26, అక్టోబర్ 2020, సోమవారం

భూసేకరణ_అంటేఏమిటి

 *భూసేకరణ_అంటేఏమిటి...?*


*ఎందుకోసం భూ సేకరణ  సేకరిస్తారు ...?* 


ప్రభుత్వం వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, సెజ్‌ల, పరిశ్రమలు, రోడ్లు, ఇళ్ళస్థలాల కోసం భూములను సేకరించడం జరుగుతుంది. ఒకోమారు ప్రాణాలు పోయినా తమ భూములను ఇచ్చేది లేదంటూ, మా భూములను తీసుకుంటే ఊరుకోబోమని రైతులు ఉద్యమాలు చేస్తారు.


*భూసేకరణ అధికారులు*

 ఆర్.డి.వో./స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ ‌ (భూసేకరణ)ల ద్వారా ప్రభుత్వం నోటీసులు ఇచ్చి అవసరమైన భూములను సేకరిస్తుంది. అభివృద్ధి పేరుతో జరిగిన భారీ భూసేకరణలో వ్యవసాయానికి అనువైన, రెండు లేక మూడు పంటలు పండే భూములను కూడా ప్రభుత్వం సేకరించింది. రైతులకు పరిహారం ఇచ్చి భూములను సేకరించే పని పరిశ్రమలదే అంటూనే రెవిన్యూ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. అనేక చోట్ల భారీ కుంభకోణాలకు ఇవి తెరతీశాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు, విమానాశ్రయాలు, సిమెంటు, స్టీలు పరిశ్రమలు, రహదారులు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, ఐటీ పరిశ్రమలు.. ఇలా అనేక పేర్లతో భూములను ప్రభుత్వం సేకరించింది.


*పునరావాసం* :- భూసేకరణలో నిర్వాసితులు ఇళ్ళు, భూమి, పశువులు, చెట్లు కోల్పోతారు. పరిహారంగా లభించిన మొత్తానికి మరోచోట అంతే మొత్తం భూమిరాదు. తిండికీ, ఉపాధికీ.. రెంటికీ భూమి కీలకం. వ్యవసాయం పని  భూమి లేకపోతే రైతులు ఎందుకూ కొరగారు. పరిహారంగా డబ్బులిచ్చినా దాంతో ఏం చేసి బతకాలో తెలిసే అవకాశమూ కానరాదు. పని పోయి, విద్య లేక, మరో పని రాక మరింత పేదలవుతున్నారు. పరిహారంలో కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. అప్పులు తీరుస్తున్నారు, ఇంటి ఖర్చుల కోసం, పెళ్ళిళ్ల కోసం, వాహనాలు, ఆభరణాలు కొనటం కోసం, విందు వినోదాల వంటి వాటికోసం ఖర్చు పెడుతున్నారు. పరిహారంలో ఎక్కువ భాగం నిరుపయోగమైన రీతిలో ఖర్చైపోతోంది.


*ప్రత్యామ్నాయ పరిహార మార్గాలు* :- ప్రాజెక్టు లాభాల్లో కొంత శాతాన్ని పునరావాస ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చించాలి.

●రాయల్టీల్లోని కొంత శాతాన్ని తిరిగి ఆ ప్రాంత అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టాలి.

●స్థానిక ప్రజలకు ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పిస్తూ వారికి వాటా (ఈక్విటీ) ఇవ్వాలి.

●అభివృద్ధి నిధులతో నిర్వాసితులకు లబ్ధి చేకూరేలా చూసేందుకు ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేయాలి.

●భూమి ఇస్తున్న స్థానిక ప్రజలను ప్రాజెక్టుల్లో ప్రత్యక్ష పెట్టుబడిదారులుగా చేర్చుకోవాలి.


*భూసేకరణకు వ్యతిరేకంగా అప్పీల్ చేయవచ్చు*

భూ సేకరణ చట్టం కింద ప్రభుత్వం ఎటువంటి భూమినైనా సేకరించవచ్చు. కానీ, చట్టంలోని 5ఏ సెక్షన్ ప్రకారం భూముల యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.కొన్ని సందర్భాల్లో భూమి అత్యవసరమైతే 5ఏ సెక్షన్‌ను తోసిపుచ్చు. (17వ సెక్షన్). ఇతరుల భూములను ప్రభుత్వం సేకరించదలచినప్పుడు... ఆ చర్యను వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసే హక్కు సంబంధిత భూ యజమానులకు ఉంటుంది. ప్రభుత్వం భూమిని సేకరించదలచినప్పుడు మొదట ఇందుకోసం నోటిఫికేషన్‌ జారీచేస్తుంది.


 భూ యజమానులకు అభ్యంతరాలు తెలిపే అవకాశాన్నిస్తుంది .భూ సేకరణ చట్టంలోని అత్యవసర నిబంధనల ప్రకారం ఐతే భూ యజమానుల అభ్యంతరాలు విననక్కరలేదు. యజమానుల అభ్యంతరాలను పరిశీలించి, వాటిని నెలరోజుల్లో పరిష్కరించాలని, అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుంది. అత్యవసర నిబంధనలను అరుదైన సందర్భాల్లో మాత్రమే వినియోగించాలి.


*భూసేకరణపై పిటిషన్‌కు ఆలస్యం తగదు*


*మార్కెట్ ధర* :-

తమ భూమికి తగిన ధర చెల్లించలేదనే ఎక్కువగా రైతులుఆందోళన చేస్తారు .సుబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని బేసిక్ విలువకు 30% సొలేషియం,12% వడ్డీ(నోటిఫికేషన్ తేదీ నుండి అవార్డు తేదీ లేదా భూమిని స్వాధీనం చేసుకున్న తేదీ వరకు) కలిపి మార్కెట్ ధరగా నిర్ణయించి భూయజమానికిస్తారు. భూమిపై చెట్లు,కట్టడాలకు విడిగా పరిహారం లెక్కకట్టించి ఇస్తారు.


*సంప్రదింపులు* :-

 నిర్బంధ భూసేకరణ ప్రక్రియ వల్ల తగాదాలు పెరిగి కోర్టు తీర్పులతో తీవ్రజాప్యం జరుగుతున్నందు వల్ల  రైతులు కలెక్టర్లు జిల్లాస్థాయిలో సంప్రదింపులు జరుపుకొని మధ్యేమార్గంగా ఒక ధరకు అంగీకరించి భూసేకరణ జరిపే పద్ధతి ఇటీవల బాగా జరుగుతున్నది. ఒకసారి భూయజమానుల ప్రతినిధులు ప్రభుత్వం ప్రతిపాదించిన ధరకు ఒప్పుకున్నాక కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు.


*భూసేకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం*


మైనింగ్‌ కార్యకలాపాలకు దేశంలో ఛత్తీస్‌ఘడ్‌ తర్వాత అత్యధికంగా అటవీ ప్రాంతాన్ని కేటాయించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భూసేకరణలో మాత్రం మొదటి స్థానం రాష్ట్రానిదే .కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఐదులక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర కార్యక్రమాలకు మళ్లించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పరిశ్రమల కారణంగా ఎక్కువమంది నిరాశ్రయులు కానున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వల్ల లక్షా 20 వేల కుటుంబాలు నిరాశ్రయులు కానున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల కారణంగా వందల గ్రామాలు కనుమరుగుకానున్నాయి. దళితులు, పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను తిరిగి స్వాధీనం చేసుకొన్నారు.


*భూములు మళ్లీకొనలేని పరిస్థితి*


సేకరించిన భూములకు ఇచ్చే పరిహారంతో మళ్లీ భూములు కొనడానికి వీల్లేని పరిస్థితి. రైతుల నుంచి భూములు సేకరించడం మొదలు పెడుతూనే చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగి వారికి అందుబాటులో లేకుండా పోయాయి. కొందరికి వచ్చిన పరిహారం అప్పటికే ఉన్న అప్పులకు సరిపోయింది. అనేకమంది రైతులు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి కూలి పనులు చేసుకొంటున్నారు. కొన్ని చోట్ల నిన్న వరకు భూ యజమానులుగా ఉన్న రైతులు ఇప్పుడు తమ భూముల్లో ఏర్పాటుకానున్న పరిశ్రమల్లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. వచ్చిన పరిహారం ఖర్చయిపోతుండటం, కుటుంబ సభ్యులతో కలిసి వీధుల పాలు కావల్సి రావడం, పరిహారంతో మళ్లీ భూములు కొనలేని పరిస్థితి ఏర్పడటంతో అసంతృప్తి పెరుగుతోంది. ప్రజా ప్రయోజనం కోసం మాత్రమే వ్యక్తిపరమైన ఆస్తుల్ని తీసుకోవాలి, పంటలు పండే పొలాల్ని వ్యాపార, పారిశ్రామిక ఉద్దేశాలకై తీసుకోరాదు. ప్రభుత్వ రంగంలోని ప్రాజెక్టులు కాకపోతే, 70 శాతం భూముల్ని సొంతంగా కొనుక్కోవాలి. మిగతా 30 శాతం మాత్రమే భూసేకరణ అనుమతించాలి. ప్రాజెక్టు ఫలాల్లో రైతుల్ని భాగస్వామ్యం చెయ్యాలి, ఏ అవసరం కోసం ప్రభుత్వం భూమిని సేకరించిందో, ఆ అవసరం నిమిత్తం భూమిని ఉపయోగించకపోయినప్పటికీ, ఆ భూమిని తిరిగి తనకు స్వాధీనం చేయాలని కోరే హక్కు సొంతదారుకు ఉండదు. తిరిగి ఆ భూమిని సొంతదారుకు స్వాధీనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. భూమిని ప్రతిపాదిత ప్రయోజనానికి ఉపయోగించకపోతే ఇంకొక ప్రజా ప్రయోజన కార్యక్రమానికి ప్రభుత్వం వినియోగించాలి.


*నియమాలు నిబంధనలు*


*మార్కెట్‌ విలువను నష్టపరిహారంగా చెల్లించాలి.*


అల్ప సంఖ్యాకవర్గాల విద్యాసంస్థల ఆస్తుల్ని తీసుకుంటున్నప్పుడు వారి హక్కులకు భంగం లేని పద్ధతిలో నష్టపరిహారం చెల్లించాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే భూమి కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలి. 


●అది ఏ విధంగా అనేది నిర్ణయించడానికి గ్రామసభల్లోనూ, మండల పరిషత్తులలోనూ చర్చించాలి.అత్యవసరం అవునా? కాదా? అనేది కోర్టులు తేలుస్తాయి.అత్యవసర అధికారాల్ని ప్రభుత్వం వినియోగించినప్పుడు ముందుగా 80 శాతం నష్ట పరిహారాన్ని భూయజమానులకు చెల్లించాలి. ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ మొత్తాన్ని కోర్టులో జమచెయ్యాలి. ఇది ముందస్తు చెల్లింపు మాత్రమే.నష్ట పరిహారాన్ని నిర్ణయించిన తర్వాత పూర్తి చెల్లింపులు చేయాలి.


●కలెక్టరు... లేదా అధీకృత అధికారి భూ సేకరణ చేయాలనుకునే స్థలం సర్వే నెంబర్లు, కొలతలతో పటం తయారు చెయ్యాలి.


●హక్కు, ప్రయోజనం ఉన్నవారందరికీ భూమిని స్వాధీనం చేసుకోబోతున్నట్లు... నష్టపరిహారం ఎంత కావాలో తెలపాల్సిందిగా నోటీసులు ఇవ్వాలి. అందులో భూమికి సంబంధించిన మొత్తం వివరాలు ఉండాలి.


●భూమికి సంబంధించిన వివరాలు, నష్ట పరిహారం,అర్హులైన వ్యక్తుల వివరాలతో రెండు సంవత్సరాల్లోగా అవార్డు తీర్పు ఇవ్వాలి. ఏ రకమైన స్టే లేకుండా ఈ వ్యవధి మీరితే భూసేకరణ చెల్లకుండా పోతుంది.


*కంపెనీల అభ్యర్థనపై భూ సేకరణ ప్రజాప్రయోజనం కింద రాదు*


●అవార్డు ప్రతిని ఇఛ్ఛి భూమిని స్వాధీనం చేసుకోవాలి. అవార్డులో నిర్ణయించిన సొమ్ము తక్కువనిపిస్తే, కోర్టుకు నివేదించమని కోరాలి.దానికి కోర్టు ఫీజూ చెల్లించనక్కర్లేదు.


●ఇవ్వజూపిన పరిహారం నా హక్కులకు భంగం లేని విధంగా నిరసనతో స్వీకరిస్తున్నాను. ఈ విషయాన్ని కోర్టుకు నివేదించండి అంటూ రాసి తీసుకోవచ్చు.


●హౌసింగ్ కాలనీల అభివృద్ధి కోసం ప్రజల భూములను 'అత్యవసర నిబంధన'ను అడ్డుపెట్టుకుని స్వాధీనం చేసుకోరాదు.ప్రకృతి విపత్తులతో నిర్వాసితులైన వారికి, ప్రాజెక్టుల నిర్మాణం కోసం తరలించిన వారికి పునరావాసం కల్పించడం కోసం, సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి అత్యవసరంగా గృహాలు నిర్మించాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే 'అత్యవసర నిబంధన'ను ఉపయోగించాలి.


●భూములను స్వాధీనం చేసుకున్నాక, ఆ భూములపై సొంతదారులకు ఎటువంటి హక్కులు ఉండవు.పరిహారం చెల్లించే విషయంలో ఆలస్యం జరిగినా కూడా సొంతదారులకు కేవ లం పరిహారం విషయంలో మాత్రమే హక్కు ఉంటుంది తప్ప, ప్రభుత్వం సేకరించిన భూమి పై ఎటువంటి హక్కులు ఉండవు. ఏ అవసరం కోసం ప్రభుత్వం భూమిని సేకరించిందో, ఆ అవసరం నిమిత్తం భూమిని ఉపయోగించకపోయినప్పటికీ, ఆ భూమిని తిరిగి తనకు స్వాధీనం చేయాలని కోరే హక్కు సొంతదారుకు ఉండదు. తిరిగి ఆ భూమిని సొంతదారుకు స్వాధీనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు.


●డిజైన్‌ నమూనా పూర్తిగా ఖరారు చెయ్యకుండా, కచ్చితంగా నిర్ధారించకుండా, వాటికి అనుమతులు తీసుకోకుండా అలైన్‌మెంట్‌ తుది నమూనాను ఆమోదించకూడదు.భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేశాక తగిన కారణం లేకుండా వదలకూడదు.అలైన్‌మెంట్‌ను మార్చకూడదు.


●నోటిఫికేషన్ వెనక ప్రజా ప్రయోజనం లేదనీ, దురుద్దేశంతో, నిర్హేతుకంగా చట్టవ్యతిరేకంగా తన ఆస్తి తీసుకుంటున్నారని సవాల్‌ చేసే హక్కు యజమానికి ఉంటుంది.


●నీటి చెలమలు, చెరువులు అంతర్థానమయ్యేలా అలైన్‌మెంట్లను తయారుచేయకూడదు.


●భూసేకరణలో ఒకరికి హానిచేస్తూ మరొకరికి సహాయం చెయ్యాలని తలపెడితే ఆ సేకరణ ప్రజా సంక్షేమం కోసమే అయినా సరే దురుద్దేశపూరితమే అవుతుంది.


*భూసేకరణ చట్టలోని ముఖ్యమైన సెక్షన్ల  గురించి తెలుసుకుందాం*


●భూసేకరణకు 2013 చట్టం నిబంధనలు కచ్చితంగా పారదర్శకంగా అమలు చేయాలి. అప్పుడే ఆయా రైతుల హక్కులను కాపాడుకోడానికి వీలవుతుంది. బ్రిటిష్‌ ప్రభుత్వం 1894లో భూసేకరణ చట్టం తెచ్చింది.  ఇప్పటి వరకు 17 సార్లు ఈ చట్టాన్ని సవరించడం జరిగింది.  2013 యుపిఎ ప్రభుత్వ భూసేకరణ చట్టం చేసేవరకూ కొనసా గింది. 1950,1960, 1970లలో ప్రభుత్వాలు చేపట్టిన అనేక భారీ పరిశ్రమలకు, నీటిపారుదల ప్రాజెక్టులకు భూసేకరణ 1894 చట్టం ప్రకారమే జరిగింది.అవసరాలకు సరిపడే భూమిని సేకరించడం రైతులను ఒప్పించడం నష్టపరిహార సమస్యలు, నిర్వాసితుల సమ స్యలు పరిష్కరించటం మొదలగు అంశాల్లో ప్రభుత్వాలు చొరవ చూపడంతో ఎక్కువ వివాదాలు ఏర్పడలేదు.

 

●రాజ్యాంగంలో 1,4, 17,24 మొదలగు రాజ్యాంగ సవరణలన్నీ భూమికి సంబంధించిన వివాదాల గురించే జరిగాయి. గోలక్‌నాథ్‌ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్‌ కేసు మొదలగు వాటిలో భూమి, ఆస్తి వివాదాలు ముడిపడి ఉన్నాయి. 


●25ఏళ్ల కిందట 1991లో భారతదేశంలో సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి దేశంలో అన్ని రంగాల్లో ప్రవేటీకరణ విధానాలు ఆచరణలోకి వచ్చాయి. అంతవరకు ప్రభుత్వ రంగానికి పరిమితమైన పరిశ్రమలలో కూడా ప్రయివేట్‌ రంగాన్ని అనుమతించారు. అభివృద్ధి పేరుతో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) పారిశ్రామిక పార్కులు, ఐటి పార్కులకు అనుమతులి చ్చారు. వీటి ఏర్పాటుకు లక్షలాది ఎకరాల భూసేకరణ జరిగినది. 2000 సంవత్సరం నాటికి దేశంలో క్రోనికాపిటలిజం (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) విస్తృతంగా వ్యాప్తి చెందింది. ప్రభుత్వాలు అభివృద్ధి పేరు తో అవసరానికి మించి భూమిని సేకరించి ప్రయివేట్‌ సంస్థలకు కేటాయించాయి. ప్రైవేట్‌ యాజమాన్యాలు పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో తీసుకున్న వేలాది ఎకరాలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు వినియోగించారు. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా సామా జిక ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు చేసిన ఆందోళన ఫలితంగా భూసేకరణ చట్టం-2012 రూపుదిద్దుకున్నది.


●2013 భూసేకరణ చట్టం ముఖ్యాంశాలు 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత భారత పార్లమెంటు చేసినచట్టాల్లో ఒక ముఖ్యమైన చట్టంగా 2013 భూసే కరణ చట్టాన్ని సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చట్టంలోని కొన్ని ప్రధానమైన అంశాలు. 


●సెక్షన్‌ 4 ప్రకారం వ్యవసాయ కార్మికులు,వృత్తిదారులు, చిరువ్యాపారులు,ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికీ నష్టపరిహారం చెల్లించాలి. ఉపాధి కల్పించాలి.


●సెక్షన్‌ 4(1)ప్రకారం భూసేకరణ వల్ల జరిగే సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలి. భూసేకరణ వల్ల జరిగే నష్టం, నిర్వాసితుల కుటుంబాల సంఖ్య, ఉమ్మడి ఆస్తుల వివరాలు మొదలగు అంశాలను అధ్యయనం చేసి ఆ నివేదికను ప్రజలమధ్య ఉంచి బహిరంగ విచారణ చేసి తెలియచెప్పాలి. స్థానిక ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, అధికారులు ఏడుగురితో కమిటీ వేసి విచారించాలి. 


●సెక్షన్‌ 10(1) ప్రకారం సాగులో ఉన్న బహుళ పంటలు పండే భూమిని సేకరించరాదు. అనివార్యమైతే ఆ భూమికి బదులు ప్రత్యామ్నాయ భూమికి నీటి సౌకర్యం కల్పించి ఆ భూమిని అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి అవసరాల కోసం భూమిని తీసుకుంటే 70 శాతం, ప్రయివేటు సంస్థలకైతే 80 శాతం బాధిత కుటుంబాలు ఆమోదిస్తేనే భూసేకరణ మొదలు పెట్టాలి. షెడ్యూల్‌ ఏరియాలో గిరిజన భూములైతే ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని స్వాధీనం చేసుకుని బదిలీ చేయరాదు.


●సెక్షన్‌ 12(ఇ) ప్రకారం హక్కుదారుని అనుమతి లేకుండా ఆమోదం తెలపకుండా సదరు భూమిలోకి వెళ్లి ఎట్టి పనులూ చేయడానికి వీల్లేదు. కనీసం సర్వే కూడా చేయరాదు. .


●సెక్షన్‌ 26(1) ప్రకారం భూములకు నష్టపరిహారం చెల్లించాలి. భూసేకరణ ప్రతిపాదించిన సంవత్సరం నుంచి గతమూడు సంవత్సరాలపాటు పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు, కొనుగోలు భారత స్టాంపుల చట్టం 1899 మేరకు నిరారించిన భూమి మార్కెట్‌ విలువ ఆధారంగా ఏది ఎక్కువ ధరకు అమ్ముడుపోయి ఉంటే దాని ఆధారంగా నాలుగురెట్లు అధికంగా ఇవ్వాలి. సకాలంలో నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యమైతే 9 శాతం వడ్డీతో ఇవ్వాలి. 


●సెక్షన్‌ 45 ప్రకారం సేకరించే భూమి 99 ఎకరాలకు మించితే పునరావాసం, రీసెటిల్‌మెంట్‌ కోసం బాధిత మహిళలు, స్వచ్ఛందసంస్థ, జాతీయబ్యాంకు అధికారి, స్థానిక సంస్థల ప్రతినిధి, ఎమ్మెల్యేలతో కమిటీ వేసి బాధితులకు పరిహారం అందించాలి.

 

●సెక్షన్‌ 102 ప్రకారం సేకరించిన భూమిలో ఐదేళ్లలోపు ఎటువంటి అభివృద్ధి పనులూ చేపట్టకపోతే భూమి కోల్పోయిన వారికి తిరిగి ఇవ్వాలి. 


●సెక్షన్‌ 32 నుంచి 105 వరకు భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇతర ప్రాంతాల కు వెళ్లాల్సివస్తే వారికి విద్య, వైద్యం, ఇళ్లు, రోడ్లు వంటి 25 రకాల సౌకర్యాలు కల్పించాలి.


● సెక్షన్‌ 85 ప్రకారం పరిహారం పునరావాసం, రీసెటిల్‌మెంట్‌కు సంబంధించి ఏ అంశాలనైనా ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు ఎవరైనా ఉల్లంఘిస్తే సదరు వ్యక్తులకు కనీసంగా ఆరు నెలలు, గరిష్టంగా మూడు సంవత్సరాలపాటు శిక్ష విధించవచ్చు.


●2013 భూసేకరణ చట్టం రైతులకు వ్యవసాయ కార్మికులకు గ్రామీణ పేదలకు కొంత మేరకు భరోసా కల్పించింది.


●2014లోఅధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అభివృ ద్ధికి అడ్డుపడుతుందనే పేరుతో చట్టంలోని ప్రధాన అంశాలను తొలగిస్తూ బిల్లును ప్రతిపాదించింది. రాజ్యసభలో తగిన బలం లేకపోవడంతో రాష్ట్రపతి ఆమోదంతో ఆర్డినెన్స్‌తెచ్చింది. అయితే ఆర్డినెన్స్‌ కాలపరిమితి తీరిపోవడంతో ప్రస్తుత 2013 భూసేకరణ చట్టం ప్రకారం కొనసాగుతున్నది.


*సుప్రీంధర్మాసనం* :- భూసేకరణ చట్టాన్ని సంస్కరించాలని, పరిశ్రమలు, సెజ్‌ల ఏర్పాటుకోసం ప్రభుత్వం భూ సేకరణదారుగానే కాదు, పేదల పక్షాన వారి ప్రయోజనాల పరిరక్షకురాలిగానూ వ్యవహరించాలని సూచించింది. సారవంతమైన పొలాలున్న సన్న చిన్నకారు రైతులకు, వాటిలో 'సెజ్‌'లు నెలకొల్పదలచినవారికీ మధ్య దేశంలో ఇప్పుడు భూ పోరాటం సాగుతోందని డాక్టర్‌ స్వామినాథన్‌ అన్నారు. భూసేకరణపై సమగ్ర బిల్లు తెస్తున్నామని కేంద్రసర్కారు ప్రకటించింది. పవార్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం బిల్లు విధివిధానాలను రూపొందిస్తోంది. దీని ప్రకారం ప్రైవేటు పరిశ్రమలకోసం పారిశ్రామికవేత్తలే స్వయంగా 70శాతం భూమి సేకరించుకొంటే, ప్రభుత్వం మిగిలినదాన్ని సమకూరుస్తుంది. ఏడాదికి ఒక పంట కంటే ఎక్కువ పండే భూముల్ని భూసేకరణ నుంచి మినహాయిస్తారు.భూసేకరణ జరగకముందున్న జీవన అజిత్‌ సింగ్‌, మమతా బెనర్జీ వాదిస్తున్నారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాజధాని పేరిట మూడు పంటల పండే భూమిని చట్టాలకు విరుద్ధంగా సేకరించడం జరిగింది.


*ఎస్.ఆర్.ఆంజనేయులు*

*న్యాయవాది -9848018828*

కామెంట్‌లు లేవు: