్లో కాళ్ళు కాలుతూ నడవలేక నడుస్తూ, కొరడా దెబ్బలకు బొబ్బలెక్కిన వీపుతో శిథిలమైన అవయవాలతో మార్గమధ్యంలో అచ్చటచ్చట మూర్ఛిల్లుతూ, దిక్కుమాలిన నీళ్ళలో మునిగితేలుతూ, పాపంలా క్రమ్ముకొన్న చిమ్మచీకటిలోనుంచి తొంబది తొమ్మిది వేల యోజనాల దూరంలో ఉన్న యమపట్టణానికి యమభటులచేత తీసుకొని పోబడతాడు.ఈవిధంగా మహాపాపి యైనవాడు మూడు ముహూర్తాల కాలంలో, సామాన్యదోషి యైనవాడు రెండు ముహూర్తాల కాలంలో వెళ్ళి యాతనలను పొందుతారు. ఆ యమలోకంలో...ప్రమత్తుడైన ఆ పాపాత్ముని పట్టుకొని కొరవులతో కాలుస్తారు. చురకత్తులు గ్రుచ్చుతారు. భగభగ మండే మంటలో పడవేస్తారు. ఒళ్ళంతా చిల్లులు పడేటట్లు చితుకబొడుస్తారు.వేడినీళ్ళలో ముంచుతారు. పెద్ద గదలతోను, కత్తులతోను మొత్తుతారు. పొట్టలోని ప్రేవులను త్రెంచుతారు. మదపుటేనుగులతో త్రొక్కిస్తారు. పాములచేత క్రూరంగా కరిపిస్తారు. బండరాళ్ళు మీదకు విసరుతారు. అతని దేహాన్ని కోసి ఆ కండలను ఆ పాపాత్మునిచేతనే తినిపిస్తారు. పాపాత్ముడు సంసార పోషణకై పడరాని పాట్లు పడుతూ, తన పొట్టను నింపుకొంటూ, అధర్మమార్గంలో నడుస్తూ, ప్రాణులను హింసిస్తూ మహాపాపం మూటకట్టుకొని యమలోకానికి పోయి అక్కడ తన సొమ్మును పోగొట్టుకొని మొరపెట్టుకునే దిక్కులేని దీనునివలె ఆక్రోశిస్తూ ఒకదాని వెంట ఒకటిగా తామిస్రం, అంధతామిస్రం, రౌరవం మొదలైన నరకాలలో పడి సహింపరాని పెక్కు బాధలను అనుభవిస్తూ, తన పాపాలన్నీ తరిగిపోయిన తరువాత మళ్ళీ మనుష్యజన్మను పొందుతాడు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: