11, నవంబర్ 2020, బుధవారం

బొమ్మలు చెప్పిన కమ్మని కథలు

 -----ఈ కథ "సింహాసన ద్వాత్రింశక" లోనిది.------(విక్రమార్క సింహాసనం బొమ్మలు

చెప్పిన కమ్మని కథలు)


పూర్వము వైశాలీ రాజ్యాన్ని నందుడనే రాజు ప్రజానురంజకంగా పరిపాలించేవాడు.

ఆయన భార్య పేరు భానుమతీదేవి. నందుడి ప్రధానమంత్రి శారదానందుడు, ఇంద్రుడికి

బృహస్పతి లాగా  చాలా తెలివిగలవాడు,జ్ఞాని. ఏదో చిన్న పొరపాటు జరిగిందని

నందుడు వెనకా ముందూ ఆలోచించకుండా ఆయనకు దేశబహిష్కార శిక్ష విధించాడు.

ఇలా వుండగా ఒకరోజు  రాజకుమారుడైన జయపాలుడు తన అనుచరులతో అడవికి

వేటకు వెళ్ళాడు.అక్కడ తానొక్కడే గుర్రం మీద  ఒక నల్లజింకను వెంటాడుతూ

వెంటాడుతూ దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. చాలా అలసిపోయాడు.దాహమేసింది.


తన గుర్రాన్ని అక్కడవున్న చెట్టుకు కట్టేసి అక్కడవున్న సరస్సులో  నీళ్లు తాగి

చెట్టుక్రింద కాసేపు కూర్చుందామని వచ్చాడు. అంతలోనే దూరం లో  చిత్రాక అనే పులి

గాండ్రిస్తూ అటువైపు రావడం కనిపించింది. అది గమనించిన గుర్రం తాడు తెంచుకొని

అడవిలోకి పరుగు తీసింది.రాజకుమారుడొకడే నిలబడి పోయాడు. భయంతో వణికి

పోతూ గబ గబ ఆచెట్టునెక్కేశాడు. తీరా ఎక్కాక చూస్తే ఆ పక్కకొమ్మపైన ఒక ఎలుగుబంటి

కూర్చొని వుంది.రాజకుమారుడి పై ప్రాణాలు పైనే పోయాయి. భయంతో వణికి పోయాడు

.

    అప్పుడు ఆ ఎలుగుబంటి రాజకుమారా! భయపడకు, నేను నీకేమీ హాని చెయ్యను, .

నీవు నాకు అతిథివి. రక్షణ కోసం వచ్చావు. అని హామీ యిచ్చింది.. అప్పుడు

రాజకుమారుడు ఆ ఎలుగుకు నమస్కరిస్తూ, భల్లూకరాజా! నీవెంతో పుణ్యమూర్తివి.

ఒక ఆశ్రి తుడిని రక్షించడానికి ఎంత త్యాగం చేస్తున్నావు. అన్నాడు.


ఇంతలో సూర్తాస్తమయమైంది, పులి తిన్నగా చెట్టుక్రిందికి వచ్చి కూర్చుంది. 

అలసిపోయిన రాకుమారుడి నిద్ర ముంచుకొని వస్తూంది.ఆ కొమ్మ పైన నిద్రిస్తే నిద్రలో

తూలి క్రిందపడిపోతానని భయపడిపోయాడు. . అది గమనించిన భల్లూక రాజు

రాకుమారా! భయపడకు, యిలా వచ్చి నా తొడపై పడుకో, నీవు క్రింద పడిపోకుండా

నేను కాపాడుతాను. నన్ను నమ్ము అన్నది. సరేనని రాకుమారుడు దాని తొడపైన

పడుకొని నిద్రపోయాడు.

 

అప్పుడు పులి ఎలుగుతో ఇదిగో మిత్రమా ఆ మనిషిని కిందికి

తోసేయ్.. తినేసి వెళ్లిపోతాను.   ”ఈ మానవులు మనకు శత్రువులు,

అవకాశవాదులు.సాయం చేసిన మనకే  హాని చేస్తారు. 

అనింది   వెంటనే ఎలుగు “ఇతడు నేను వున్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను

ఆశ్రయించినట్టే కనుక నేను అతన్ని రక్షిస్తాను కాని కీడు చేయను”నాకేమైనా అయినా 

పరవాలేదుఅనడంతో పులి నిరాశపడినా వెళ్లిపోకుండా అక్కడే కూర్చుంది. 


అర్ధరాత్రి  రాకుమారుడి మెలకువ వచ్చింది. కూర్చునే వున్న ఎలుగుని చూసి జాలి వేసింది. నీవు

నాతొడమీద తల పెట్టి నిద్రపో నేను మేలుకొని వుండి  నీవు పడిపోకుండా  పట్టుకొనే

వుంటాను. అన్నాడు.ఎలుగు అతన్ని నమ్మి నిద్రపోయింది. రాకుమారుడు క్రింద

వున్నపులిని చూసి భయపడుతున్నాడు.అది కనిపెట్టిన పులి రాకుమారుడితో ఈ ఎలుగు

నమ్మతగింది కాదు. అది నేను వెళ్ళిపోయాక నిన్ను చంపి తిందామని ఆలోచనలోవుంది.

దాన్ని క్రిందికి తోసెయ్యి దాన్ని తిని నేను వెళ్ళిపోతాను. నీవు హాయిగా  నీ నగరానికి

వెళ్లిపోవచ్చు. అని నమ్మబలికింది.


దాని మాటలు నమ్మి రాజకుమారుడు ఎలుగు తనను కాపాడిన సంగతి కూడా

మరిచిపోయి దాన్ని క్రిందకు తోశాడు. ఎలుగు క్రింద పడిపోకుండా ఒక కొమ్మను 

పట్టుకొని మరీ పైకి వచ్చింది. దాన్ని చూసి రాకుమారుడు వణికి పోయాడు. అప్పుడు ఆ

ఎలుగు ఓరీ! దుర్మార్గుడా ! నీవు చేసినమేలు మరిచిపోయి నాకే అపకారం తలపెడతావా?

దీని ఫలిత అనుభవించు నీవు పిశాచానివైపోయి 'ససేమిరా" "ససేమిరా" అంటూ

పిచ్చివాడిలా తిరుగుతుంటావు  అని శాపమిచ్చింది.ఇంతలో తెల్లవారి పోయింది. పులి

తనదారిన తాను వెళ్ళిపోయింది. రాకుమారుడు చెట్టుదిగి 'ససేమిరా' 'ససేమిరా అంటూ

అడవిలో తిరుగుతున్నాడు.


రాకుమారుడు తిరిగి రాకపోయేసరికి  నందుడు కంగారు పడిపోయాడు. వెతకడానికి

భటులను పంపించాడు.భటులు నగరంలో ఒంటరిగావచ్చిన  .రాకుమారుడి గుర్రాన్ని 

చూసి అడవిలో వెతకడానికి బయల్దేరారు. అడవిలో పిచ్చివాడిలా తిరుగుతున్న

రాకుమారుడిని చూసి తీసుకొని వచ్చి  అంతఃపురానికి చేర్చారు.

కానీ అతను 'ససేమిరా' 'ససేమిరా' అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే రాజు

గాబరా పడిపోయాడు. రాజ్యంలోని వైద్యులనందరినీ పిలిపించాడు. వాళ్ళెవ్వరికీ

రాకుమారుడి జబ్బేమిటో అంతుపట్టలేదు.


అప్పుడు రాజుకు తన ప్రధానమంత్రి శారదానందుడు  గుర్తొచ్చాడు.అతనే వుంటే ఈ

గండం గట్టెక్కించేవాడు. అనిపించింది. శారదానందుడిని బహిష్కరించి తప్పు చేశానని

పించింది. నందుడు, నా కొడుకు జబ్బు నయం చేసినవాళ్లకు అర్ధరాజ్యం ఇస్తానని

రాజ్యం లో టముకు వేయమనితన మంత్రులను ఆజ్ఞాపించాడు.


వాళ్ళు రహస్యంగా శారదానందుని  కలుసుకొని విషయమంతా వివరించారు. అప్పుడు

శారదానందుడు   నాకూతురు తెరవెనుక కూర్చొని కొన్ని శ్లోకాలు చదివి   రాకుమారుడి

జబ్బు నయం చేస్తుందని రాజుకు చెప్పండి. నేను చెప్పిన  శ్లోకాలు నాకూతురు

చదువుతుంది. అని చెప్పి పంపించాడు.


నందుడు దానికి ఒప్పుకొని తెర ముందు కొడుకుతోనూ మంత్రులతోనూ  కూర్చున్నాడు.

తెర వెనకనుంచి మొదటి శ్లోకం యిలా వినిపించింది.


సద్భావ ప్రతిపన్నానాం వంచనే కా  విదగ్ధతాః

అంక మారుహ్య సుప్తానాం హంతుం నామ పౌరుషం


భావము:--మంచిమనసుతో సహాయం చేసినవాడిని, తన తొడపైన నిద్రించేవాడిని

చంపటం లో నేర్పరితనం, పౌరుషం ఏముంది?

శారదానందుని  కూతురు   ఈ శ్లోకం చదవగానే రాజకుమారుడు మొదటి అక్షరమైన 'స'

లేకుండా 'సేమిరా' అనడం మొదులు పెట్టాడు.


శ్రద్ధానందుని కూతురు  రెండవ శ్లోకం యిలా చదివింది.


సేతుం గత్వా సముద్రస్య గంగా సాగర సంగమం

బ్రహ్మ హత్యాపి ప్రముచ్యతే మిత్రద్రోహీ న ముచ్యతే


భావము:--సేతుస్నానము,సముద్రస్నానం గంగాసాగరసంగమము లో స్నానం

చేసినవాడికి బ్రహ్మహత్యా పాపం పోతుందేమో కానీ మిత్రద్రోహికి మాత్రం ఆపాపము ఎన్ని

చేసిననూ పోదు.


ఈశ్లోకం చదవగానే రాజకుమారుడు రెండవ అక్షరమైన 'సి' వదిలి 'మిరా' 'మిరా'

అనసాగాడు.


ఆమె  చదివిన మూడవ శ్లోకం :--    మిత్రద్రోహీ కృతఘ్నశ్చ యశ్చవిశ్వాసఘాతుకః

                                                   త్రయాస్తే నరకం యాంతి యావదాభూత సంప్లవం


భావము:--మిత్రద్రోహి,కృతఘ్నుడు,విశ్వాసఘాతకుడు ఈ ముగ్గురికీ నరకం తప్పదు.

దీనితో రాకుమారుడు 'మి' వదిలేసి 'రా' 'రా' అనసాగాడు.


ఆమె  చెప్పిన నాల్గవ  శ్లోక౦:--    రాజేంద్ర నిజ పుత్రస్య యది  కళ్యాణ మిచ్ఛసి

                                                   దేహిదానం ద్విజతిభ్యో దేవతారాధనం కురు.


రాజా నీ పుత్రుడికి మంచి జరగాలనుకుంటే బ్రాహ్మణులకు దానాలు చేసి దేవతారాధన

చెయ్యి.

నాల్గవ శ్లోకంతో రాకుమారుని  పిశాచత్వ౦  పోయి మామూలుగా అయిపోయి.అడవిలో 

జరిగిన దంతా పూసగుచ్చినట్టు చెప్పాడు.


 తన  కొడుకు మామూలుగా అయిపోగానే రాజు లేచి తెర తొలగించి అక్కడ

శారదానందనుడిని, ఆయన కూతురిని    చూసి ఆశ్చర్యపోయాడు. దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకొని

క్షమించమని ప్రాధేయపడ్డాడు. కాళ్ళు పట్టుకునేంత పని చేశాడు.


ఈకథలో ని నీతి :- ఉపకారికి అపకారము చేయరాదు. ఏనిర్ణయమైనా తీసుకునే

ముందు

ఎంత మంచి ప్రభువైనా తొందర పడకుండా నిదానించాలి., అపకారికైనా ఉపకారము

చేయవలెను.

----------------------       ----------------------

కామెంట్‌లు లేవు: