11, నవంబర్ 2020, బుధవారం

తప్పు తెలుసుకున్న జింకపిల్ల

 తప్పు తెలుసుకున్న జింకపిల్ల 

https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ

✍ నారంశెట్టి ఉమామహేశ్వరరావు 

ఒక అడవిలో ఒక జింక ఉండేది. దాని పిల్లల్లో చిన్నది మొండిది. అమ్మ మాట వినేది కాదు. తోటి జంతువులతో ఆటల్లో ఎప్పుడూ గడిపేది.   

ఒకసారి తోటి పిల్లలతో ఆడుతుండగా కోతిపిల్ల “నిన్న మృగరాజు పుట్టినరోజు వేడుకకు అమ్మతో వెళ్ళాను. మంచి బహుమతి ఇచ్చి ఆహారం పెట్టారు ” అంది. 

 వెంటనే  జింకపిల్ల అమ్మ దగ్గరకు పరుగెట్టింది. “ఇప్పుడే మృగరాజును చూసొద్దాము” అంది ఏడుస్తూ. “మనం సాధుజంతువులం. అక్కడకి  వెళితే ప్రాణానికే ప్రమాదం”అంది తల్లి. జింకపిల్ల వినిపించుకోలేదు. మృగరాజును కలిశానని స్నేహితులతో చెప్పుకోవాలని కోరిక ఉండడంతో “నువ్వు రాకపోతే ఒక్కదాన్నే వెళ్తా ” అని పరుగున వెళ్ళిపోయింది. 

  దానికి దారిలో ‘అన్నా’ అని పిలుపు వినబడింది. పిలిచింది ఒక ఎలుక.  “నా తోక మీద ఒక కర్ర పడింది. దాన్ని తీశావంటే కలుగులోకి పోతాను” అని అంది.  “మృగరాజుని చూడ్డానికి వెళ్తున్నా.  తీరిక లేదు”  అనేసి వెళ్ళిపోయింది తప్ప సాయం చెయ్యలేదు జింకపిల్ల. 

 కొంత దూరం వెళ్లేసరికి “అల్లుడూ” అని పిలుపు వినబడింది. ఈసారి వేటకుక్క కనిపించింది.  “తాడుతో కట్టేసి వెళ్లిపోయాడు వేటగాడు. విడిపించావంటే తప్పించుకుంటాను” అందది.  ఎలుకకు చెప్పినట్టే చెప్పేసి వెళ్ళిపోయింది జింకపిల్ల. 

మరికొంత  ముందుకు వెళ్లేసరికి “బిడ్డా” అని పిలుపు వినబడింది. ఈసారి గోతిలో ఉన్న ఆవు కనబడింది. “పొరపాటున పడిపోయాను. దాహంతో గొంతెండి పోతోంది. ఆకు దొప్పలో కాసిన్ని నీళ్ళివ్వవా” అని అడిగింది ఆవు. ముందు చెప్పినట్టే ఆవుకీ చెప్పి వెళ్ళిపోయింది జింకపిల్ల. 

  ఈసారి జింకపిల్లకు నక్క ఎదురయి “అల్లుడూ ఎక్కడకు ప్రయాణం?” అని అడిగింది.  చెప్పింది జింకపిల్ల. “దగ్గర దారిలో తీసుకువెళతాను నాతో రా! మధ్యలో మా ఇంట్లో భోంచేసి వెళదాం” అని నమ్మించింది నక్క. జింకపిల్ల  సరేనంటూ నక్క వెనుక వెళ్లింది.  

 ఇంటి లోపలకు  వెళ్ళగానే నక్క ఓ  వలతో  జింకపిల్లను బంధించింది. “భలే దొరికావు. ఇప్పుడే వచ్చి నిన్ను వండుకు తింటాను” అని వంటింట్లోకి వెళ్ళింది నక్క. 

 జింకపిల్లకు ఏడుపు వచ్చింది. కానీ ధైర్యం తెచ్చుకుని “కాపాడండి” అని అరిచింది. 

 “వస్తున్నా” అన్న మాటలు దానికి వినబడ్డాయి. అంతలో ఆవు అక్కడకు వచ్చింది. జింకపిల్ల కాపాడమని ఆవును అడిగింది.    

“ఎవరికీ సాయం చెయ్యని నీకు ఎందుకు సాయం చెయ్యాలి?  పెద్దల మాట వినకపోతే ఇలాగే జరుగుతుంది. ఇకనుంచీ  అమ్మ మాట వింటానంటే కాపాడతా” అంది ఆవు. 

సరేనంది జింకపిల్ల. లోపల నుంచి  ఆవు మాటలను  విన్న నక్క వచ్చి దాన్ని  పొమ్మంది.  జింకపిల్లను వదిలితేనే  వెళతానని చెప్పింది ఆవు. నక్క దాని మీద దాడి చెయ్యడానికి వెళ్లబోతుండగా ...  వేటకుక్క అరుస్తూ జిత్తులమారి మీదకు దూకింది. భయంతో నక్క అక్కడనుంచి పారిపోయింది. ఆవు వెనుకే ఉన్న ఎలుక వలను కొరికి జింకపిల్లను రక్షించింది. 

“ నేను సాయం చెయ్యకపోయినా మీరు నన్ను కాపాడారు. కృతజ్నతలు” అంది జింకపిల్ల.

“అడవిలో ఒకరికొకరు సాయపడకపోతే క్రూర జంతువులకు ఆహారం అవుతాము. వేటగాళ్లకు దొరికిపోతాము. అది తెలుసుకుని  ఆపదలో ఉన్నవారిని రక్షించడం నేర్చుకో”  చెప్పింది ఆవు. 

“అసలు మీరెలా బయటపడ్డారు?” అడిగింది జింకపిల్ల. 

“నీ కోసం వెతుక్కుంటూ వెనకాలే  వచ్చిన  మీ అమ్మ మా పిలుపు విని  కాపాడింది. మేం  బయటపడ్డాం  కాబట్టే నిన్ను రక్షించగలిగాం” అని ఎలుక, వేటకుక్క, ఆవు చెప్పాయి. వాటికి  మరోసారి కృతజ్ఞతలు చెప్పిన జింకపిల్ల “మా అమ్మ ఎక్కడ?” అని అడిగింది. ఇక్కడే ఉన్నానని జింక ముందుకు రాగానే  తల్లి దగ్గరకు పరుగులు  తీసి  “పొరపాటు చేశాను. ఇకపై బుద్ధిగా ఉంటాను” అంది జింకపిల్ల. ఆప్యాయంగా జింకపిల్లను ముద్దాడింది జింక.

కామెంట్‌లు లేవు: