11, నవంబర్ 2020, బుధవారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 చతుర్థ స్కంధం -21


పురంజను కథ-3  


పుణ్యాత్మా! రాజర్షి అయిన యయాతి కుమారుడు పూరుడు ఆమెను వరించాడు. ఆమె సంతోషించి అతనికి వరాన్ని ప్రసాదించింది. తన దౌర్భాగ్యవశాన ఆమె దుర్భగ అని పేరు పొందింది. ఆ తరువాత ఆమెను ఏ పురుషుడూ వరించలేదు. ఒకనాడు బ్రహ్మలోకం నుండి భూలోకానికి వచ్చిన నన్ను వరించాలనుకొని మన్మథుని బాణాలకు తాళలేక వేడుకున్నది. నేను అంగీకరించలేదు. అందుకు ఆమె కోపించి . . . .అలా ఆమె కోపించి “మునీంద్రా! నా కోర్కెను నీవు నెరవేర్చలేదు. కాబట్టి ఒకచోట నిలువక నీవు నిత్యమూ తిరుగుతూ ఉంటావు” అని శపించింది. నా ఉపదేశం వల్ల యవనేశ్వరుడైన భయుడు అనేవాని వద్దకు వెళ్ళి ఇలా అన్నది. రాజా! భయుడనే పేరు కలిగి, యవనవంశానికి అధిపతివైన నిన్ను భర్తగా వరింప వచ్చాను. సవినయంగా విను. భూతసంకల్పం చేత…

నాకు కలిగిన కోరిక వ్యర్థం కాదు. ఇవ్వదగిన వస్తువును అడిగినప్పుడు ఇవ్వనివాడు, గ్రహింప దగిన వస్తువును ఇచ్చినప్పుడు కోరుకొననివాడు మందబుద్ధులు. కాబట్టి నన్ను దయతో గ్రహించు. దీనులపై దయ చూపటం పురుషధర్మం” అని వేడుకున్నది. అప్పుడు యవనేశ్వరుడు దేవరహస్యాన్ని (మరణం) చేయ సిద్ధపడిన ఆ కాలకన్యను చూచి చిరునవ్వుతో ఇలా అన్నాడు. తరుణీ! విను. ఈ లోకంలో నీవు కోరినవారు అందరూ నీవు అశుభమైన దానివి కనుక నిన్ను మెచ్చుకొనడం లేదు.కాబట్టి నేను జ్ఞానదృష్టితో నీకు భర్తను నిర్ణయిస్తాను. నీవు అవ్యక్తగతివై లోకమంతటా తిరుగుతూ కర్మనిర్మితమైన లోకాన్ని అనుభవించు. నా సేనను నీకు తోడుగా పంపిస్తాను. దాని సాయంతో నీవు ప్రజానాశనం చేయగలవు. ఈ ప్రజ్వారుడు నాకు సోదరుడు. నీవు నాకు చెల్లెలివి. మీ ఇద్దరితో కూడి నేను అవ్యక్తుడనై, భీమ సైనికుడనై ఈ లోకంలో సంచరిస్తాను” అని అన్నాడు. ఆ యవన రాజు ఆజ్ఞను నేరవేర్చడానికి సైనికులు ప్రజ్వారునితోను, కాలకన్యకతోను కూడి లోకమంతా తిరుగుతూ ఒకనాడు లౌకిక సంపదలతో నిండి, ముసలి పాముచేత రక్షింపబడుతున్న పురంజనుని పురాన్ని ముట్టడించారు. తనచేత ఆక్రమింపబడిన పురుషునికి నిస్సారత్వం కలిగించే కాలకన్యక బలవంతంగా ఆ పురంజనుని పురాన్ని అనుభవించింది. కాలకన్యక చేత అనుభవింపబడుతున్న పురంలో యవనులందరూ అన్ని ద్వారాలలో నుండి ప్రవేశించి ఆ పురాన్ని పీడింపసాగారు. ఈ విధంగా పురం పీడింపబడుతుండగా అభిమానవంతుడైన పురంజనుడు….పుణ్యాత్మా! (పురంజనుడు) మమకారం చేత వ్యాకులపాటు చెంది దుఃఖించాడు. గొప్ప కుటుంబం కలవాడై కూడా పురంజనుడు కాలకన్య కౌగిలిలో చిక్కి, సంపదలు పోగొట్టుకొని, బుద్ధిమాంద్యుడై, విషయాలకు లొంగి దరిద్రుడై, దీనుడై, నీచవర్తనుడై వాపోయాడు. గంధర్వ యవనులు ఆక్రమించటం చేత కాంతిని కోల్పోయిన తన పురాన్ని, ఎదురు తిరిగి అవమానిస్తున్న కొడుకులను, మనుమలను, పరిజనాన్ని, మంత్రులను, పురోహితులను, భార్యను చూచి…ఇంకా కాలకన్యచేత కబళింపబడిన తనను, శత్రువులచేత ధ్వంసం చేయబడ్డ పాంచాల సైన్యాలను చూచి అంతులేని శోకంతో అలమటించాడు. అతనికి ప్రతిక్రియ తోచలేదు. కాలకన్య కారణంగా నిస్సారాలైనప్పటికీ కామాలను కోరుకుంటూ, ప్రేమబంధాన్ని త్రెంచుకోలేక పుత్రులను, భార్యను బుజ్జగించాడు. గంధర్వులు, యవనులు ముట్టడించిన పురాన్ని విడవటం ఇష్టం లేకపోయినా విడవడానికి పూనుకున్నాడు. అప్పుడు…పుణ్యాత్మా! యవనేశ్వరుడైన భయనాముని అన్న ప్రజ్వారుడు వచ్చి పురంజనుని పురాన్ని పూర్తిగా కాల్చి భయునికి ప్రీతి కలిగించాడు. ఆ విధంగా పురం కాలిపోతుండగా పౌరులతోను, సేవకులతోను, కుటుంబంతోను, పుత్రులతోను కూడుకొనినవాడై, కాలకన్యకు పట్టుబడినవాడై, యవనుల చేత ఆక్రమింపబడిన పురాన్ని రక్షించుకొనడానికి అశక్తుడయ్యాడు. అప్పుడు…పురంజనుడు దావాగ్ని చుట్టుముట్టిన చెట్టు తొఱ్ఱలో ఉన్న పామువలె పురంనుండి వెలువడటానికి ప్రయత్నిస్తూ గంధర్వుల దాడి చేత బలం కోల్పోయినవాడు (అయి)….అతని గొంతులో గురగురమనే శబ్దం బయలుదేరింది. దుఃఖంలో మునిగి పోయాడు. కొడుకులను, కోడండ్రను, కూతుండ్రను, అల్లుండ్రను, మనుమలను, చుట్టాలను, సేవకులను తలచుకున్నాడు. తన మందిరంలో కొద్దిగా మిగిలిన ధనాన్ని, వస్త్రాలను తలచుకున్నాడు. అహంకారం వల్ల మమకారం వల్ల అతని బుద్ధి చెడింది. “అయ్యో! తన ఎడబాటు వల్ల అనాథగా మారే తన భార్య కొడుకులను కాపాడగలదో లేదో అని విలపించాడు.”ఇంకా ఇలా ఆలోచించాడు.నా భార్య నాకంటే ముందు భుజింపదు, స్నానం చేయదు. నేను కోపిస్తే భయపడుతుంది. అదలిస్తే బెదరి ఎదురాడదు. నేను తెలివితక్కువతో ఏ పనికైనా పూనుకుంటే నాకు బుద్ధి చెపుతుంది. ఇటువంటి అనుకూలవతి అయిన భార్య నేను మరణించిన తరువాత బిడ్డలను రక్షించడానికి బ్రతికి ఉంటుందో లేక సహగమనం చేస్తుందో” అని మనస్సులో చింతించి…

తన మరణానంతరం తన పుత్రులు, మనుమలు దిక్కులేనివారై నడి సముద్రంలో పగిలిపోయిన ఓడలాగా ఎలా జీవిస్తారో…అని ఈ విధంగా దీనునివలె దుఃఖించే పురంజనుని తీసికొని పోవటానికి నిశ్చయించుకొని….

భయనాముడు వచ్చాడు. పురంజనుని పట్టుకొని పశువును కట్టినట్లు కట్టి ఈడ్చుకొనిపోయాడు.అప్పుడు పురంజనుని పరిజనులు దుఃఖిస్తూ వెంబడించారు. పురాన్ని రక్షించే పాము విడిచిపోగానే ఆ పురం పురంజనుని విడిచి పంచభూతాలలో కలిసిపోయింది. శక్తిశాలి అయిన యవనుని చేత బలవంతంగా లాగుకొని పోబడుతున్న పురంజనుడు అజ్ఞానంతో తన మిత్రుడైన ఈశ్వరుని తెలిసికొనలేకపోయాడు. పరలోకంలో పూర్వం అతడు దయమాలి చంపిన యజ్ఞపశువులు మహాకోపంతో గొడ్డళ్ళతో అతనిని నరికివేశాయి. స్త్రీ సంగ దోషం చేత దూషితుడై జ్ఞానం కోల్పోయిన పురంజనుడు చాలకాలం పరలోకంలో దుఃఖాన్ని అనుభవించాడు. భార్యను మనస్సులో ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండటం చేత తరువాతి జన్మలో విదర్భరాజు కుమార్తెగా జన్మించాడు. రాజా! పాండ్యరాజైన మలయధ్వజుడు యుద్ధంలో ఎందరో రాజులను గెలిచి ఆ విదర్భరాజు పుత్రికను వీర్యశుల్కంగా పొందాడు. ఆమెవల్ల అతనికి ఒక కుమార్తె, ఏడుగురు కుమారులు కలిగారు. ఆ కుమారులకు ఒక్కొక్కరికి పదికోట్లమంది కొడుకులు జన్మించి ద్రవిడ దేశాన్ని నేర్పుతో పరిపాలించారు. మలయధ్వజుని కుమార్తె అగస్త్యుని వరించింది. అగస్త్యుడు ఆ మలయధ్వజుని కుమార్తె వల్ల దృఢచ్యుతుడు అనే పుత్రుని పొందాడు. అ దృఢచ్యుతునకు ఇధ్మవాహుడు జన్మించాడు. అప్పుడు మలధ్వజుడు విరక్తి చెంది….భూమినంతటినీ తన కొడుకులకు పంచియిచ్చి, శ్రీహరిని కొలువాలనుకొని కులపర్వతం వద్దకు వెళ్ళాడు. మలయధ్వజుని భార్య వైదర్భి…గృహాలను, సర్వభోగాను విడిచిపెట్టి చంద్రుని వెన్నంటి వెళ్ళే వెన్నెల లాగా భక్తితో భర్తను అనుసరించింది.ఈ విధంగా భార్య తన వెంట రాగా మలయధ్వజుడు చంద్రమస, నవోదకం అనే నదులలో తీర్థమాడి మనసులోని మాలిన్యాన్ని, దేహంలోని మాలిన్యాన్ని తొలగించుకున్నాడు. కందమూలాలను, పండ్లను, విత్తనాలను, పువ్వులను, ఆకులను, గడ్డిని, నీళ్ళను ఆహారంగా తీసుకొంటూ గొప్ప తపస్సు చేసాడు. శీతోష్ణాలు, వర్షపాతాలు, ఆకలి దప్పులు, ప్రియాప్రియాలు, సుఖదుఃఖాలు అనే ద్వంద్వాలను సమానంగా భావించాడు. తపోవిద్యల చేత, యమ నియమాల చేత కామాది వాసనలను దహించి బ్రహ్మంలో తన ఆత్మను కూర్చి, ఇంద్రియాలను, ప్రాణాన్ని, మనస్సును గెలిచాడు. మ్రోడులాగా నిలిచి నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేసాడు. భగవంతుడైన వాసుదేవునిపై ప్రీతి తప్ప మరొకటి తెలియక ప్రవర్తించాడు. తనను కలలో ‘మమేదం శిర శ్ఛిన్న మిత్యాది’ (నా యీ శిరస్సు తెగగొట్ట బడినది) అన్న నానుడికి తగినట్లు తనను దేహానికి భిన్నంగా, సాక్షిగా తెలిసికొని…స్వయంకర్త అయినవాడు, సర్వేశ్వరుడు, భగవంతుడు, దయామయుడు అయిన శ్రీహరి అనే ఆచార్యుడు అనుగ్రహించిన జ్ఞానం అనే దీపపు కాంతిచేత పరబ్రహ్మలో తనను, తనలో పరబ్రహ్మను దర్శించాడు. కాలిన కట్టెలను అగ్ని విడిచినట్లు ఈషణత్రయాన్ని విడిచిపెట్టాడు. దుఃఖసముద్రమైన సంసారం నుండి వైదొలగాడు. రాజా! విను. అప్పు డతని భార్య…విదర్భరాజు కుమార్తె వైదర్భి పతినే దైవంగా భావించి, జడలు తాల్చి, నారవస్త్రాలు కట్టి, వ్రతనియమాల చేత బాగా చిక్కిపోయి అక్కడ…

పద్మనయన అయిన ఆ వైదర్భి అన్ని సుఖాలను వదలి, మలయధ్వజుని చేరి పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ నియమంతో భక్తితో సేవలు చేస్తున్నది.మంచి మనస్సుతో పొగలేని అగ్నిని శుద్ధమైన జ్వాల విడువనట్లు పతిని ఎడబాయక పరిచర్యలు చేసింది.

భర్త మరణించటం తెలియని వైదర్భి పూర్వంలాగా భక్తితో అతనిని సేవించాలనుకొని…కదలకుండా కూర్చున్న భర్తను చేరి పూర్వంలాగా అతని పాదాలకు నమస్కరించింది. భర్త పాదాలలో…వేడి లేకపోవటం గమనించి గుంపునుండి తప్పిపోయిన లేడిలాగా భయపడుతూ విలపించింది.చనుదోయి కన్నీటితో తడిసిపోగా, విరహ వేదనతో హృదయం దహించుకొని పోగా, సుకుమారమైన పద్మంవంటి పెదవి కందిపోగా నిర్జనమైన అడవిలో వైదర్భి ఎలుగెత్తి ఏడ్చింది. “ఓ రాజా! ఓ మహాత్మా! ఓ సద్గుణమూర్తీ! దొంగలైన క్షత్రియాధముల పీడచేత కృశించిన భూమండలాన్ని రక్షించకుండా ఉపేక్షించడం నీకు తగదు. లేచి వచ్చి రక్షించు”.  అని పతి పాదపద్మాలపై తన నుదురు మోపి విలపించింది. కట్టెలు తెచ్చి, చితి పేర్చి, ఆ చితిలో పతి కళేబరాన్ని పెట్టి నిప్పు ముట్టించింది.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: