6, అక్టోబర్ 2020, మంగళవారం

శ్రీరామరక్ష

 

              శ్రీ రామ రక్ష 

           ..................... 

పిల్లలకు తల్లులు స్నానం చేయించాక, " శ్రీరామరక్ష " అంటూ నీళ్లు చుట్టూ తిప్పి వేస్తుంటారు. 

శ్రీరామ రక్ష , అన్న పదం, బిడ్డలకు కోరుకుంటు చేసే ప్రార్ధనా లేక ఇంకేమైనా ప్రాశస్త్యం ఉందా? 

తల్లి దైవ సమానురాలు. ఆమె ఋణం తీర్చుకునేది కాదు. 

అలాటి దేవతా మూర్తి అయిన తల్లి అనే శ్రీరామ రక్ష కు అర్ధం ఏమైయుంటుంది? 


   శ్రీరామ అనగానే మనకు రామాయణం లోని రాముడు గుర్తుకు వస్తాడు. తల్లి దీవెన అనగానే కౌసల్యాదేవి గుర్తు కొస్తుంది. 

కౌసల్య పట్టపురాణియే. 

రాణీవాసం లోని కష్టాలు రాణులకే ఎరుక. కౌసల్య దేవి కూడా ఈ కష్టాలకు అతీతం యేమీ కాదు. 

ఆమె పడిన కష్టాలు చెప్పుకొనే అవకాశం రాలేదు. కానీ ఆమె మనసులో గూడుకట్టుకుని యున్న భాధను కుమారుడైన రాముడితో 

పంచుకుంటుంది. అది, కూడా శ్రీరాముడు వనవాసానికి వెళుతూ, తల్లి ఆశీర్వాదము కోరినప్పుడు.

కౌసల్య, భోరున విలపించింది. 

తాను గొడ్రాలుగా మిగిలియున్నా ఈ భాధ, దుఃఖము ఉండేవి కావని వాపోతుంది కపటమెరుగని, కష్టాలు ఎరుగని బిడ్డ , వనవాస కడగండ్లు ఊహించుకొని విలవిలా ఏడ్చింది. 

"యది పుత్ర న జాయేధా మమ శోకాయ రాఘవ 


న స్మ దుఃఖ మతో భూయ:పశ్యేయమహ మప్రజా:


"న దృష్ట పూర్వం కళ్యాణం సుఖం వా పతి పౌరుషే 

అపి పుత్రేపి పశ్యేయ మితి రామాస్థితం మయా "


రామా "కైకేయి మీద వున్న ప్రత్యేక ప్రేమతో మీ తండ్రి నన్ను అనేక విధాల నిగ్రహించాడు. నిరాదరంగా, స్వేచ్ఛ లేకుండా కూడా నేను జీవించాను. భర్త అధికారం లొ ఉండగా, యే సుఖానికి నోచుకోలేదు. యే శుభానికి నోచుకోలేదు. 

నీవు పుట్టిన తరువాత కూడా, నా స్వేచ్ఛ అంత మాత్రమే. నీవు పెద్ద అయిన తరువాత మా కష్టాలు తీరుతాయని, అనుకున్నాను. ఇపుడు, నీవు లేని ఈ అంతః పురం లొ జీవనం సాగించలేను. కైకేయి మాటలు పడుతూ ఉండాల్సిన, విషయం, ఊహించుకొనాలంటేనే 

ఆందోళనగా వుంది. నీవు దగ్గరవుంటే నాకు ధైర్యము. 

నా వ్రతాలు, పూజలు వ్యర్థం అయినాయి . నేనూ నీతో అడవులకు వస్తానయ్యా !అని గుండె బ్రద్దలు అయ్యేలా ఏడ్చింది. 

ఆ సందర్భం లొ అక్కడ దైవత్వం లేదు. మానవత్వం వుంది. మానవత్వం వుండే మనుషులు పడే భాధ వ్యక్త మవుతూ ఉంది. మానవత్వం వుండే వారికే ఆ బాధ అర్ధమవుతుంది. 


కొడుకు నిర్ణయాన్ని మార్చలేక, కొడుకు మరింతగా తనను గురించి భాధ పడగూడదని, కౌసల్య దేవి దుఃఖాన్ని దిగమింగి కొని, మంగళశీస్సులు ఇస్తుంది.


తన బిడ్డ సుఖం గావుండాలని, దేవతలు, ప్రకృతి తన బిడ్డను రక్షించాలని ప్రార్ధన చేస్తుంది. 

శ్రీరాముడి క్షేమం కోసరం, తల్లి  

కౌసల్య ఇచ్చిన ఆశీర్వచనములు, ఆమెకట్టిన "విశల్య కరణి "రక్షా భందనమే, నేటికీ "శ్రీ రామ రక్ష గా ప్రసిద్ధి పొందినది. ప్రతి తల్లి, ఒక కౌసల్య

గా బిడ్డలకు ఆ శ్రీరామ రక్షను స్నానం సమయమున ఆశీర్వాదరూపములో ఇస్తున్నది. 

కౌసల్య దేవి ఆరోజు ఇచ్చిన ఆశీస్సులు చాలా గొప్పవి.


"యన్మఙ్గలం సహస్రాక్షే సర్వదేవనమస్కృతే 


వృత్ర నాశే సమభవత్ తత్తే భవతు మంగళం "


(రామచంద్రా !వృత్తాసుర సంహార సందర్భాన దేవేంద్రునికి లభించిన మంగళాశిస్సులు, నీకును లభించుగాక )


"యన్మఙ్గలం సుపర్ణస్య కల్పయత్ పురా 

అమృతం ప్రార్ధయానస్య తత్తే భవతు మంగళం "


"అమృతమును తీసుకొని వచ్చు సందర్భమున గరుత్మంతుడు వినతామాత నుండి పొందిన మంగళములన్నియు నీకు ప్రాప్తిన్చుగాక "


"అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో 

వజ్రధరస్య యత్ 

అదితిర్మoగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం "


(అమృతము లభించుటకై దైత్యులను హతమార్చిమహేంద్రునికి అదితి ప్రసాదించిన సమస్తమంగళములు నీకు అబ్బుగాక !)


త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమిత తేజసః 

యదాసీన్మఙ్గలం రామ !తత్తే భవతు మంగళం "


(మూడు అడుగులతో ముల్లోకములు ఆక్రమించి, బలిని 

సుతల లోకమునకు అధిపతి ని చేసిన శ్రీ మహావిష్ణువు కు అబ్బిన శుభములన్నియు నీకు లభించుగాక !


"ఋతవస్సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చ తే 


మంగళాని మహాబాహో !దిశంతు తన సర్వదా "


(రుతువులు, సాగరములు ద్వీపములు, వేదములు, సమస్తలోకములు, దశదిశలు నీకు శుభములు ప్రసాదించు గాక !


కౌసల్య దేవి, శ్రీరాముని పై విధముగా ఆశీర్వదించి , రక్షకట్టి,, శ్రీరామునికి ప్రదక్షిణము చేసినది.


మాతృ దేవత రక్షామంత్రం ఎంత గొప్పదో, ఎలాఫలిస్తుందో మనం చూడవచ్చు 


క్షీరసాగర మధన సమయంలో 

దేవతలు పొందిన తల్లి రక్ష నీకు  

ఉండుకాక !అని ఇచ్చిన ఆశీస్సు ఫలితంగా దేవతలు వానర రూపాలతో శ్రీరాముని కి సహాయపడడం జరుగుతుంది 


స్వర్గలోకం నుండి అమృతం తేవడానికి, అదితి గరుత్మంతునికి ఇచ్చిన ఆసిస్సులు నీకు ఉండాలని, కౌశల్య దేవి ఇచ్చిన ఆశీస్సులు, ఫలితంగా, గరుత్మంతుడు, తానంతట తాను, యుద్ధరంగానికి వచ్చి, నాగ బంధాల నుండి , శ్రీరామ, లక్ష్మణులను విడిపిస్తాడు 


వామనుడికి, తల్లి ఇచ్చిన ఆసిస్సులు నీకు లభ్యపడాలని తల్లి కౌసల్య ఇచ్చిన ఆశీస్సులతో ప్రకారం, మైరావణుడు సంహారం జరిగి, పాతాళ లోకం నుండి శ్రీరాముడు రక్షింపబడుతాడు. 


సంజీవని మూలికలు అందించి ప్రకృతి, సేతు నిర్మాణానికి సహాయ మందించి, సాగరుడు, కౌసల్య ఆశీస్సులను, నిజం చేశారు. 


కౌసల్య తల్లిగా బిడ్డకు ఇచ్చిన రక్ష ఎలా పనిచేసిందో యుద్ధకాండ ఋజువు చేసింది. 


మనం గూడా మన పిల్లలకు ఆయా సందర్భాలలో, ఆ శ్లోకాలతో

దీవెనలు ఇవ్వడం ఆనవాయితీగా 

చెయ్యడం వారికి శుభస్కరం గా

ఉండగలదు. 


రామాయణ అయోధ్య కాండ లొ ఈ శ్లోకాలు వున్నాయి 


మాతృ దీవెన ఎంతబలీయమైందో,

ఈ ఘట్టాలు ఋజువు చేస్తాయి. 


        🙏🙏🙏

కామెంట్‌లు లేవు: