11, నవంబర్ 2020, బుధవారం

17-14-గీతా మకరందము

 17-14-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక శారీరక, వాచిక, మానసిక తపస్సులను చెప్పబోవుచు ముందుగా శారీరక తపస్సును గూర్చి వర్ణించుచున్నారు -


దేవద్విజగురు ప్రాజ్ఞ 

పూజనం శౌచమార్జవమ్ |  

బ్రహ్మచర్యమహింసా చ 

శారీరం తప ఉచ్యతే || 


తాత్పర్యము:- దేవతలను, బ్రహ్మనిష్ఠులను, గురువులను, జ్ఞానులను (మహాత్ములను, బ్రహ్మజ్ఞానముగల పెద్దలను) పూజించుట, బాహ్యాభ్యంతరశుద్ధిగలిగియుండుట, ఋజుత్వముతో గూడియుండుట (కుటిలత్వము లేకుండుట, మనోవాక్కాయములతో ఏకరీతిగ వర్తించుట), బ్రహ్మచర్యవ్రతమును పాలించుట, ఏ ప్రాణిని హింసింపకుండుట, శారీరక (శరీరసంబంధమైన) తపస్సని చెప్పబడుచున్నది.


వ్యాఖ్య:- శారీరక, వాచిక, మానసికములను త్రివిధతపస్సులను గూర్చి చెప్పబడిన ఈ ఘట్టము (14, 15, 16 శ్లోకములు) చాలముఖ్యమైనది. సాధకులు ఈ మూడువిధములైన తపస్సులను చక్కగ శీలించి త్రికరణశుద్ధులైయుండినచో నిర్మల దర్పణమున ప్రతిబింబమువలె, ఆత్మానుభూతి, దైవానుభూతి వారికి సులభముగ లభ్యముకాగలదు. ఈ అధ్యాయమున ఆహారము, యజ్ఞము, దానము అనువానిని గూర్చి చెప్పునపుడు వానియొక్క సాత్త్విక, రాజస, తామసరూపములనే పేర్కొని, ఒక్క తపస్సును గూర్చి వర్ణించునపుడు మాత్రము, అద్దాని సాత్త్విక, రాజస, తామసరూపములనేగాక, తత్సంబంధమైన శారీరక, వాచిక, మానసిక తపస్సులనుగూడ వక్కాణించిరి. ఉపాధియందలి (ఇంద్రియాదులందలి) మాలిన్యములను బాగుగ తపింపజేసి వానిని తొలగించుటయే తపస్సు. అదియే మోక్షమునకు హేతువు. పరమార్థసాధనలలో అది చాల ప్రధానమైనది. అందువలననే కాబోలు గీతాచార్యులు తపస్సును గుఱించి చెప్పునపుడు అన్నిటి వలె సామాన్యముగ చెప్పక ప్రత్యేకించి మఱల మూడువిధములుగ చెప్పిరి. జనులలో కొందఱు తపస్సను మాట వినగనే భీతిల్లుచుందురు. ఎండలో, వానలో బాధ జెందుటయే తపస్సని వారిభావము. కాని శ్రీకృష్ణపరమాత్మ తపస్సును గూర్చి యిచట గావించిన వివరణమును, వ్యాఖ్యను పరిశీలించినచో ఇక వారట్టి భీతిజెందనవసరములేదని స్పష్టముకాగలదు. భయంకరములైన తపస్సులను గూర్చిన ప్రస్తావనయే ఇచట లేదు.  కాబట్టి సులభసాధ్యములై, సర్వులకును ఆచరణయోగ్యములైనట్టి ఈ త్రివిధతపస్సులను ప్రతివారును స్త్రీలును, పురుషులును చక్కగ ఆచరించి శరీర వాఙ్మనంబులను శుద్ధమొనర్చుకొని మోక్ష భాగులు కావలయును.

ఈ శ్లోకమునందు శారీరక (శరీరసంబంధమైన) తపస్సు చెప్పబడినది. ఇందు ఐదు సాధనలు వచింపబడినవి. (1) మొట్టమొదట పెద్దల సేవనము, పూజనము పేర్కొనబడినది (దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనమ్). పెద్దలను, బ్రహ్మనిష్ఠులను పూజించుటవలన, సేవించుటవలన రెండు మహత్తర సత్ఫలితములు సాధకునకు కలుగగలవు. అవియేవియనిన - (1) వారియొక్క అనుగ్రహము లభించుట (2) తనయొక్క అహంకారము, అభిమానము శమించుట. అధ్యాత్మమార్గమున సర్వేశ్వరుని యొక్కయు, సద్గురుని యెుక్కయు, మహాత్ములయొక్కయు అనుగ్రహములేనిచో దుస్తరమగు మాయ ఎవరికిని దారి నొసంగదు. ప్రతిబంధకములు తొలగవు. అత్తఱి జనులు పరమార్థరంగమున ముందుకు జనుట చాలకష్టము. కాబట్టి వారియొక్క పూజా, సేవాదులచేతను, వారియెడల వినయవిధేయతలను జూపుటవలనను, వారి యనుగ్రహమును, ఆశీర్వాదమును ఎట్లైన సంపాదించవలెను. వారి కటాక్షము ముముక్షువులకు అపారమగు మేలును చేకూర్చగలదు. ఇంతియేకాదు. పెద్దలను సేవించుటవలన మనుజునకు తనయందలి అహంకారము, గర్వము, అభిమానము శీఘ్రముగ శమించిపోగలదు. కాబట్టి ముముక్షువున కీ సాధన చాల అవసరమైయున్నది. అందులకే కాబోలు భగవానుడు మొట్టమొదట దానినే వక్కాణించిరి.


“ద్విజ” - ద్విజులనగా రెండవజన్మయెత్తినవారు; అనగా పుట్టుకతో వచ్చిన జన్మకాక, సంస్కారముచే, సాధనచే వచ్చిన రెండవజన్మకలవారని అర్థము. అజ్ఞానమును ఛేదించి, లేక అజ్ఞానముతో గూడిన పాతశరీరమనంబులను వదలి నూతనశరీరమనంబులను పొందినవారని భావము. వారి జీవితము పూర్వజీవితమువలె నుండదు. వారియందు బ్రహ్మతేజస్సు ప్రకాశించుచుండును.


“ప్రాజ్ఞ” - ప్రజ్ఞకలవాడు ప్రాజ్ఞుడు. జ్ఞానియని అర్థము. “ప్రజ్ఞానం బ్రహ్మ” అను మహావాక్యమందు తెలుపబడిన బ్రహ్మరూపమగు ప్రజ్ఞను, చిద్వస్తువును ఎఱుంగువారే ప్రాజ్ఞులనియు చెప్పవచ్చును. అట్టి ప్రాజ్ఞులను, మహనీయులను సత్కరించుట, పూజించుట ఒక విధమైన తపస్సనియే ఇట చెప్పబడినది.


‘శౌచమ్' - మనశ్శుద్ధి, శరీరశుద్ధి, పరిసరశుద్ధి - మూడును అవసరములే. తన మనస్సు, తన శరీరము, తానుండుచోటు – మూడిటిని శుద్ధముగా నుంచుకొనవలెను. మురికి తావులందుండువారికి ఆరోగ్యము చెడుటయేగాక ‘మురికి' భావనలుగూడ గలుగుచుండును. మలినశరీరముగలవానికి స్వాస్థ్యము చెడుటచే నిష్ఠకు విఘ్నములు కలుగును. ఇక మలినమనస్సుగలవారికి అసలు దైవమార్గమే గోచరింప కుండును. కాబట్టి సాధకుడు కడు జాగరూకుడై శుచిత్వమును లెస్సగ సంపాదించవలెను. ఊడ్చిశుద్ధము చేయుటద్వారా పరిసరములను, స్నాన సాత్త్వికాహారాదులద్వారా శరీరమును, మలినసంకల్పత్యాగము ద్వారా, దైవసంకల్పములను చేయుటద్వారా మనస్సును శుచివంతముగ గావించుకొనవలెను.


“ఆర్జవమ్" - ఋజుత్వము . అనగా కుట్ర, కపటము, కౌటిల్యము లేకుండుట. పామువలె వక్రత గలిగియుండువానియందు విషము (పాపము, అజ్ఞానము) ఉండియేయుండును. కావున తలంపునందు, వాక్కునందు, క్రియయందు ఒకే విధమైన ప్రవర్తన గలిగియుండవలెను. శరీరవాఙ్మనంబులలో ఏకరీతివర్తింపవలయును. ‘వక్ర’ వ్యవహారము మానవలెను. 


“బ్రహ్మచర్యమ్" - త్రికరణములతో బ్రహ్మచర్యమును శీలించుట ఒక మహాతపస్సని భగవానుడు చెప్పుచున్నాడు. బ్రహ్మచర్యమనగా విషయదోషము, కామభావన, కామవ్యవహారము లేకుండుట; మఱియు బ్రహ్మమును గూర్చి చింతించుట. అన్ని సాధనలకును బ్రహ్మచర్యము పునాదివంటిది. కనుకనే గీతలో భగవాను డచటచట అద్దానిని ప్రోత్సహించుచువచ్చిరి. దీనివిషమై అశ్రద్ధవహించినచో మనుజుడు పరమార్థపథమున ఉన్నతిని బడయజాలడు. అధ్యాత్మసౌధమున బ్రహ్మచర్యము కీలకస్థానము నాక్రమించు కొనియున్నది  (Main - Switch).


“అహింస” - శరీరవాఙ్మనంబులచే ఏ ప్రాణికిని అపకారము చేయకుండుట. (అజ్ఞానముగలిగి యున్నచో తన ఆత్మను తాను హింసించుకొనినట్లు అగును. గావున అజ్ఞానమును తొలగించి, జ్ఞానసముపార్జనము గావించుటద్వారా ఆత్మహింసను త్యజించుటయు అహింసయే యగును. అయితే యిది అహింసయొక్క మహోన్నతమగు రూపమని యెఱుంగవలెను).


ప్రశ్న:- శరీరతపస్సనగా నేమి ?

ఉత్తరము:- (1) దేవతలు, గురువులు, బ్రహ్మనిష్ఠులు, ప్రాజ్ఞులగు మహనీయులు (జ్ఞానులు, పెద్దలు) - వీరిని పూజించుట (2) బాహ్యాభ్యంతరశుచిత్వము (3) ఋజుత్వము (4) బ్రహ్మచర్యము (5) అహింస - వీనిని గలిగియుండుట శరీరతపస్సని చెప్పబడును.

కామెంట్‌లు లేవు: