11, నవంబర్ 2020, బుధవారం

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


పదహారవ శ్లోక భాష్యం


కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం

భజంతే యే సంతః కతిచి దరుణామేవ భవతీం!

విరించి ప్రేయస్యా స్తరుణతర శృంగారలహరీ

గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ!!


(బాల సూర్యుని కాంతి పద్మములను వికసింపజేసినట్లుగా కవీంద్రుల హృదయ పద్మములను వికసింపచేసే నిన్ను అరుణవర్ణముగా ధ్యానించే కొంతమంది సత్పురుషులు సరస్వతీదేవీ నవయౌవన శృంగార ప్రవాహము వంటి గంభీరమైన వాగ్జాలముతో, నీ భావవిదులైన సత్పురుషుల హృదయములను రంజింపచేసెదరు)


క్రిందటి శ్లోకంలో పరమసాత్త్విక స్వభావంతో తెల్లటి వర్ణము కలిగిన తల్లిగా వాగ్దేవిని స్తోత్రం చేసిన ఆచార్యులవారు ఆమెను ఈ శ్లోకంలో రాజస కోణంలో అరుణవర్ణగా వర్ణిస్తున్నారు. సూర్యుని సారథిని అరుణుడు అంటాం. అతడు సూర్యునికంటే కొంచెం ముందు ఉదయిస్తాడు కదా! దానిని అరుణోదయమంటాం. ఈ అరుణుడు ఎఱ్ఱటి ఎఱుపు. ఆయన ఉదయిస్తున్నపుడు తూర్పు దిశ ఎఱ్ఱటి కాంతులీనుతూ ఉంటుంది. అసలు అరుణము అంటే ఎఱుపు అని అర్థం. అటువంటి అరుణకాంతులతో అంబిక ప్రకాశిస్తుంటుంది. ఎఱ్ఱటి ఎఱుపుగా అంబికను ఎవరైతే ప్రార్థిస్తారో వారికి రజో సంబంధియైన శృంగార పూరితమైన కవిత్వం సిద్ధిస్తుందంటారు ఆచార్యులవారు. శృంగారము, ఎఱుపు వర్ణము రెండూ రజోగుణ సంబంధులే! కాబట్టి అరుణారుణంగా భావించబడిన అంబిక అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.


ఇక్కడ శృంగారము సామాన్యార్థంలో వాడబడే పదంకాదు. కామేశ్వరీ కామేశ్వరుల మిథున భావంలోని అంతార్థాన్ని అవగతం చేసుకొని వర్ణించగలగడం శృంగారం. ఆ ఆదిదంపతుల శృంగారం వెనుకనున్న శృంగారపు పరమార్థాన్ని ఆస్వాదించి ఆనందం పొందగలిగినవారు “సతాం” సజ్జనులు లేక సాధువులు. “శరజ్జ్యోత్స్నా” అన్న శ్లోకంలో ధవళవర్ణమైన వాగ్దేవి అనుగ్రహం వల్ల కలిగిన కవిత్వం సాత్వికమైనది అయి ఉండాలి. దానిని ఆస్వాదించగలిగిన వారు విరాగులు. ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణత దశలో జ్ఞానవైరాగ్యములను శృంగారభావంలో కూడా ఆస్వాదించ గలుగుతారు. అటువంటి సరస్వతీదేవిని అరుణవర్ణగా భావించేవారు పై చెప్పిన పరిణత మనస్కులైన సాధువుల హృదయములను అలరించే విధంగా పాడగలరు.


క్రిందటి శ్లోకంలో అంబికను ధవళమూర్తిగా ఆరాధించి తేనె, పాలు, ద్రాక్షల వంటి మధురిమ కలిగిన వాక్కులను పొందిన సాధువులు ఈ శ్లోకంలోని అరుణ సరస్వతిని ఆరాధించిన కొద్దిమంది మహాత్ముల చేత చేయబడిన గంభీరవాగ్జాలమును ఆస్వాదించ గలిగిన రసికులు. ధవళ సరస్వతి అనుగ్రహాన్ని పొందిన మధురిమ గల కవులు సాధారణమైన సాధువులు. మరి ఈ శ్లోకంలో కవులెవరు? వారు సంతః సాధుశ్రేష్ఠులు, ముందటి శ్లోకంలోని సాధువుల కంటే ఉన్నత స్థితి గలవారు. ఎందుకంటే “కతిచిత్ సంతః” కొంతమంది సాధువులే, తాము పురుషోత్తముని నాయికగా గుర్తించుకొనగలిగినవారు మాత్రమే శృంగారపరమైన కవిత్వం వ్రాయగలుగుతారు. ఆ కొద్దిమంది సాధువులు మాత్రమే మనలను ఆత్యంతిక స్థితికి చేర్చగల సత్యములున్న శృంగారభరితమైన పాటలను పాడగలరు. ఇక మిగిలిన సాధువులు దానిని ఆస్వాదించి ఆనందించగలరు.

ఆచార్యులవారిక్కడ “రంజనము” అనే పదం వాడారు. ఈ పదములో శ్లేష ఉన్నది. “ర” అనే వర్ణము (అక్షరము) ఎఱుపు రంగును సూచించిస్తుంది. అగ్ని ఎఱుపు రంగు. కాబట్టి కామాగ్ని – వాంఛ “ర”తో సూచించబడుతుంది. రమ్+జనము= ఎఱుపును జనింపజేసేది. పరిపక్వస్థితి అన్నమాట. పండిన ఫలము ఎఱ్ఱగా ఉంటుంది గదా! ఎందిన ఫలము తగలబడుతున్న కట్టె అంతటి ఎఱుపుగా ఉంటుండి కదా! అరుణారుణమైన వాగ్దేవిని ధ్యానించి సంపూర్ణంగా పరిణతి చెందిన సాధువుల చేత చేయబడిన కవిత్వము మిగతా సాధువులకు పరిపక్వమైన ఆనందాన్ని కలిగిస్తుందని దీని భావం. ఈ సరస్వతి అరుణ (ఎరుపు వర్ణం) – ఆమె అనుగ్రహాన కవులు “రమ్” ఎఱ్ఱదనాన్ని – శ్రంగార తరంగాలతో కూడిన కవిత్వాన్ని సృష్టిస్తారు. ఆచార్యులవారు ఆ కవిత్వాన్ని “గంభీరాభిర్వాగ్భి” ఎంతో లోతైన భావగర్భితమైన, అంతరార్థం కలిగిన మాటలుగా వర్ణిస్తున్నారు. ఈ కవిత్వమనే మహాసముద్రంలో పైకి కనిపించేవి శృంగారపు కెరటాలు. లోపలికి దూకితే జ్ఞాన ముత్యములు, పగడములు దొరుకుతాయి.


కామేశ్వరీ దేవి కూడా అరుణ అని పిలవబడుతోంది. “అరుణాం కరుణతరంగితాక్షీం” అన్నది ఆమె ధ్యాన శ్లోకం. ఆచార్యులవారిచే ఈ శ్లోకంలో స్తోత్రం చేయబడిన అరుణ సరస్వతి అష్టభుజ అయిన కామేశ్వరీ దేవి అని విజ్ఞుల అభిప్రాయం. నాలుగు చేతులలో కామేశ్వరి ధరించే ధనుర్భాణ పాశాంకుశములు మిగతా నాలుగు చేతులలో సరస్వతీదేవి ధరించే వరదాభయముద్రలు, పుస్తక అక్షమాలను ధరిస్తుంది.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: