11, నవంబర్ 2020, బుధవారం

సుభాషితాలు

 --------------    ---------   సుభాషితాలు --------------

వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్, సురారాతి జీ

వనసంపత్తి నిరాకరిష్ణుఁ, గరుణావర్ధిష్ణుఁ, యోగీంద్ర హృ

ద్వనవర్తిష్ణు, సహిష్ణు, భక్తజనబృందప్రాభవాలంకరి

ష్ణు, నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్, జిష్ణు, రోచిష్ణునిన్.

 

భావము:- విష్ణుమూర్తి రాక్షసుల బతుకు తెరువులను నశింప జేసే వాడు, దయా రసంతో మించేవాడు, మహాయోగుల హృదయా లనే వనాలలో విహరించేవాడు, గొప్ప ఓర్పుగల వాడు, భక్తుల గొప్పదనాన్ని పెంపొందించేవాడు, నవయౌవనంతో వెలుగొందే లక్ష్మీదేవితో కలిసి విహరించే వాడు. జయశీలుడు, మహా కాంతిమంతుడు. అట్టి భగవంతుడిని ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూసారు.

 

    అడుగంబోనిఁక నన్యమార్గరతులం బ్రాణావనోత్సాహినై,

    యడుగంబోయినఁబోదు నీదు పదపద్మారాధకశ్రేణియు

    న్నెడకున్నిన్ను భజింపఁగాఁ గనియు నాకేలా పరాపేక్ష కో

    రెడిదింకేమి? భవత్ప్రసాదమె తగున్‌ శ్రీకాళహస్తీశ్వరా!

 

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నా ప్రాణములు రక్షింపగోరి నేను నీ భక్తి తప్ప అన్యమార్గములను ఆశ్రయించను. ఒకవేళ ఆశ్రయించినా నీ పాదపద్మభజనతత్పరులైన పరమశైవులను భజించెదను. నీ అనుగ్రహమే ఉన్న నాకు వేరొండు పదార్థములయందు వాంఛ ఏల కలుగును? ప్రభో!

 

ఏల సమస్తవిద్యల నొకించుక భాగ్యము గల్గియుండినన్

జాలు ననేక మార్గములసన్నుతి కెక్క నదెట్లొకో యనన్

ఱాలకు నేడ విద్యలు? తిరంబగు దేవత రూప చేసినన్

వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీద భాస్కరా!

 

తాత్పర్యం: భాస్కరా! రాళ్ళు విద్య నేర్వకున్ననూ వాటి అదృష్టముచే దేవతా ప్రతిమలగును. జనులు ఆ ప్రతిమలకు పూలతో అర్చనలు, పూజలు చేసి తరిస్తారు. అటులనే అదృష్టరేఖ ఉన్నచో సమాజమునందు కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతారు. అంటే విద్యలేకపోయిననూ అదృష్ట రేఖ ముఖ్యమని భావము.

 

    తనపై దయ నుల్కొనఁ గన్

   గొన నేతెంచినను శీల గురుమతులను వమ్

   దనముగఁ భజింపందగు

   మనమలరగ నిదియ విబుధ మతము కుమారా!

 

తా:--ఓ కుమారా! దయతో తనకు మంచి చేయ బూనిన వారిని గౌరవించి, నమస్కరింపుము. వారి మనస్సు సంతోషపడునట్లు చేయుటయే నీవు వారి పట్ల చూపించదగు మర్యాద. పెద్దలనుసరించే మంచి పద్ధతి యిదియే.

 

వాసన లేని పూవు బుధవర్గము లేని పురంబు నిత్య వి

శ్వాసము లేని భార్య గుణవంతుడు గాని కుమారుడున్ సద

భ్యాసము లేని విద్య పరిహాస ప్రసంగము లేని వాక్యమున్

గ్రాసము లేని కొల్వు కోరగానివి పెమ్మయ సింగధీమణీ

గ్రాసము=జీతము

 

పెట్టక కీర్తి రాదు వలపింపక యింతికి యింపు లేదు తా

దిట్టక వాదులేదు కడుధీరత వైరుల సంగరంబులో

కొట్టక వాడ లేదు కొడుకొక్కడు పుట్టక ముక్తి రాదయా

పట్టపు రాజుకైన నిది పద్ధతి పెమ్మయ సింగధీమణీ

 

మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా

గుచ్చితులున్నచోట గుణ కొవిదులుండని చోట విద్యకున్

మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండిరే ని

నచ్చట మోసముండ్రు కరుణాకార పెమ్మయ సింగధీ మణీ!

మచ్చిక=స్నేహము

 

శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృ౦

గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు

ర్వారకబంధ రాక్షసవిరామ జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

 

తా:--సంపత్ప్రదమైన రఘుమహారాజు జన్మించిన ఇక్ష్వాకు వంశములో జన్మించి,

భద్రాచల క్షేత్రములో నివసించి వున్న దయా సముద్రుడగు ఓ దశరథరామా!నీవు సుందరమైన తులసీదళమాలను ధరించిన వాడవు.శాంతము, ఓర్పు,అనే మనోహర గుణములుగలవాడవు. స్వర్గ మర్త్య పాతాళలోకములలో పొగడబడిన పరాక్రమ లక్ష్మికి అలంకారమైనవాడవు, ఎదిరించడానికి సాధ్యంకాని కబంధుడనే రాక్షసుడిని సంహరించి

నవాడవు,సముద్రమువంటి అపారమైన జనుల పాపాలను దాటింపజేసే సామర్థ్యము కలవాడవు.

 

తాతముత్తాత లెంతెంత ధనము కూడ

బెట్టి పెట్టెల నిండుగ పెట్టి యున్న

గష్టపడి తాను న్యాయమార్గమున బడయు

స్వార్జితం, బొక గవ్వతో సమము గాదు

 

చద్దన్నం మూట లాంటి ఈ మాట చెప్పింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు.

తాత ముత్తాతలు పెట్టెల నిండా కూడబెట్టి పోయిన డబ్బు ఎంతవున్నా అది మనం

శ్రమించి సంపాదించిన దాని కన్నా ఒక గుడ్డి గవ్వ విలువ చెయ్యదు.వంశపారంపర్యం గా వచ్చే ఆస్తి అక్రమ ఆస్తి కన్నా ఒక గుడ్డి గవ్వ విలువ చెయ్యదు.వంశ పారంపర్యం గా వచ్చే ఆస్తి అక్రమ ఆస్తి అని కాదు కానీ దాన్ని అనుభవించడం లో సంతృప్తి దొరకదు.తెరగా వచ్చిన సొమ్ము నీళ్ళ లాగా ఖర్చు చేస్తారు.తాను సంపాదించిన ఒక్క రూపాయితో కొబ్బరిముక్క కొనుక్కొని తిన్నా కడుపు నిండుతుంది.ఆ సంపాదన కూడా న్యాయమార్గం లో జరగాలంటున్నారు.కందుకూరివారు.

 

కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా 

న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా:

వాణ్యేకా  సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే 

క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం (భర్తృహరి సుభాషితం)

 

తా:--పురుషులకు భుజకీర్తులు,సూర్యహారములు,చంద్రహారములు మొదలగు సొమ్ములు కానీ స్నానము,చందనము పూసికొనుట,పువ్వులు ముడుచుకొనుట,కురులు దువ్వుకొనుట,మొదలగునవి నేవియు అలంకారమును కలుగజేయవు.శాస్త్ర సంస్కారం  గల వాక్కు యొక్కటే అలంకారమును   కలుగజేయును.సువర్ణ మయాది  భూషణము లన్నియు నశించును.వాగ్భూషణ మొక్కటియే నశించని  భూషణము.

 

భూషలు గావు  మర్త్యులకు  భూరి మయాంగద తారహారముల్ 

భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ 

భూషలు గావు పూరుషుని భూషితు జేయు బవిత్ర వాణి వా 

గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్ (ఏనుగు లక్ష్మణ కవి అనువాదము) 

 

మతము లెన్ని యైనను  మానవత్వ మొక్కటే

జాతు లెన్ని యైన జగతి యొకటే

పథము లెన్ని యైన పరమార్థ మొకటే

వాస్తవమ్ము నార్ల వారి మాట

కామెంట్‌లు లేవు: