6, అక్టోబర్ 2020, మంగళవారం

వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 19 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘’


ఈ నామములో అమ్మవారి కన్నుల గురించి మాట్లాడుతున్నారు. అమ్మవారి నేత్ర వైభవము కాంతి కదలికలతో ప్రవాహముతో ఉన్న సరస్సుగా భావనచేస్తే అందులో ఉండే చేపపిల్లలే ఆమెకన్నులు. అక్షరవర్గము మీద అధికారమున్న వశిన్యాదిదేవతల అనుగ్రహము లేకపోతే నోటివెంట ఒక్కమాట పలకలేరు. సంస్కృతములో కన్నులను అక్షి అని, మీనములని అంటారు కనక మీనాక్షి అయింది. స్తోత్రములో ఎక్కడా మీనాక్షి అన్న నామము అనలేదు. కన్నులు చేపల్లా ఉంటాయి కనక మీనాక్షి అని చెప్పకనే చెప్పారు. ఇందులో తెలుసుకోవలసిన నిగూఢమైన రహస్యము ఒకటి ఉన్నది. పైకి కనిపించే అర్థము చూస్తే ఒక స్థాయిలో అనుభవించడము జరుగుతుంది. బాగా ధ్యానము చేసి ఆలోచిస్తే దొరికే అమృతము వేరుగా ఉంటుంది. చేపలతో ఎందుకు పోల్చారని పరిశీలన చేస్తే – చేపలో మూడులక్షణములు ఉంటాయి. చేపయే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ‘సృష్టికర్త’ - బాహ్యములో స్త్రీ పురుష సంపర్కము చేత ఆయా జాతులు వృద్ధి పొందుతాయి. చేపలలో మాత్రము స్త్రీ పురుష మీనముల సంపర్కము ఉండదు. చేపలను కనాలన్న కోరిక కలగగానే ఆడచేప మగచేపవంక ఆ భావనతో చూస్తుంది. చూడగానే ఆడచేపకు సంతానము పెంచకలిగిన శక్తి ఉద్బుదమయి చేపకి పిల్లలు వస్తాయి. పోషించవలసి వస్తే స్తన్యము ఇవ్వదు. ‘స్థితికర్త’ - తన చూపులతో పోషిస్తుంది. సృష్టిలో ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఇంకా ఆహారము తినడము చేతకాని పిల్ల అమ్మవంక చూస్తే తల్లిచేప మీ ఆకలి తీరుగాక అన్నట్టుగా తలనుతిప్పి చూస్తే ఆ చేపపిల్లల కడుపు నిండిపోతుంది. ‘ప్రళయకర్త’ - చేపకు ఆహారము చేపే. పెద్దచేప చిన్నచేపను తనజాతిదే అని తెలిసుండి తినేస్తుంది. అమ్మవారి కన్నులు సృష్టించి, పోషించి, తినేసిన చేపలయితే ఆవిడే తన చూపులతో సృష్టి చేస్తూ, పోషిస్తూ, లయం చేస్తున్నది. మీనాక్షి అన్న నామము ప్రకటనముగా వాడకుండా మీనాక్షీతత్త్వమును తీసుకువచ్చారు. 


అమ్మవారు ఈ లోకములో పుట్టి పెరిగి పెళ్లి చేసుకుని బిడ్డలను కని మనలను పోషించడము కోసమని వచ్చి కూర్చున్న రూపమే మీనాక్షి. ప్రస్తుతము మధురై అని పిలుస్తున్న ప్రాంతములో ఒక మహారణ్యము ఉండేది. అందులో నుంచి ధనుంజయ్ అన్న వ్యాపారి వెడుతూ మార్గ మధ్యములో ఒక ప్రాకారము కనపడితే అందులో పడుకుందామని అనుకున్నాడు. ఇంతలో దేవతలు పూజలు చేస్తున్న చప్పుడు వినపడి లోపలకు వెళ్ళి చూస్తే అమ్మవారు పూజలు స్వీకరిస్తున్నది. అమ్మవారు ఆ వ్యక్తి ద్వారా విషయము లోకానికి ప్రకాశింప చేయాలని అనుకున్నది. ఆ విషయము వ్యాపారి వెళ్ళి రాజుగారికి చెప్పాడు. ఆ రాజు పేరు కులశేఖరపాండ్యన్ ఆయన వచ్చి చూస్తే పరాశక్తి వెలిసి ఉన్న ఒక దేవాలయము కనపడింది. రాజుకి బిడ్డలు లేరు. అమ్మవారిని వేడుకుంటే మలయధ్వజపాండ్యన్ అన్న కొడుకు కలిగాడు. ఆతనికి బిడ్డలు కలగలేదు. అమ్మవారి గుడికి వచ్చి నాకు బిడ్డలనివ్వమని ఒక హోమము చేసాడు. అందరు చూస్తుండగా ఆశ్చర్యకరముగా ‘చిదగ్నికుండసంభూత’ హోమకుండములోనుంచి ఆడపిల్ల పైకి వచ్చింది. చిత్రముగా ఆ పిల్లకు మూడుస్తనములు ఉన్నాయి. అశరీరవాణి - ఈ పిల్లను సామాన్యకాంతగా భావించి వరుని తీసుకునివస్తారేమో అని అలా పుట్టింది. భర్త ఎవరో అమ్మాయే వెతుక్కుంటుంది. వరుడు కంటపడిననాడు మూడవస్తనము అదృశ్యమవుతుందని చెప్పింది. ఆ పిల్ల పెరిగి పెద్దయి ఎన్నో విలువిద్యలు నేర్చుకుని పురుషుడు అన్నవాడిని విడచి పెట్టకుండా ఓడించింది. పురుషులకు పురుషుడు కైలాసపతి, పినాకపాణి అయిన పరమేశ్వరుని ఓడిస్తానని కైలాసమునకు వెళ్ళి శివుని యుద్ధానికి పిల్చింది. ఆయన నవ్వుతూ బయటకు రాగానే మూడవ స్తనము మాయమయింది. ఆయనే తన వరుడని కైలాసమునుంచి భూమిమీదకు తీసుకుని వచ్చింది. ఆయనే సుందరేశ్వరుడు. వారికి సుబ్రహ్మణ్యేశ్వరుని అంశలో ఉగ్ర పాండ్యన్ పుట్టాడు. ఇప్పటికీ మధురైలో పరిపాలన అంశ అమ్మవారిదే. తలుచుకున్న ఉత్తరక్షణములో మధుర మీనాక్షి అనగానే చూపులతో కాపాడటానికి మధురైలో వెలిసి ఉంటానని అక్కడ మీనాక్షిగా వెలిసింది. నరకాంత ఎలా ఉంటుందో అలా రెండుచేతులతో ఉంటుంది. అమ్మా! అని పిలిస్తే చాలు అన్నిటినే ఏక కాలములో ఇవ్వకలిగిన తల్లి వెంటనే కోరికలు తీరుస్తుంది.   

అమ్మ కన్నులలోని కారుణ్యము పలుపాయలుగా ప్రవహిస్తుంది. ఎన్నిపాయలైనా తియ్యని నీరు. అమ్మవారి కన్నుల గురించి బాగా వింటే తల్లి కన్నులతో కన్నులు కలిపి చూసి రక్షణ పొందగలుగుతారు. కనుబొమలు, కబరీబంధము చూడటము కష్టము. అమ్మవారి కన్నులు చూడటానికి ఏ బెంగా ఉండదు. యధార్థమునకు ఏ తల్లి కన్నులలో అయినా అమ్మ కన్నులు చూడవచ్చు. నల్లటి, చల్లటికన్నులతో ఆవిడ జగమంతా పోషిస్తున్నది. చంద్రశేఖర పరమాచార్య - ఆ తల్లి కన్నుల గురించి నాలుగు మాటలు మాట్లాడితే ఆమె పొంగిపోయి ఒడిసి పట్టుకుని తన ఒడిలో కూర్చోపెట్టుకుంటుంది అంటారు. అమ్మ కన్నులవంక చూసినట్లయితే ఆమె ఉద్ధరిస్తుంది. అమ్మవారి నయనవైభవము చాలా గొప్పది. 


శంకరాచార్యులవారు అమ్మవారి కళ్ళల్లో నవరసాలు ఉన్నాయని అంటూ అద్భుతమైన శ్లోకము చెప్పారు. 


     శివే శృఙ్గారార్ద్రా తదితరజనే కుత్సనపరా 

     సరోషా గఙ్గాయాం గిరిశచరితే విస్మయవతీ ।

     హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ

     సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిస్సకరుణా ॥


  కారుణ్యమూర్తి అమ్మ కంటిలో నవరసములను శంకరాచార్యులు వర్ణిస్తారు. పరమశివునికి సంభందించిన విషయాలను తలచుకున్నప్పుడు అమ్మవారి కళ్ళల్లో ‘శృంగారరసము’ తొణికిసలాడుతుంది. ఆవిడ తనకు ఉన్న శృంగారరసము చేత కప్పేసి తెల్లటి అయ్యవారిని ఎర్రటి అయ్యవారుగా మార్చేసింది. శంకరులు అమ్మవారి పాతివ్రత్యము చేత అయ్యవారి మనసుని వశము చేసుకోవడము గురించి చెపుతున్నారు. అమ్మ నవ్వు చూసేప్పటికి శివుడు ఎంతో ఆనందపడతాడు. భార్యముఖము చూస్తే భర్త మనసు ఉల్లాసము పొందాలి. మానసికమైన విశ్రాంతి పొందాలి. వారు ఇద్దరూ ఒకరియందు ఒకరు రమించే హృదయము ఉన్నవారు.   


అమ్మవారి కళ్ళల్లో భీభత్సరసము ఎప్పుడు కనపడుతుంది అనగా మూడు లోకములలోని సర్వప్రాణులూ ‘ఆబ్రహ్మకీటకజననీ’ ఆవిడ పిల్లలే. కానీ ఈ వచ్చిన పిల్లలు అమ్మవారిలోని అమ్మతనము చూడక ఆడతనము చూస్తే అమ్మవారి కళ్ళల్లో ‘భీభత్సరసము’ కనపడుతుంది. ఆరోజున ‘జయజయహే మహిసాసురమర్ధిని రమ్యకపర్ధినిశైలసుతే’ అవుతుంది. 


అమ్మవారు సింహాసనముమీద కూర్చుని ఉండగా సరస్వతీదేవి వచ్చి కూర్చుంటే అమ్మవారు ప్రసాదము తీసుకుని తాంబూలము వేసుకుని సరస్వతీదేవి ఒకపాట పాడమని అంటుంది. సరస్వతీదేవి విపంచి పట్టుకుని పరమశివుని వైభవము స్తోత్త్రము చేస్తూ పాడుతుంది. ఆ పాట వింటూ ఉండగా మా ఆయన కదా ఇంత గొప్పపనులు చేసిందని అయ్యవారి చేసి గొప్పపనులు గురించి వినేసరికి అమ్మకళ్ళల్లో ‘అద్భుతరసము’ కనపడుతుంది. తాంబూలము నములుతున్న నోటితో సన్నగా నవ్వితే తాటంకములు బుగ్గలలో ప్రతిఫలిస్తూ ఉండగా అటూ ఇటూ ఊగుతాయి. శివుని గొప్పతనము వర్ణిస్తూ పాడిన ఆ పాటకి పొంగిపోతూ ‘సెహభాష్’ అంటుంది. సరస్వతీదేవి ఇంత పాట పాడాను కానీ ‘సెహభాష్’ అన్న నీ మాటలో ఉన్న తియ్యదనము ఈ పాటలో లేదు. ఎంత బాగా అన్నావమ్మా అని తన వీణకు గలీబు తొడిగేసుకుంటుంది. శివునియొక్క వైభవమును అంతగా వర్ణిస్తూ ఉంటే తలమీద గంగమ్మ నేనూ భార్యనే కదా అన్నభావముతో తొంగిచూసేసరికి, ఏమే! పరమశివుడు పాణిగ్రహణము చేసి తాళి కట్టినది నాకు. శివుడు నిన్ను భరించాడు అంతే అని గంగమ్మని చూసేసరికి తల్లి కళ్ళల్లో ‘కోపము’ కనపడుతుంది. ఎంత అమ్మవారయినా పాతివ్రత్యము పాతివ్రత్యమే. భర్తను వేరొకరు పంచుకున్నారు అంటే ఆమె కళ్ళల్లో అది కనపడకపోతే ఏదో తేడా ఉన్నట్లు.  


శంకరాచార్యులు ఒక నాటకీయ సన్నివేశమునకు తెర తీసారు. శ్రీమహారాజ్ఞి అయిన అమ్మవారు సభతీర్చి కూర్చుని ఉన్న సమయములో ఈ లోగా అమ్మవారు సింహాసనము మీద కూర్చుని ఉండగా ఒక ప్రతీహారి వచ్చి ‘భవస్యాభ్యుత్థానే’ - (భవుడు అంటే లోకములన్నీ పోషించ కలిగినవాడు) పరమశివుడు సభలోకి విజయం చేస్తున్నాడని చెప్పాడు. అమ్మవారు సింహాసనము మీద నుంచి లేచి గబగబా ఆయనకు ఎదురు వెళ్ళింది. శంకరుడు కనపడినప్పుడు పొంగిపోయి మోకాళ్ళ మీద ఒంగి అయ్యవారి కాళ్ళమీద తన బొట్టు ముద్రపడేట్లుగా నమస్కరిస్తుంది. ఒక కొడుకు దర్శనము చేసినట్లుగా శంకరులు అమ్మవారిని దర్శనము చేసారు. తల్లి వెళ్ళి అయ్యవారి పాదములకు నమస్కారము చేసి శివునితో కలసి వచ్చి సింహాసనము మీద కూర్చుంటుంది. పక్కన భర్త కూర్చుంటే అసలే బుగ్గలు ఎరుపయిన అమ్మవారి బుగ్గలు ‘సిగ్గుతో’ రాగ రంజితములయిపోతాయి. ఎంతో గొప్పవాడని కదా సరస్వతీదేవి గానము చేసింది. మా ఆయన -- అని ఒక్కసారి చెయ్యిపట్టుకుందామని పరమశివుని చెయ్యి పట్టుకోబోయింది. శంకరుని ఆభరణములు అన్నీ పాములే ఆయన తన చేతికి ఒక పిల్లపాముని చుట్టుకున్నాడు. ఆ పాము అమ్మవారి చేతిని చూసి ఇదేదో ఎర్రతామరపువ్వులా ఉందని ఆమె చేతిమీదకి ఎక్కింది. చల్లగా తగిలేసరికి అమ్మో! పాము! అని ఒక్కసారి అమ్మవారి కళ్ళల్లో ‘భయము’ కనపడింది. నిజముగా ఆవిడకు భయము లేదు. సమస్త జీవకోటిలో కుండలినీ స్వరూపములో పాముగా పడుకునేది, లింగాకారములో ఉన్న శివలింగమును చుట్టుకుని పడుకునేది ఆవిడే ఇక్కడ శంకరుల దర్శనము అమ్మా! అప్పుడు నీకళ్ళల్లో ‘భయము’ కనపడింది అన్నారు.    


నీ చెలికత్తెలు అందరితో నువ్వు హాస్య ప్రసంగము చేస్తూ ఉంటావు. వాళ్ళను చుట్టూ కూర్చోపెట్టుకుని సంతోషముగా, ఉల్లాసముగా మాట్లాడుతూ ఉంటావు. అప్పుడు నీకళ్ళల్లో ‘హాస్యరసము’ కనపడింది అన్నారు. 

వీరరసము చెప్పినప్పుడు మహిషాసురుని, భండాసురుని చంపిన కధలు చెప్పరు. అమ్మ దగ్గర చెప్పేప్పుడు మంచి సంతోషముగా, లాలిత్యముగా ఉండాలి. నీ పాదముల దగ్గర పూజచేసిన తెల్లతామరలు ఎర్రగా ఎందుకు కనపడుతున్నాయి అంటే, ఆ తామరపూలు నీవంక చూసి అచ్చు అమ్మవారి కళ్ళు మా కళ్ళలా ఉంటాయని అంటారు అనుకుంటూ చూసినప్పుడు మీకూ, నాకూ పోలికా ? అని వాటివంక ఒకసారి చూసేసరికి అమ్మవారి కళ్ళల్లోని ఎరుపుతనము ఆ తెల్లతామరలకు వెళ్ళి అవి ఎర్రగా అయిపోయాయి. ఈ విధముగా తన చూపులతో గెలిచినప్పుడు నీ కళ్ళల్లో వీరరసము కనపడిందమ్మా! – అన్నారు.  


అమ్మా! నన్ను చూసేప్పటికి నేను నీ పిల్లవాడిని కదమ్మా! నీ కళ్ళలలో ‘కరుణరసము’ కనపడింది. ఈ విధముగా శంకరులు ఎనిమిది రసములను చెప్పారు. ఈ శ్లోకములో తొమ్మిదవరసమును చెప్పలేదు. మరి నవరసాలు కదా అంటే శంకరులు గడుసుతనముతో అసలు అమ్మవారి స్వరూపమే శాంతము అన్నారు. పిల్లలు అందరకి అమ్మ దగ్గరకు వెళ్ళి చేరిపోవడములో ఉన్నతృప్తి ఇంక దేనిలోనూ ఉండదు. అందుకనే వచ్చి అమ్మ ఒళ్ళో పడిపోతారు. అమ్మచేతి ముద్ద తిననివారు దురదృష్టవంతులు. అమ్మ మాట్లాడిన ప్రతిమాటలో తాపత్రయము, పరమేశ్వరుని ఆశీర్వచనము, పెట్టే ప్రతిముద్దలో అమృతము కలసి ఉంటుంది. అమ్మ ఆలోచనలో సర్వకాలములలోనూ బిడ్డడి అభ్యున్నతి కోరుకుంటుంది. తొమ్మిదవరసమైన శాంతరసములో నుంచే అన్నిరసములు వచ్చాయి. ఇన్ని విషయములను దృష్టిలో పెట్టుకుని శంకరులు -- ‘మయి జనని దృష్టిస్సకరుణా’— అమ్మా! జగజ్జననివి కదా! నువ్వు నావంక చూసినప్పుడు ‘కరుణ’ తప్ప ఇంకొకటి ఉండదు అన్నారు. తొమ్మిదవరసము ఎక్కడనుంచి వచ్చింది? ‘శాంతరసము’ లోనుంచి ఈ ఎనిమిది రసములు వచ్చాయి. మళ్ళీ ఈ ఎనిమిదీ శాంతరసములోకి వెళ్ళిపోతాయి. అమ్మవారి కళ్ళల్లో నవరసములనూ ఒలికించి అలా చూడడములో మనసు వెళ్ళి అక్కడ నిలబడితే ఒక్కసారి అమ్మవారిని చూస్తే ఆవిడ పొంగిపోతుంది. మామూలుగా కళ్ళగురించి చెపితే వినరని అమ్మకళ్ళల్లో నవరసములను, పాతివ్రత్యము, అమ్మతనమును, అనుబంధమును పండించి, మనసు లయము అయ్యేట్లుగా చేసి అమ్మ చూపువలన కృతార్థులయ్యేట్లుచేసి ముప్పైరెండుఏళ్ళల్లో ఉద్ధరించుకోవడానికి అంత పరిశ్రమచేసి ఇన్ని స్తోత్త్రములను ఇచ్చిన ఆయన పాదములకు శిరస్సువంచి నమస్కారము చెయ్యడము తప్ప శంకరులకు ఏమిచ్చినా ఋణముతీరదు. అమ్మవారి కన్నులను అన్ని రకములుగా శంకరులు వర్ణిస్తే ఏ ఒక్కరోజైనా ఈ శ్లోకం చదివి అర్థము చేసుకున్నప్పుడు కలిగిన అనుభూతితో తెలియకుండానే ఎవరికైనా అమ్మ కళ్ళు దర్శనమవుతాయి. ఉత్తరక్షణములో మీనాక్షీ అమ్మవారి అనుగ్రహముతో అక్కడితో బ్రతుకు పండిపోయినట్లే.


అమ్మా! నీ దృష్టి గొప్పది. నావంక ఒకసారి చూస్తే నీకు ఏమీ హాని ఉండదు. నువ్వు మీనాక్షివి. ఒకసారి నావంక చూసావంటే జన్మ ధన్యమవుతుంది. అమ్మవారి చూపులతో లోకమును ఎన్ని రకములుగా పోషించకలదో వశిన్యాదిదేవతలు, శంకరులు, మూకశంకరులు, పోతనగారు, వాల్మీకిమహర్షి ఎందరో మహానుభావులు ఆ నామమును అనుసంధానము చేసుకుని జీవితములను తరింప చేసుకున్నారు. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

కామెంట్‌లు లేవు: